'రైడ్' కారణంగా నానికి మళ్లీ నిరాశ తప్పదా?
హిట్ 3 సినిమా సూపర్ హిట్ అయినా రైడ్ 2 మినిమం పాజిటివ్ టాక్ దక్కించుకున్నా అజయ్ దేవగన్ సినిమాకు జనాలు ఎక్కువ వెళ్లే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.;
సౌత్ హీరోలు ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మార్కెట్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. స్టార్ హీరోలు మాత్రమే కాకుండా చిన్న హీరోలు, మీడియం రేంజ్ సినిమాలు సైతం నార్త్ ఇండియాలో మంచి వసూళ్లు దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే నాని సైతం నార్త్ ఇండియాలో తనకు మార్కెట్ క్రియేట్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. శ్యామ్ సింగరాయ్ సినిమాను నార్త్ లో భారీ ఎత్తున విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. దసరా సినిమాను అక్కడ విడుదల చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆ సినిమా కాన్సెప్ట్ నార్త్ ఇండియాకు సెట్ కాక పోవడంతో అక్కడి జనాలు పెద్దగా పట్టించుకోలేదు.
హాయ్ నాన్న సినిమా సైతం హిందీలో విడుదల ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న నాని సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు. కానీ నార్త్ ఇండియాలో మాత్రం ఇప్పటి వరకు ఈయన మినిమం వసూళ్లు సాధించలేక పోతున్నారు. ప్రస్తుతం 'హిట్ 3' సినిమాను నాని చేస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ 3 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన హిట్ ప్రాంచైజీలోని రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈసారి నాని హీరోగా నటించడంతో పాటు, దేశ సరిహద్దు లో జరిగే కథతో సినిమా రూపొందబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.
హిట్ 3 సినిమా విషయంలో తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి అనుమానాలు లేవు. ఫిల్మ్ మేకర్స్ చేస్తున్న ప్రచారం నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. కేజీఎఫ్ తర్వాత శ్రీనిధి శెట్టి తెలుగులో చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ ఈ సినిమాకు ఓకే చెప్పింది. నానితో కలిసి ఆమె హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేజీఎఫ్ కారణంగా పాన్ ఇండియా రేంజ్‌లో శ్రీనిధి శెట్టికి మంచి గుర్తింపు దక్కింది. అందుకే ఈ సినిమాలో ఆమె నటించడం కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ 3 కి మంచి బజ్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల వారు, పాన్ ఇండియా సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాని ఈ సారి బాలీవుడ్ మార్కెట్‌లో 'హిట్ 3' తో హిట్ కొట్టాలని బలంగా కోరుకుంటున్నాడు. కానీ ఆయనకు పోటీగా అజయ్ దేవగన్ హీరోగా వాణి కపూర్ హీరోయిన్‌గా రితేష్ దేశ్‌ముఖ్ విలన్ పాత్రలో నటించిన 'రైడ్ 2' సినిమా రాబోతుంది. రైడ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో రైడ్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. హిట్ 3 విడుదల కాబోతున్న మే 1న అజయ్ దేవగన్ హిట్ మూవీ సీక్వెల్ 'రైడ్ 2' సినిమా రాబోతుంది. బాలీవుడ్ మార్కెట్ ఈమధ్య కాలంలో చాలా డల్‌గా ఉంది. అయినా కూడా ఈ సినిమాపై మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయి. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో రూపొందిన రైడ్ 2 సినిమా కచ్చితంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మినిమం ఆడే అవకాశాలు ఉన్నాయి.
హిట్ 3 సినిమా సూపర్ హిట్ అయినా రైడ్ 2 మినిమం పాజిటివ్ టాక్ దక్కించుకున్నా అజయ్ దేవగన్ సినిమాకు జనాలు ఎక్కువ వెళ్లే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. హిందీలో అజయ్ దేవగన్ రైడ్ 2 సినిమా పోటీగా ఉంటే, తమిళనాట హిట్ 3 కి సూర్య హీరోగా నటిస్తున్న 'రెట్రో' సినిమా పోటీగా విడుదల కాబోతుంది. పాన్ ఇండియా మార్కెట్ అంటే తమిళ్, హిందీ భాషల్లో అత్యధిక వసూళ్లు రావాల్సి ఉంది. కానీ ఆ రెండు భాషల్లోనూ పెద్ద సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో హిట్ 3 కి పాన్ ఇండియా సక్సెస్ కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నాని ఈ కష్టంను ఎలా అధిగమిస్తాడు అనేది చూడాలి