పాక్ లో మహావతార్... ఇది కదా అసలైన విజయం
ఇటీవల ఈ సినిమా యానిమేషన్ విభాగంలో ఆస్కార్ అవార్డుకి నామినేషన్లలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.;
2025లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన అతి తక్కువ సినిమాల్లో మహావతార్ నరసింహ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పూర్తిగా యానిమేషన్తో రూపొందిన ఈ సినిమాను మొదట కేవలం కన్నడ భాషలో మాత్రమే విడుదల చేయడం జరిగింది. పరిమిత బడ్జెట్ తో రూపొందించిన ఈ యానిమేటెడ్ మూవీని కన్నడ ప్రేక్షకులు ఆదరించారు. అక్కడ వచ్చిన స్పందన నేపథ్యంలో సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావలసిన అవసరం ఉందని మేకర్స్ భావించారు. అందుకే చాలా తక్కువ సమయంలోనే మహావతార్ నరసింహ సినిమాను తెలుగు హిందీ ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయడం జరిగింది. ఊహించినట్లుగానే అన్ని భాషల్లో కూడా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒక యానిమేటెడ్ మూవీ గతంలో ఎప్పుడు సాధించని విజయం ఈ సినిమా సాధించింది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికీ సినిమా ఏదో ఒకచోట ఆడుతూనే ఉండడంతో లాంగ్ రన్ లో సినిమా రూ.500 కోట్ల రూపాయలను దక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మహావతార్...
మహావతార్ నరసింహ ఇప్పటికే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయినా కూడా థియేటర్ రన్ గురించి ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ సినిమా పాకిస్తాన్లో విడుదలైంది. అక్కడ కరాచీలో ప్రేక్షకులు చూస్తూ తన్మయత్వంతో పులకించిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముస్లింలు ఎక్కువగా ఉండే పాకిస్తాన్ వంటి ముస్లిం దేశంలో ఒక హిందూ దేవుడి గురించి రూపొందిన సినిమా విడుదల కావడమే చాలా పెద్ద విషయం, అలాంటి సినిమాకు మంచి స్పందన రావడం అనేది మరింత పెద్ద విషయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది అసలైన విజయం అంటూ కొందరు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. మహావతార్ నరసింహ సినిమా పట్ల పాకిస్తాన్లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కరాచీలోని ఒక థియేటర్లో సినిమాను భక్తి భావంతో చూస్తూ దండం పెడుతున్న ప్రేక్షకుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండియాలో థియేటర్ రన్ నడిచిన సమయంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రేక్షకులు పూనకాలు ఊగుతూ నరసింహ స్వామి నీ పూజించిన వీడియోలు ఎలాగైతే వైరల్ అయ్యాయో ఇప్పుడు పాకిస్తాన్లో ప్రేక్షకులు అలా భక్తి భావంలో మునిగిపోవడం వైరల్ గా మారింది.
ఇండియన్ యానిమేషన్ మూవీ..
ఇటీవల ఈ సినిమా యానిమేషన్ విభాగంలో ఆస్కార్ అవార్డుకి నామినేషన్లలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి అందరి దృష్టిని ఆకర్షిస్తూ వచ్చింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందూ పురాణాల నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడి మాటల ప్రకారం ఈ ఒక్క సినిమాతో తన జర్నీ ఆగిపోదని, ఇది ఒక మెగా యూనివర్స్ గా వరుస సినిమాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో నరసింహ అనేది మొదటి చిత్రం మాత్రమే అని.. ముందు ముందు మరిన్ని అవతారాల్లో ఆ మహావిష్ణువుని చూపించబోతున్నట్లు చెబుతున్నారు. మహావతార్ నరసింహ సినిమాను అన్ని వయసుల వారు చూడడం జరిగింది. అందుకే ఈ సినిమాకి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. విజువల్స్, అనిమేషన్ పూర్తిగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడంలో చిత్ర యూనిట్ సభ్యులు అయ్యారు. అందుకే సినిమా మంచి విజయాన్ని సొంతం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని మహావిష్ణువు సినిమాలు...
శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత ఉద్వేగ భరిత మరియు ఉగ్రరూపమైన నరసింహ అవతారం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. విష్ణువు భక్తుడు అయిన ప్రహ్లాదుడు ప్రతి ఒక్కరిలోనూ భక్తి భావన కలిగిస్తాడు. పైగా సినిమాలో చూడడానికి ప్రహ్లాదుడు చాలా క్యూట్ గా అందంగా కూడా ఉన్నాడని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. యానిమేషన్ సినిమానే అయినప్పటికీ నేచురల్ కి చాలా దగ్గరగా ఉందని, నటీనటులతో చేసినా ఈ స్థాయి విజువల్స్ చూసేవాళ్లం కాదని ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. అందుకే మహావతార్ నరసింహ టాక్ తోనే భారీ కలెక్షన్స్ సొంతం చేస్తుంది. ప్రపంచం మొత్తం గెలుచుకున్న హిరణ్యకశిపుడు తన కొడుకుని గెలవలేక పోతాడు. తన కొడుకు మనసును గెలుచుకోలేక చివరికి చంపేయాలని చూస్తాడు, కానీ ప్రహ్లాదుడు నమ్ముకున్న దైవం హిరణ్యకశిపుడు ను చంపేస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. సినిమాలోని ప్రతి సీనుకి ప్రేక్షకులు నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడం వల్లే ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఈ సినిమా గురించి చర్చ జరుగుతుంది.