నారా రోహిత్.. ఇకపై అలాంటి రోల్స్ చేయాలట!
టాలీవుడ్ హీరో నారా రోహిత్ తనకంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. విభిన్న జోనర్లలో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు.;
టాలీవుడ్ హీరో నారా రోహిత్ తనకంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. విభిన్న జోనర్లలో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఆ మధ్య ఆరేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన.. ఇప్పుడు వరుస చిత్రాలతో సందడి చేయనున్నారు.. చేస్తున్నారు కూడా..
గత ఏడాది సూపర్ హిట్ మూవీ ప్రతినిధి సీక్వెల్ ప్రతినిధి-2తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు భైరవం మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఆ సినిమా.. రెండు రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది. వరద పాత్రలో సినిమాలో కనిపించారు రోహిత్.
ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్న భైరవం మూవీతో నారా రోహిత్.. మంచి ప్రశంసలు అందుకున్నారు. తన సెటిల్డ్ యాక్షన్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అలరించిన ఆయనను విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు. నిజాయతీ, పెద్దరికం నింపుకొన్న పవర్ ఫుల్ రోల్ లో నారా రోహిత్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నారని కొనియాడుతున్నారు.
ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పించారని చెబుతున్నారు. అలా ఆయన కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. కమాండింగ్ పర్సనాలిటీతో స్ట్రాంగ్ నటించే టాలెంట్ ఆయనకు ఫుల్ గా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భైరవంలో మంచి ఎఫెక్టివ్ రోల్ ఆయనకు దక్కిందని చెబుతున్నారు.
అదే సమయంలో భవిష్యత్ ప్రాజెక్టుల్లో రోల్స్ ఎంపిక విషయంలో సజెషన్ ఇస్తున్నారు. భైరవం సినిమాలో చేసిన లాంటి ప్రభావవంతమైన పాత్రలు చేయాలని కోరుతున్నారు. అప్ కమింగ్ మూవీ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. సెలక్షన్ పరంగా సరైన విధంగా వ్యవహరించి దూసుకుపోవాలని అంతా కోరుకుంటున్నారు.
కాగా, ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి కుమారుడే రోహిత్. బాణం మూవీతో హీరోగా మారిన ఆయన.. డెబ్యూతో ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత సోలోతో తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర, జో అచ్యుతానంద వంటి పలు సినిమాలు చేశారు. ఆరేళ్ల గ్యాప్ తర్వాత ప్రతినిధి-2 చేసిన ఆయన.. ఇప్పుడు భైరవంతో వచ్చారు. త్వరలో సుందరాకాండతో రానున్నారు.