దసరా టార్గెట్ అంటున్న టాలీవుడ్ చిత్రాలు.. మరి తమిళ్ మూవీలకు థియేటర్లు లభిస్తాయా?
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ సంబంధం లేకుండా థియేటర్లలో ఆ సినిమాలను ఆయా భాషలలో డబ్బింగ్ వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు.
థియేటర్లలో ఒక సినిమా విడుదల కావాలి అంటే.. ఆ సినిమా విడుదలయ్యే సమయంలో ఆ సినిమాకు మరో సినిమా పోటీ లేకుండా పండుగ సమయాలలో లేదా హాలిడేస్ ఉన్న సమయంలో మాత్రమే సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు ఆశిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా చిత్రాలు పాన్ ఇండియా భాషలో విడుదలవుతున్న నేపథ్యంలో అటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ సంబంధం లేకుండా థియేటర్లలో ఆ సినిమాలను ఆయా భాషలలో డబ్బింగ్ వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు దసరా టార్గెట్ గా ముందే కోలీవుడ్ చిత్రాలు తమ డేట్ ను అనౌన్స్ చేసినప్పటికీ.. తెలుగు సినిమాలు కూడా వరుసగా దసరా హాలిడేస్ ను టార్గెట్ గా చేసుకుంటుండడంతో తమిళ్ చిత్రాలకు తెలుగులో థియేటర్లు లభిస్తాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. రజినీకాంత్ జైలర్ 2 మొదట అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా ఆ సమయంలో మరో తెలుగు సినిమా లేకపోవడంతో జైలర్ 2 సినిమాతో భారీ కలెక్షన్లు వసూలు చేసుకోవాలని కూడా ఆశించారు. అయితే ఇప్పుడు తెలుగు చిత్రాలు వరుసగా దసరా హాలిడేస్ ను టార్గెట్ చేస్తూ ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్లు ప్రకటిస్తుండడంతో జైలర్ 2 సినిమాకి తలనొప్పిగా మారింది.
టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉండగా.. ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న విడుదల చేయాలని అనుకున్నారు. ఒకవేళ ఆ డేట్ వర్కౌట్ కాకపోతే అక్టోబర్ 16వ తేదీన రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అటు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా వస్తున్న రణబాలి సినిమాను మొదట సెప్టెంబర్ 11వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఆస్థానంలో ఆనంద్ దేవరకొండ ఎపిక్ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఈ చిత్రం కూడా అక్టోబర్ 16న రిలీజ్ చేయాలని మైత్రి మూవీ మేకర్స్ భారీగా అనౌన్స్ డేటును అధికారికంగా ప్రకటించింది.
ఇలా టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థలు ఈ రెండు చిత్రాలను దసరా సెలవుల సందర్భంగా రిలీజ్ కి ఉంచుతున్న నేపథ్యంలో థియేటర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమయంలో జైలర్ 2 సినిమాకి థియేటర్లు లభిస్తాయా? అనే కామెంట్లు వ్యక్తం అవుతుండడంతో మరొకవైపు జైలర్ 2 నిర్మాతలు కూడా ఈ విడుదల తేదీని మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం అయితే స్పష్టంగా వినిపిస్తోంది.
అయితే ఇదే సమయంలో మరో వాదన కూడా తెరపైకి రావడం గమనార్హం. సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి సినిమా థియేటర్లలోకి వస్తోంది అంటే ఈ చిత్రానికి పోటీగా ఏ సినిమా వచ్చినా సరే అది నిలబడలేదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సూపర్ స్టార్ రజినీకాంత్ కు తెలుగు రాష్ట్రాలలో అపారమైన స్టార్ డం , భారీ అభిమానగణం ఉంది. మొదట జైలర్ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగు ప్రేక్షకులలో కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తమిళ మూలాలు ఉన్న చిత్రాలు తెలుగు మార్కెట్లో మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి. ఇప్పటికే సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ అలాగే లోకేష్ కనగరాజ్ నటించిన డిసి సినిమాలు తెలుగులోనే పెద్ద బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి.. మరి ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని సినిమాను విడుదల చేస్తారా లేక వాయిదా వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.