'పెద్ది' రిలీజ్‌ ఆపేందుకు తెర‌వెన‌క కుట్ర‌? నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన `పెద్ది` విడుద‌ల‌ చుట్టూ జరుగుతున్న తెరవెనుక రాజకీయాలపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-05-20 04:02 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూషన్ - థియేటర్ల లీజుల వ్యవహారాలు (రెంటల్ వ‌ర్సెస్ పర్సంటేజ్ పద్ధతి) తీవ్ర వివాదానికి దారితీసిన తరుణంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన `పెద్ది` విడుద‌ల‌ చుట్టూ జరుగుతున్న తెరవెనుక రాజకీయాలపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమను శాసిస్తున్న కొందరు పెద్దలు `పెద్ది` సినిమా విడుదలను అడ్డుకోవడానికి... మైత్రి మూవీ మేకర్స్ సంస్థను దెబ్బతీయడానికి ఎలాంటి తంత్రాలు నడుపుతున్నారో కుండబద్దలు కొట్టారు. పైకి మీడియా ఎదుట ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడే వ్యక్తులు.. లోపల మాత్రం డిస్కషన్ల పేరిట థియేటర్ల వ్యవస్థను వాడుకుంటూ కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు.

నట్టి కుమార్ విశ్లేషణ ప్రకారం.. ఈ గొడవ మొత్తం ఇండస్ట్రీలోని ఇద్దరు అగ్ర శక్తుల మధ్య నడుస్తున్న `ఈగో` వివాదమే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు - మైత్రి మూవీ మేకర్స్ మధ్య ఉన్న వ్యక్తిగత, వ్యాపారపరమైన స్పర్థల కారణంగానే ఈ సమస్య ఇంత పెద్దదిగా మారింది. మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్‌ను మూయించాలని, వారి తదుప‌రి చిత్రాలను థియేటర్లలో సరిగ్గా రిలీజ్ కానివ్వకుండా చేసి, వారిని నష్టాలల్లోకి నెట్టాలనే ఒక నిగూఢ మంత్రాంగం తెరవెనుక నడుస్తోందని నట్టి కుమార్ ఆరోపించారు. ఎగ్జిబిటర్లు- డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను సాకుగా చూపిస్తూ.. అంతిమంగా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ను తొక్కేయాలనే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు.

అయితే ఈ గొడవల్లో ఎప్పుడూ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ సినిమాలకే ఎందుకు సమస్యలు వస్తున్నాయనే అంశంపై నట్టి కుమార్ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. మెగా హీరోల చిత్రాలు విడుదలవుతున్న ప్రతిసారీ ఇండస్ట్రీలో థియేటర్ల వివాదాలు, రెంట్ల పంచాయితీలు తెరపైకి రావడం వెనుక ఒక పక్కా ప్లాన్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు విష‌యంలో ఏం జ‌రిగిందో తెలుస‌న్నారు. అఖండ 2, రాజాసాబ్ చిత్రాల‌కు ఆ స‌మ‌స్య రాలేద‌ని గుర్తు చేసారు. తెరవెనుక జరుగుతున్న తంత్రాన్ని, కుట్రలను మెగా హీరోలంతా నిశితంగా గమనిస్తున్నారని ఆయన వెల్లడించారు. స్వయంగా చిరంజీవి గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ పరిణామాలను చూస్తున్నారని... సమయం వచ్చినప్పుడు వీటికి అడ్డుకట్ట పడటం ఖాయమని నట్టి కుమార్ హెచ్చరించారు. మీడియా ఎదుట పెద్ది రిలీజ‌వుతుంద‌ని క‌ల‌రింగ్ ఇచ్చినా తెర‌వెన‌క మంత్రాంగం వేరే న‌డుస్తోంద‌ని వివ‌రించారు.

సినిమా పరిశ్రమలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. అంతిమంగా `కంటెంటే కింగ్` అని నట్టి కుమార్ గట్టిగా స్పష్టం చేశారు. థియేటర్ల లీజుల గొడవలతో `పెద్ది` సినిమా రిలీజ్ ని ఆపడం ఎవరితరం కాదని ఆయన నమ్మకాన్ని వ్యక్తపరిచారు. కథలో దమ్ము ఉండి.. ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని డిసైడ్ అయితే గ‌నుక ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదా థియేటర్ల మోనోపలీ ఉన్నా జనాలు బ్రహ్మరథం పడతారని చెప్పారు. సినిమా టికెట్ కొనే ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేలా.. పరిశ్రమలోని మూడు వ్యవస్థలు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసి పని చేయాలే తప్ప... ఒకరిపై ఒకరు ఈగోలతో పంతాలకు పోతే పరిశ్రమకే నష్టమని హితవు పలికారు.

35 నుండి 40 సంవత్సరాల సినీ అనుభవం ఉన్న వ్యక్తిగా తాను చిన్న నిర్మాతల పక్షాన పోరాడుతున్నట్లు నట్టి కుమార్ తెలిపారు. పెద్ద సినిమాల రేట్లు పెంచుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ పెద్దల ఈగో గొడవల వల్ల చిన్న సినిమాలు, మైత్రి వంటి పెద్ద బ్యానర్లు ఇబ్బంది పడకూడదని అన్నారు. ప్రేక్షకుడికి వినోదాన్ని సరసమైన ధరలకే అందిస్తూ.. ఇండస్ట్రీలో హెల్తీ వాతావరణం తీసుకురావాల్సిన బాధ్యత సబ్ కమిటీల్లో ఉన్న ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఈ `పెద్ది` పంచాయితీ ద్వారా అయినా ఇండస్ట్రీలో మోనోపలీ శక్తుల ఆటలు సాగవనే నిజం అందరికీ అర్థం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News