ఆ మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు మిస్ అయినట్లేనా?
బాలీవుడ్ మూవీ ‘హనుమాన్ అంశ్’ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే.
బాలీవుడ్ మూవీ ‘హనుమాన్ అంశ్’ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే. చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం సినిమాకు కేవలం రూ.2 కోట్లు ఖర్చు చేశారు. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన హనుమాన్ అంశ్ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు రూ.400 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. విడుదల అయ్యి రెండు నెలలు కావస్తున్నా ఇంకా అక్కడక్కడ ఆడుతూనే ఉంది. లాంగ్ రన్‌లో సినిమా రూ.500 కోట్లు రాబట్టినా ఆశ్చర్యం లేదు. మరో వైపు సినిమాను స్థానిక భాషల్లో డబ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగులో ఈ సినిమాను త్రివిక్రమ్ సమర్పణలో డబ్ చేసి విడుదల చేయడానికి ఏర్పాట్లు జరిగాయి.
హనుమాన్ అంశ్ సినిమా వసూళ్లు...
హనుమాన్ అంశ్ తెలుగు వర్షన్ పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది, అంతే కాకుండా త్రివిక్రమ్ ఆధ్వర్యంలోనే సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. సెప్టెంబర్ 18న తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదల చేయాలని భావించారు. ఆ సమయంలో పెద్దగా పోటీ లేకపోవడంతో కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేస్తుందని, మరో కాంతార రేంజ్‌లో విజయాన్ని సొంతం చేసుకుంటుందని, త్రివిక్రమ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు అని చాలా మంది విశ్లేషించారు. కానీ సెప్టెంబర్ 18 వచ్చి పోయింది కానీ సినిమా మాత్రం రాలేదు. సెప్టెంబర్ నెల పోయి అక్టోబర్ వచ్చింది కానీ ఇప్పటి వరకు హనుమాన్ అంశ్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు. సోషల్ మీడియాలో హనుమాన్ అంశ్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో తెలుగులో కూడా చూడాలి అనుకున్న వారు చాలా మంది నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో హనుమాన్ అంశ్ డబ్బింగ్...
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించడం జరిగింది. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు, అభిమానులు ఉంటారు. అలాంటి బాబా జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లుగా, చాలా సింపుల్‌గా అద్భుతంగా దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన తీరుకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. విడుదలైన మొదటి రోజు కనీసం రూ.20 లక్షలు సైతం రాబట్టలేక పోయిన ఈ సినిమా రోజులు గడుస్తున్నా కొద్ది కోట్ల రూపాయలు రాబట్టడం జరిగింది. రెండో వారం నుంచి సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చించుకోవడం మొదలు అయింది. దాంతో సినిమాకు విపరీతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కచ్చితంగా పాతిక కోట్లు రాబడుతుందని కొందరు విశ్లేషించారు. కానీ సినిమా అసలు విడుదలకే నోచుకోలేదు.
త్రివిక్రమ్ తప్పుకోవడంతో...
చిత్ర నిర్మాతలతో త్రివిక్రమ్ బ్యానర్‌కు చెందిన వారు జరిపిన చర్చలు సఫలం కాకపోవడం వల్ల సినిమాను విడుదల చేయలేక పోయారని తెలుస్తోంది. హనుమాన్ అంశ్ నిర్మాతల తీరు నచ్చక పోవడం వల్ల త్రివిక్రమ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. త్రివిక్రమ్ తప్పుకోవడంతో మరో తెలుగు నిర్మాతకు సినిమాను ఇచ్చి విడుదల చేయాలని మేకర్స్ చూశారట. కానీ త్రివిక్రమ్ వదిలేసిన ఈ ప్రాజెక్ట్‌ను మరెవ్వరూ టేకోవర్ చేయలేదని, అందుకే నిర్మాతలు తెలుగులో విడుదల చేయలేక పోయారు అనే టాక్ కూడా వినిపిస్తుంది. అసలు విషయం ఏమైనా ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు తెలుగులో చూసే అవకాశం మిస్ అయింది. కనీసం ఓటీటీలో అయినా తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ చేస్తారా అనేది చూడాలి.