నానికి గోల్డెన్ ఛాన్స్..హిట్ అంటే ఇక అంతే!
నేచురల్ స్టార్ నానికి ఎక్కడో మచ్చున్నట్టుంది.. అందుకే తను ఏది చేసినా కలిసొస్తోంది. టైమ్ కూడా అనుకూలంగా నడుస్తోంది.;
నేచురల్ స్టార్ నానికి ఎక్కడో మచ్చున్నట్టుంది.. అందుకే తను ఏది చేసినా కలిసొస్తోంది. టైమ్ కూడా అనుకూలంగా నడుస్తోంది. ఇటు హీరోగా, అటు నిర్మాతగానూ వరుసగా విజయాలు సాధిస్తూ టాలెంటెడ్ హీరోగానే కాకుండా అభిరుచిగల నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. దీనికి నిదర్శనమే ఇటీవల నాని ప్రజెంటర్‌గా వ్యవహరించిన `కోర్ట్` మూవీ సూపర్ హిట్ కావడం. తక్కువ బడ్జెట్‌లో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లు రాబట్టడం అంటే మామూలు విషయంకాదు.
ఇలా హీరోగా, నిర్మాతగా మాంచి జోరుమీదున్న హీరో నాని ప్రస్తుతం `హిట్` థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ `హిట్ ద థర్డ్ కేస్`లో నటించాడు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించారు. హిట్ ఫ్రాంఛైజీలో వస్తున్న మూడవ సినిమా కావడం, ఇందులో నాని నటించి నిర్మించడంతో సహజంగానే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రంతీసిపోని స్థాయిలో `హిట్ 3` ఉండనుందని ట్రైలర్‌తో హింట్ ఇచ్చేశారు.
ఇప్పటి వరకు వచ్చిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌లకు పూర్తి భిన్నంగా హిట్ 3` ఉంటుందని ఇప్పటికే ట్రైలర్‌తో ప్రేక్షకులకు, అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీ మే 1న సమ్మర్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. అయితే ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి `విశ్వంభర`, ప్రభాస్ `ది రాజాసాబ్`, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ `హరి హర వీరమల్లు` వంటి భారీ సినిమాలు రిలీజ్ అవుతాయని అంతా భావించారు. మేకర్స్ కూడా సమ్మర్‌లో ఈ మూవీస్‌ని రిలీజ్ చేస్తామంటూ రిలీజ్ డేట్‌లు కూడా ప్రకటించడంలో ఈ సమ్మర్ సమరం రసవత్తరంగా ఉంటుందని అంతా భావించారు.
కానీ అనూహ్యంగా ఇవేవీ సమ్మర్‌లో రిలీజ్ కావడం లేదని రేస్ నుంచి తప్పుకోవడంతో హీరో నానికి గోల్డెన్ చాన్స్ లభించింది. పెద్ద స్టార్ల సినిమాలేవీ పోటీలో లేకపోవడం, తన సినిమా మాత్రమే బరిలో ఉండటంతో లక్కంటే నానిదే అని ట్రేడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి. దాదాపు తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ తప్ప అన్ని రిజల్ట్స్ వచ్చేశాయి. మే 30న తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ రాబోతున్నాయి. దీంతో స్టూడెంట్స్ ఫ్రీఅయిపోయి రిజల్ట్స్ వచ్చి ఖుషీలో ఉంటారు.
ఇది మే 1న విడుదల కానున్న నాని సినిమాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ని రాబట్టడం ఖాయమని ట్రేడ్ టాక్. ఇక ఈ మూవీ రిలీజైన 30 రోజుల తరువాత అంటే మే 30న విజయ్ దేవరకొండ `కింగ్‌డమ్` రిలీజ్ కానుంది. దీంతో నాని `హిట్ 3` వసూళ్లకు 30 రోజుల వరకు ఎలాంటి బ్రేక్ ఉండదు. తొలి రోజే హిట్ సినిమాకు హిట్ టాక్ మొదలైతే కలెక్షన్స్‌కు అడ్డుకట్టవేయడం కష్టం అని, అయితే ఇలాంటి గోల్డెన్ ఛాన్స్‌ని నాని ఎలా యుటిలైజ్ చేసుకుంటాడోనని ట్రేడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.