దసరాకి మెగా కాంపౌండ్‌ నుంచి క్లారిటీ వచ్చేనా?

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ సినిమా అప్‌డేట్‌ దసరాకు దాదాపు కన్ఫర్మ్‌ కాగా, మెగాస్టార్‌ చిరంజీవి సినిమా అప్‌డేట్‌ కూడా అదే దసరాకు ఉంటుంది అని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

Update: 2026-10-02 03:40 GMT

దసరా-2026 సందర్భంగా భారీ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. అయితే మెగా కాంపౌండ్‌లో రూపొందిన ఏ ఒక్క మూవీ కూడా ఈ దసరాకు వచ్చే పరిస్థితి లేదు. దసరాకు మెగా మూవీస్ ఏమీ రావని ఇప్పటికే కన్ఫర్మ్‌ అయింది. మొన్నటి వరకు వెయిట్‌ చేసిన 'విశ్వంభర' సైతం దసరాకు రావడం లేదని తేలిపోవడంతో అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు. అయితే మెగా ఫ్యాన్స్‌కి దసరా కానుకలు మాత్రం ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రధానంగా రామ్‌ చరణ్‌ తదుపరి సినిమాకు సంబంధించిన ప్రకటన దసరా కానుకగా ఉంటుందని చెబుతున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యాయి. దసరాకు సినిమాను అనౌన్స్ చేయడంతో పాటు, ఒక ప్రీ లుక్ పోస్టర్‌ ను సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.

రామ్‌ చరణ్‌ కొత్త మూవీ...

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ సినిమా అప్‌డేట్‌ దసరాకు దాదాపు కన్ఫర్మ్‌ కాగా, మెగాస్టార్‌ చిరంజీవి సినిమా అప్‌డేట్‌ కూడా అదే దసరాకు ఉంటుంది అని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే వచ్చే సంక్రాంతికి కాకా సినిమాతో చిరంజీవి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఆ మధ్య కాకా సినిమా కాకుండా దసరాకు 'విశ్వంభర' సినిమాను తీసుకు వస్తే ఎలా ఉంటుందా అని చిరంజీవి ఆలోచనలో పడ్డాడు అంటూ వార్తలు వచ్చాయి. విశ్వంభర సినిమాను ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మొదట భావించారు. కానీ సినిమాకు ఉన్న ప్రాధాన్యత, ఫ్యామిలీ ఎలిమెంట్స్, పిల్లలు నచ్చే ఎలిమెంట్స్ ఉన్న కారణంగా సంక్రాంతికి వస్తే మంచి మార్కెట్‌ చేస్తుందనే నమ్మకంతో యూనిట్‌ సభ్యులు ఉన్నారనే ప్రచారం వినిపించింది. అయితే ఇప్పటి వరకు విశ్వంభర రిలీజ్ డేట్‌ విషయమై క్లారిటీ రాలేదు.

చిరంజీవి కాకా సినిమా రిలీజ్‌...

దసరా సందర్భంగా చిరంజీవి నటిస్తున్న కాకా సినిమాతో పాటు, ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయ్యి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్న విశ్వంభర సినిమా అప్‌డేట్స్ వస్తాయని మెగా ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. కాకా నుంచి కచ్చితంగా అప్డేట్‌ అయితే ఉంటుంది. దర్శకుడు బాబీ చాలా ఉత్సాహంగా సినిమాను పూర్తి చేస్తున్నాడు. కనుక కనీసం పోస్టర్‌ అయినా ప్రేక్షకుల ముందుకు వస్తుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఆ సమయంలోనే సినిమా విడుదల తేదీ విషయమై మరోసారి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విశ్వంభర సినిమాను సంక్రాంతికి విడుదల చేద్దాం అనే ప్రపోజల్‌ ఏమైనా నిజంగానే వచ్చి ఉంటే దసరాకు వచ్చే కాకా పోస్టర్‌లో సంక్రాంతికి విడుదల అని ఉండక పోవచ్చు. విశ్వంభర రిలీజ్‌ తో సంబంధం లేకుండా కాకా సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తారా అనే విషయం సైతం పోస్టర్ రిలీజ్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

విశ్వంభర విడుదల ఎప్పుడు...

బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందిన 'విశ్వంభర' సినిమా దాదాపు రెండు ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. కేవలం గ్రాఫిక్స్‌ వల్లే సినిమా ఆలస్యం అవుతోంది. ఇప్పటి వరకు చూడని సరికొత్త లోకంను, అద్భుతమైన విజువల్స్‌తో చూపించాలనే ఉద్దేశంతో దర్శకుడు వశిష్ట ప్లాన్‌ చేస్తున్నారు. అయితే వీఎఫ్‌ఎక్స్‌ విషయమై అవగాహణ రాహిత్యం కారణంగా ఆలస్యం అవుతుందని సమాచారం అందుతోంది. అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ నిపుణులతో కోట్లు ఖర్చు చేసి మరీ సినిమా యొక్క గ్రాఫిక్స్ వర్క్‌ చేయిస్తున్నారు. ఇప్పటికే చాలా సమయం పట్టింది. ఈ ఏడాదిలో అయినా ఫస్ట్‌ కాపీ రెడీ కాకుంటే నిర్మాతలకు భారీగా భారం పడుతుంది. మరి సినిమా రెడీ అయ్యి, 2027 సంక్రాంతికి వస్తుందా అనేది తెలియాలి అంటే త్వరలో రాబోతున్న దసరా పండుగ వరకు వెయిట్‌ చేయాల్సిందే. చరణ్‌ మూవీ ఓపెనింగ్‌తో పాటు, చిరు మూవీ విడుదల విషయమై దసరాకు ఫుల్‌ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News