ది ప్యారడైజ్.. ఒకప్పటి కామేడి కింగ్ + కలెక్షన్ కింగ్!

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్' ఇప్పటికే విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఆసక్తిని కలిగిస్తోంది.;

Update: 2025-07-11 06:06 GMT

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్' ఇప్పటికే విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఆసక్తిని కలిగిస్తోంది. తాజా అప్‌డేట్ మేరకు ఈ సినిమాలో ఒకప్పటి కామెడీ కింగ్, కలెక్షన్ కింగ్ ఇద్దరూ కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత తెరపై కనిపించబోతుండటం ఓ స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.

ఇప్పటికే విడుదలైన ‘రా స్టేట్‌మెంట్’ గ్లింప్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. నాని న్యూ లుక్, యాక్షన్ అటిట్యూడ్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ సినిమా ద్వారా మాస్ హిట్ 'దసరా' తరువాత మరోసారి నాని-శ్రీకాంత్ ఓదెల కాంబో రిపీట్ అవుతోంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. అది పూర్తి నెగటివ్ షేడ్స్‌తో ఉండే క్యారెక్టర్ అని టాక్. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇటీవల విష్ణు మంచు ఇచ్చిన ఇంటర్వ్యూలో “శ్రీకాంత్ ఓదెల మా నాన్నతో మాట్లాడారు” అని చెప్పడం మోహన్ బాబు పాత్రపై క్లారిటీ ఇచ్చింది.

ఇక మరోవైపు, గతంలో సినిమాలకు విరామం తీసుకుని రాజకీయాల్లో చురుగ్గా ఉన్న బాబు మోహన్ మళ్లీ సినిమాలవైపు వచ్చారు. ఇటీవలే ఆయన ‘ఉప్పు కప్పురంబు’ చిత్రంలో నటించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో “ది ప్యారడైజ్’ సినిమా కోసం డేట్స్ ఇవ్వాల్సి ఉంది, కానీ నా పాత్ర ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా ఉంటుంది” అని తెలిపారు. మరోసారి తన కామెడీ టైమింగ్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు బాబు మోహన్.

ఇక ఇప్పటికే ఈ చిత్రానికి ‘కిల్’ ఫేమ్ రాఘవ జుయాల్‌ను విలన్‌గా ఎంపిక చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. మొత్తం మీద ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 2026 మర్చి 26న విడుదల కానుంది. తెలుగు, హిందీతో పాటు ఎనిమిది భాషల్లో ఈ సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇలా చూస్తే ‘ది ప్యారడైజ్’ కాస్టింగ్ పరంగా ప్రతీ అప్‌డేట్‌ ఒక్కటే కాన్ఫిడెన్స్ పెంచుతోంది. మోహన్ బాబు, బాబు మోహన్ లాంటి సీనియర్ నటులు ఈ కథలో భాగం కావడం సినిమాకు బలమైన ఎమోషన్, ఎంటర్టైన్‌మెంట్ కలిసిరానున్నాయనడానికి నిదర్శనం. మరి ఈ ప్యారడైజ్‌ ప్రయాణం ఎలాంటి అద్భుతాల్ని చూపించబోతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News