కార్తికేయ కోసం సితార కూడా దిగింది...!

టీవీ ఛానల్స్‌లో ప్రసారం అయ్యే పలు రియాల్టీ షోలు, గేమ్‌ షో ల్లో ఈ చిత్ర యూనిట్‌ పాల్గొని తమ సినిమాను ప్రమోట్‌ చేసుకున్నారు.

Update: 2026-10-02 03:39 GMT

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఒక్క సినిమాలో చిన్న పాత్రలో ఛాన్స్ ఇచ్చినా చాలు అని స్టార్‌ హీరోల నుంచి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆయన ఏ చిన్న సినిమాను ప్రమోట్‌ చేసినా అది పెద్ద సినిమాగా మారుతుంది. ఆ విషయంలోనూ ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఆర్కా మీడియాతో కలిసి ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మించిన 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' సినిమాను ఎస్‌ ఎస్‌ రాజమౌళి సమర్పించిన విషయం తెల్సిందే. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో మలయాళ స్టార్‌ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లుగా దర్శకుడు చెబుతున్నాడు. చిత్ర యూనిట్‌ సభ్యులు గత వారం రోజులుగా సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ చేశారు.

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ మూవీ...

టీవీ ఛానల్స్‌లో ప్రసారం అయ్యే పలు రియాల్టీ షోలు, గేమ్‌ షో ల్లో ఈ చిత్ర యూనిట్‌ పాల్గొని తమ సినిమాను ప్రమోట్‌ చేసుకున్నారు. బిగ్‌బాస్‌ స్టేజ్‌ పై ఈ సినిమాను ప్రమోట్‌ చేసిన విషయం తెల్సిందే. అన్నింటి కంటే పెద్ద విషయం ఏంటంటే స్వయంగా ఎన్టీఆర్‌ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. తన తమ్ముడు కార్తికేయ కోసం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు హాజరు అయినట్లుగా ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు. రాజమౌళి సినిమాలు అన్నింటికి కార్తికేయ వెనుక ఉండి ఎంత పని చేస్తాడో అందరికీ తెలిసిందే. అందుకే రాజమౌళి హీరోలు అందరికీ కార్తికేయ అంటే చాలా ఇష్టం. అతడు ఏం చేసినా సపోర్ట్‌ చేసేందుకు, ఆయన వెనుక నిలిచేందుకు ముందు ఉంటారు. అందుకే ఆయన నిర్మాణంలో మొదటి సినిమాగా వస్తున్న డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ సినిమాకు పెద్ద ఎత్తున సహకారం అందింది. ప్రముఖులు సైతం సినిమా ప్రమోషన్‌లో తమవంతు సహకారం అందించారు.

ఎన్టీఆర్‌, మహేష్‌ బాబుల ప్రచారం...

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ పాల్గొనగా, మహేష్ బాబు ఎక్స్‌ లో ట్వీట్‌ చేసి తన శుభాకాంక్షలు తెలియజేశాడు. మహేష్‌ బాబు కెమెరా ముందుకు రాలేదు కానీ ఆయన కూతురు సితార మాత్రం ఈ సినిమా ప్రమోషన్‌ కోసం సమయం కేటాయించింది. సినిమాలో చిన్న పాప పాత్రలో నటించిన బేబీ సారా పాలేకర్ తో సందడి చేసింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా సారా, సితార కలిసి కొంత సమయం సరదా చిట్‌ చాట్‌ చేశారు. మహేష్‌ బాబు ఇంట సితారతో కలిసి సారా చేసిన హడావిడి నేపథ్యంలో డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ సినిమాకు మరింత బజ్‌ క్రియేట్‌ అయింది. సితార మాత్రమే కాకుండా సుకుమార్‌ కూతురు సుకృతి సైతం ఈ సినిమా ప్రీమియర్‌ సందర్భంగా సారాతో సందడి చేసింది. మొత్తానికి సినిమాకు పెద్ద పెద్ద వారి నుంచే కాకుండా, వారి కిడ్స్ నుంచి కూడా ప్రమోషన్‌ సహకారం అందింది.

సితార, సుకృతి సైతం ఈ సినిమా కోసం...

రాజమౌళి సమర్పణలో విడుదలైన మూవీ కావడంతో డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ సినిమాకు నెవ్వర్‌ బిఫోర్‌ అనే స్థాయిలో పబ్లిసిటీ దక్కింది. ఒక మీడియం రేంజ్ సినిమాకు, అది కూడా మలయాళ నటుడు నటించిన సినిమాకు ఈ స్థాయి పబ్లిసిటీ దక్కడం మామూలు విషయం కాదు. రాజమౌళి, కార్తికేయ ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్‌ కాకుండా ఉన్నట్లయితే కచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన పబ్లిసిటీలో కనీసం 25 శాతం కూడా పబ్లిసిటీ వచ్చి ఉండేది కాదు అనేది అందరి మాట. కేవలం కార్తికేయ కోసం ఈ సినిమా పబ్లిసిటీలో చాలా మంది తమ వంతు అనుకుని ముందుకు వచ్చారు. ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మాణంలో మొదటి సినిమాగా వచ్చిన ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి. దర్శకుడిగా ఈ సినిమాతో శశాంక్ యేలేటి పరిచయం అయ్యాడు. కాల భైరవ సంగీతం అందించిన ఈ సినిమాను బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనిలు కార్తికేయతో కలిసి నిర్మించారు.

Tags:    

Similar News