సెట్టయ్యే వాళ్లతోనే..నాని లైనప్..

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. వరుస ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే.;

Update: 2025-04-24 05:30 GMT

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. వరుస ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. తన లైనప్ లో క్రేజీ సినిమాలు చేర్చుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పుడు హిట్-3 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అర్జున్ సర్కార్ గా వయొలెంట్ పోలీస్ ఆఫీసర్ గా మూవీలో కనిపించనున్నారు.

ఇప్పటికే హిట్-3పై మంచి అంచనాలు ఉండగా, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. నాని అకౌంట్ లో మరో హిట్ పక్కా అని చెబుతున్నారు. అదే సమయంలో నాని లైనప్ కోసం ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే అనౌన్స్ చేసిన ప్యారడైజ్ ను త్వరలో స్టార్ట్ చేస్తామని కొద్దిరోజులుగా చెబుతున్నారు నాని.

దసరాతో సూపర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల.. మరోసారి ప్యారడైజ్ మూవీకి గాను నానితో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. మే 2 నుంచి షూటింగ్ మొదలు కానుందని తాజాగా వెల్లడించారు నాని. 12వ తేదీ నుంచి తాను షూటింగ్ లో పాల్గొంటానని చెప్పారు. 2026 మార్చి 26న సినిమా రిలీజ్ కానుందని పేర్కొన్నారు.

ప్యారడైజ్ తర్వాత సుజీత్ తో చేసే సినిమా మొదలు కానుందని చెప్పారు. అయితే ప్రస్తుతం సుజీత్.. పవన్ కళ్యాణ్ తో ఓజీ చేస్తున్నారు. అది కంప్లీట్ అయ్యాక.. నాని సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు అర్థమవుతోంది. అదే సమయంలో దర్శకులు త్రివిక్రమ్‌, శేఖర్‌ కమ్ముల.. నాని వేర్వేరుగా సినిమాలు చేస్తారని ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నాయి.

దీనిపై నాని లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చారు. తాను, వెంకటేష్ సర్ హీరోలుగా ఓ సినిమా చేయాలని త్రివిక్రమ్‌ కొన్నాళ్ల క్రితం అనుకున్నారని నాని తెలిపారు. ఇటీవల అయితే ఎలాంటి అప్డేట్ లేదని, ఏం జరిగిందో కూడా తెలియని అన్నారు. ఆ తర్వాత శేఖర్‌ కమ్ముల సర్‌, తాను సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని చెప్పారు.

పలుమార్లు కథ కోసం చర్చలు కూడా జరిగాయని, కానీ సెట్ అవ్వలేదని చెప్పారు. ఇటీవల మరోసారి మీట్ అయ్యామని అన్నారు. అంటే ఆ రెండు సినిమాలు స్టోరీ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నాని లైనప్ చూసి మాత్రం ఇప్పుడు అంతా షాకవుతున్నారు. ఆయన సెలక్షన్ వేరే లెవెల్ లో ఉందని నెటిజన్లు కొనియాడుతున్నారు.

ముఖ్యంగా నాని తనకు సూటయ్యే.. సెట్టయ్యే దర్శకులతోనే బిగ్ మూవీస్ ను లైన్ లో పెడుతున్నారని అంతా అంటున్నారు. అన్ని జోనర్స్ లో సినిమాలు చేయాలనే మక్కువతో ఉన్న నాని.. అందుకు తగ్గట్లే కెరీర్ లో అడుగులు ముందుకు వేస్తున్నారని లైనప్ చూస్తుంటే క్లియర్ గా తెలుస్తోంది. మరి ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News