ఒకే టైటిల్ తో మూడు సినిమాలు!

టాలీవుడ్ లో టైటిల్స్ సెలక్షన్ అనేది ఎప్పుడూ ఆసక్తికరమైన విషయమే.;

Update: 2026-03-28 08:30 GMT

టాలీవుడ్ లో టైటిల్స్ సెలక్షన్ అనేది ఎప్పుడూ ఆసక్తికరమైన విషయమే. ముఖ్యంగా పాత సూపర్ హిట్ సినిమాల పేర్లను రిపీట్ చేయ‌డం అన్న‌ది ప‌రిపాటే. అది సెంటిమెంట్ కావొచ్చు లేదా? క‌థ‌కు ఆ టైటిల్ అయితే నే ప‌క్కాగా యాప్ట్ అవుతుంద‌న్న కోణ‌లో మేక‌ర్స్ ప‌ట్టుబట్టి మరీ ఎంపిక చేస్తుంటారు. ఈ క్రమంలోనే `నారీ నారీ నడుమ మురారి' అనే ఎవర్‌గ్రీన్ టైటిల్ ఇప్పుడు ముగ్గురు వేర్వేరు తరం హీరోల సినిమాల‌కు పెట్ట‌డం విశేషం. ఒకే టైటిల్‌తో ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ బరిలో నిలవడం సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారింది. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే..

తొలుత ఈ టైటిల్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చింది నందమూరి నటసింహం బాలకృష్ణ. కోదాండ‌రామిరెడ్డి దర్శ కత్వంలో రిలీజ్ అయిన `నారీ నారీ నడుమ మురారి` అప్పట్లో ఒక సంచలనం. బాలయ్య కెరీర్‌లో ఇదొక క్లాసిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా నిలిచిపోయింది. ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య నలిగిపోయే హీరో పాత్రలో బాలయ్య తన మార్కు నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇప్పటికీ ఈ సినిమా పాటలు, కామెడీ సీన్లు బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంటాయి. 1990లో ఈ సినిమా రిలీజ్ అయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇదే క్రేజీ టైటిల్‌ను యువ హీరో శర్వానంద్ తన సినిమా కోసం ఎంచుకున్నారు.

సంక్రాంతి కానుకగా విడుదలైన శర్వానంద్ ( నారీ నారీ న‌డుమ మురారీ) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. శర్వానంద్ తన సహజసిద్ధమైన నటనతో ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఈ కథను పండించారు. పాత టైటిల్ అయినప్పటికీ కొత్త తరహా కథాంశంతో రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. పండగ వాతావరణానికి ఈ టైటిల్ సరిగ్గా సరిపోయింది. తాజాగా మ‌రో యంగ్ హీరో నాగశౌర్య కూడా తన తదుపరి చిత్రానికి ఇదే టైటిల్‌ను ఖరారు చేయడం విశేషం. గ‌త కొంత కాలంగా నాగ‌శౌర్య‌కు స‌రైన స‌క్సెస్ లు ప‌డ‌ని సంగ‌తి తెలిసిందే. న‌టించిన సినిమాలేవి క‌లిసి రాలేదు.

ఈ క్ర‌మంలో కెరీర్ ప‌రంగా కొంత గ్యాప్ కూడా ఏర్ప‌డింది. ఇప్పుడా గ్యాప్ ను ఒకే సారి రెండు..మూడు సినిమాల రిలీజ్ తో పుల్ ఫిల్ చేయాల‌ని చూస్తున్నాడు . ఈక్ర‌మంలోనే ఓ సినిమాకు నారీ నారీ న‌డుమ మురారీ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. వికీలో స‌మాచారం సైతం అదే టైటిల్ తో అప్ డేట్ అయింది. ఆ రకంగా నాగశౌర్య, ఈ లక్కీ టైటిల్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఇదే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుందీ చిత్రం.

మూడ‌వ సారి ఇదే టైటిల్ ను రిపీట్ చేసాడంటే వెనుక బ‌ల‌మైన కార‌ణం త‌ప్ప‌క ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. అయితే ఇదే టైటిల్ తో ఒకే ఏడాది రెండు సినిమా రిలీజ్ అవ్వడం మాత్రం ఇదే తొలిసారిగా చెప్పొచ్చు. మ‌రి ఈ టైటిల్ నాగశౌర్య‌కు ఎలాంటి విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి. ఒకే టైటిల్ ఉన్నప్పటికీ, ముగ్గురు హీరోల కథలు వేర్వేరు నేపథ్యాల్లో ఉంటుంది. బాలయ్య సినిమా పక్కా పల్లెటూరి వాతావరణంలో సాగితే, శర్వానంద్ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగింది. ఇప్పుడు నాగశౌర్య ఈ టైటిల్‌ను ఏ విధంగా చూపిస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. టైటిల్ పాతదే అయినా, ట్రీట్‌మెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. టైటిల్ అనేది పాత‌దా? కొత్త‌దా? అనేది పెద్ద‌గా క‌న్సిడ‌ర్ చేయ‌రు. మొత్తానికి `నారీ నారీ నడుమ మురారి` అనే టైటిల్ టాలీవుడ్‌లో హాట్ కేక్‌లా మారింది.

Tags:    

Similar News