ఎవరో తెలియని వ్యక్తి ఆక్షేపిస్తే 'రామాయణం' నిర్మాతపైనే నిందలా?
`పఠాన్` సినిమాలోని `కాషాయ రంగు బికినీ` వివాదానికి.. అలాగే ఇటీవల ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి డిజాస్టర్ అయిన చిన్న సినిమా `మహాకావ్య శ్రీ రామాయణ కథ`పై వచ్చిన స్పందనకు చాలా తేడా ఉంది.
`పఠాన్` సినిమాలోని `కాషాయ రంగు బికినీ` వివాదానికి.. అలాగే ఇటీవల ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి డిజాస్టర్ అయిన చిన్న సినిమా `మహాకావ్య శ్రీ రామాయణ కథ`పై వచ్చిన స్పందనకు చాలా తేడా ఉంది. పెద్ద సినిమాలపై ఉండే నిరసనలు.. చిన్న సినిమాల విషయంలో ఎందుకు కనిపించవు అనేదానిపై పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వస్తాయి. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే వంటి స్టార్ హీరోల భారీ బడ్జెట్ చిత్రాలపై దేశవ్యాప్తంగా విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. చిన్న విషయాలు కూడా పెద్ద వివాదాలుగా మారుతాయి. కానీ ఈ చిన్న సినిమా ఎలాంటి హడావుడి లేకుండా వచ్చి ఎవరి దృష్టిలోనూ పడకపోవడంతో.. జనాలు దీన్ని ఒక సీరియస్ సినిమాగా కాకుండా కేవలం ఒక `చెత్త జోక్`లా తీసిపారేశారు. ప్రచారం లేని చోట ఆందోళనలకు తావు ఉండదు.
రెండోది బాలీవుడ్ పెద్ద సినిమాలపై జరిగే నిరసనలు, బహిష్కరణ ట్రెండ్‌లు లేదా ఎఫ్‌ఐఆర్‌ల వెనుక కొన్నిసార్లు రాజకీయ ప్రయోజనాలు లేదా పబ్లిసిటీ స్టంట్స్ దాగి ఉంటాయి. కానీ ఎలాంటి పెద్ద తారాగణం లేని.. ఎవరికీ తెలియని ఈ చిన్న సినిమాపై కేసులు పెట్టినా లేదా ఆందోళనలు చేసినా ఎవరికీ ఎలాంటి మైలేజ్ రాదు కాబట్టి ఎవరూ దానిని పట్టించుకోరు. అంతేకాకుండా పెద్ద స్టూడియోలు కావాలనే ఉద్దేశంతోనే సంప్రదాయాలను కించపరిచేలా సీన్లు తీశారనే భావన కొందరిలో ఉంటుంది. అయితే ఈ చిత్రంలో సుగ్రీవుడు కళ్లద్దాలు పెట్టుకోవడం, నాసిరకం గ్రాఫిక్స్ ఉండటం వంటి విచిత్రాలను చూశాక... ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని.. కేవలం మేకింగ్ లోపం.. నిధుల కొరత వల్ల జరిగిన ప్రయోగమని ప్రజలు అర్థం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన ఈ సినిమా తాజాగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందులో అంజలి అరోరా సీత పాత్రలో నటించగా.. కంటెంట్ - విజువల్స్ పై ప్రేక్షకుకుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వివాదం మళ్లీ తెరపైకి రావడానికి ప్రధాన కారణం.. ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్ షాన్ ప్రాశర్ చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు. ఈ చిత్ర నిర్మాణంలో ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రమేయం ఉందంటూ షాన్ ప్రాశర్ ఆరోపిస్తూ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆ వైరల్ క్లిప్‌లో సారాంశం ఏమిటంటే.. రణ్‌బీర్ కపూర్ హీరోగా నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాంతకంగా తెరకెక్కిస్తున్న `రామాయణం` సినిమా దీపావళికి విడుదల కానున్న నేపథ్యంలో... ఆ సినిమాపై హైప్ పెంచడానికి లేదా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి నమిత్ మల్హోత్రాయే కావాలని `ఆదిపురుష్` కంటే తక్కువ నాణ్యతతో ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌తో నిర్మించారంటూ షాన్ ఆరోపించారు. లీడ్ రోల్స్‌లో ఎవరికీ తెలియని నటులను పెట్టడం వెనుక కూడా ఇదే వ్యూహం ఉందంటూ పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై నిర్మాత నమిత్ మల్హోత్రా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.
ఈ వైరల్ వివాదంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. నమిత్ మల్హోత్రాకు ఈ చెత్త సినిమాతో ఎలాంటి సంబంధం లేదని..తప్పుడు ఆరోపణలు చేస్తున్న షాన్ ప్రాశర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రణ్‌బీర్ కపూర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇలాంటి వాటికి స్పందించి అతనికి మరింత పబ్లిసిటీ ఇవ్వవద్దని.. అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా తన పనిపై దృష్టి పెట్టాలని కొందరు సలహా ఇస్తుండగా.. మరికొందరు మాత్రం షాన్ ప్రాశర్ వాదనలోనూ కొంత లాజిక్ ఉందని..కావాలనే నెగెటివిటీని సృష్టించి అసలు సినిమాపై హైప్ తెచ్చే ప్రయత్నం జరుగుతోందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక చిన్న సినిమా గురించిన వివాదాన్ని పెద్దదిగా మార్చడం లేదా షాన్ పై చర్యలు తీసుకోవడం వంటివి అనవసరమైన పనులు అని చాలా మంది కొట్టి పారేస్తున్నారు.