నాని రేంజ్ మారిపోయింది
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ‘అష్టాచమ్మా’ అనే చిన్న సినిమాతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టి.. ఆ తర్వాత కూడా చాలా ఏళ్ల చిన్న చిత్రాలే చేశాడు నాని.;
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ‘అష్టాచమ్మా’ అనే చిన్న సినిమాతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టి.. ఆ తర్వాత కూడా చాలా ఏళ్ల చిన్న చిత్రాలే చేశాడు నాని. ‘భలే భలే మగాడివోయ్’ వరకు అతణ్ని స్టార్ అనడానికి కూడా సంకోచించేవాళ్లు. ఆ సినిమా టైటిల్స్‌లో ‘నేచురల్ స్టార్’ అని పేరు ముందు వేసుకుంటే అతిగా ఉందన్న వాళ్లూ లేకపోలేదు. కానీ ఆ చిత్రం అప్పట్లోనే రూ.50 కోట్ల వసూళ్లు సాధించి నాని స్టార్ పవర్‌ను చూపించింది. ఆ తర్వాతి పదేళ్లలో నాని సినిమా సినిమాకూ ఒక మెట్టు ఎక్కుతూనే ఉన్నాడు. రెండేళ్ల కిందట ‘దసరా’ చిత్రం నాని తన తోటి మిడ్ రేంజ్ హీరోలను మించి పోయాడనే సంకేతాలు ఇచ్చింది. ఆ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు చూసి ట్రేండ్ పండిట్లు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో తన సక్సెస్ స్ట్రీక్ కొనసాగించి.. తన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’కి కావాల్సినంత హైప్ తీసుకొచ్చాడు నాని.
ఇక ఈ రోజు రిలీజైన ‘హిట్-3’కి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన, ఓపెనింగ్స్ అంచనాలు చూస్తుంటే నాని ఇంకొన్ని మెట్లు ఎక్కేశాడనిపిస్తోంది. మిడ్ రేంజ్ హీరోలకు, టాప్ హీరోలకు మధ్య ఒక కొత్త లీగ్‌లోకి నాని ఎంటరయ్యాడని చెప్పొచ్చు. టాప్ హీరోలు నటించిన పెద్ద చిత్రాలు లేని ఈ వేసవిలో ‘హిట్-3’నే ఆ స్థాయిలో కనిపిస్తోంది. పెద్ద సినిమాలకు దీటుగా దీన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజిలో జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి పెద్ద ఎత్తున అర్లీ మార్నింగ్ షోలు పడ్డాయి. ఆ షోల్లో థియేటర్ల రెస్పాన్స్ మామూలుగా లేదు. నాని ఎంట్రీకి, యాక్షన్ సీక్వెన్సులకు, ఎలివేషన్ సీన్లకు థియేటర్లు హోరెత్తిపోతున్నాయి. ఆ స్పందన చూస్తే నాని ఎంత పెద్ద స్టార్ అయిపోయాడో అర్థమవుతుంది. నానిని ఒక నటుడిగా అభిమానించేవాళ్లు చాలామందే ఉన్నారు కానీ.. అతణ్ని మాస్ హీరోగా ఆరాధించే కల్ట్ ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారని ‘హిట్-3’ థియేటర్లలో రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది. సినిమాకు మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ.. తొలి రోజు మాత్రం ప్యాక్డ్ థియేటర్లతో నడుస్తోంది. స్లంప్‌లో సాగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఊపిరిలూదిన నానిని ఇండస్ట్రీ జనాలు కూడా ఒక స్టార్‌లాగే చూస్తున్నారు.