హీరోయిన్‌కు లాభాల్లో వాటా.. నిర్మాత పెద్ద మ‌న‌సు!

సినీ పరిశ్రమలో అగ్ర హీరోలకు పారితోషికంతో పాటు లాభాల్లో వాటా ఇచ్చే సంప్రదాయం చాలా కాలంగా ఉంది.;

Update: 2026-03-29 22:30 GMT

సినీ పరిశ్రమలో అగ్ర హీరోలకు పారితోషికంతో పాటు లాభాల్లో వాటా ఇచ్చే సంప్రదాయం చాలా కాలంగా ఉంది. ఈ విధానం వల్ల నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గుతుందనే ఉద్దేశంతో మహేష్ బాబు వంటి స్టార్లు తమ సొంత బ్యానర్లను నిర్మాణ భాగస్వాములుగా చేర్చుకుంటున్నారు. టాలీవుడ్‌లో అల్లు అర్జున్, బాలీవుడ్‌లో ఖాన్ త్రయం వంటి వారు కూడా ఇదే బాటలో పయనిస్తూ నిర్మాతలకు ఊరటనిస్తున్నారు. అయితే ఒక స్టార్ హీరో స్థాయిలోనే ఇప్పుడు ఒక హీరోయిన్‌కు కూడా లాభాల్లో వాటా దక్కడం భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

నిర్మాత దిల్ రాజు తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం లేడీ సూపర్ స్టార్నయనతారతో ఇటువంటి ఒక అరుదైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నయన్ ట్రెండ్ సెట్ చేయబోతోంది. కేవలం పారితోషికం మాత్రమే కాకుండా.. సినిమా వచ్చే లాభాల్లో కూడా వాటా అందుకోనుంది. ఈ రకమైన బిజినెస్ డీల్ ఒక హీరోయిన్ కు దక్కడం భారతీయ సినిమాలో చాలా అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.

నయనతార ఒక్కో సినిమాకి 5 నుంచి 10 కోట్లు అందుకుంటున్నారు. ఇప్పుడు ఆ నంబర్‌ను మరింత పెంచినట్లు తెలుస్తోంది. భారీ మొత్తాన్ని రెమ్యూనరేషన్ రూపంలో ఇచ్చి రిస్క్ తీసుకోవడం కంటే.. సినిమా బిజినెస్ .. లాభాల్లో వాటా ఇవ్వడమే మేలని నిర్మాత దిల్ రాజు భావించినట్లు తెలుస్తోంది. ఈ మోడల్ వల్ల అటు నటికీ గౌరవం ..ఇటు నిర్మాతకు కూడా ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.

నయనతార వంటి అగ్ర నటి ఈ రేంజ్ డీల్ కుదుర్చుకోవడం ఇప్పుడు ఇతర హీరోయిన్లకు కూడా స్ఫూర్తినిస్తోంది. భవిష్యత్తులో భారీ పారితోషికాలు డిమాండ్ చేసే సమంత, దీపికా పదుకొనే, ఆలియా భట్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఇదే ప్రాతిపదికన సినిమాలకు సంతకాలు చేసే అవకాశం ఉంది. అయితే ఇటువంటి ఒప్పందాలు అందరు హీరోయిన్లకూ వర్తించవు. తలైవి రేంజు ఇమేజ్ ఉంటేనే ఇది సాధ్యమవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా.. నయనతార క్రేజ్ ఇప్పుడు ఒక అగ్ర హీరో స్థాయికి చేరుకుందని ఈ డీల్ స్పష్టం చేస్తోంది. ఒక పక్క సల్మాన్ ఖాన్ లాంటి స్టార్..మరోపక్క దిల్ రాజు వంటి సక్సెస్ ఫుల్ నిర్మాతతో కలిసి నయన్ చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే హీరోయిన్ల పారితోషికాల విషయంలో ఒక కొత్త శకం మొదలవుతుంది. సినిమా రిజల్ట్‌ను బట్టి తన ఆదాయం ఉండేలా ప్లాన్ చేసుకున్న నయన్ అడుగులు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఒక హీరోయిన్ కి లాభాల్లో వాటా ఇవ్వాల‌నే నిర్మాత ఆలోచ‌న చాలా ఆద‌ర్శ‌వంత‌మైన‌ది అని కూడా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

Tags:    

Similar News