టాలీవుడ్ టు బాలీవుడ్: మైండ్ బ్లాక్ చేసే ప్రీ-రిలీజ్ బిజినెస్ మోత!
కేవలం థియేట్రికల్ మార్కెట్టే కాకుండా నాన్-థియేట్రికల్ హక్కులను కూడా కలుపుకుంటే ఈ సినిమా విడుదలకు ముందే 1,000 కోట్ల రికార్డు మార్క్‌ను అందుకోనుంది.
ఒకప్పుడు వంద కోట్ల మార్కెట్ చుట్టూ తిరిగిన టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు వేల కోట్ల రూపాయల వ్యాపారంతో సరికొత్త సరిహద్దులనులిఖిస్తున్నాయి. రాజమౌళి - సూపర్‌స్టార్ మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి` ఈ విషయంలో అన్ని రికార్డులను తిరగరాస్తోంది. విడుదలకు ముందే ఈ ప్రాజెక్ట్ సృష్టిస్తున్న సంచలనాలు మరో మెట్టు ఎక్కించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
`వారణాసి` తెలుగు వర్షన్ థియేట్రికల్ హక్కుల కోసమే 275 కోట్ల భారీ బిజినెస్ జరుపుతుండటం విశేషం. దీనికి తోడు హిందీ మార్కెట్ నుంచి 200 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్ ద్వారా 150 కోట్లు, ఇతర దక్షిణాది భాషల హక్కుల రూపంలో మరో 100 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. వివిధ భాషల్లో భారీ డిమాండ్ ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన లెక్కలు ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి.
కేవలం థియేట్రికల్ మార్కెట్టే కాకుండా నాన్-థియేట్రికల్ హక్కులను కూడా కలుపుకుంటే ఈ సినిమా విడుదలకు ముందే 1,000 కోట్ల రికార్డు మార్క్‌ను అందుకోనుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ చిత్రం మొత్తంగా 1,500 కోట్ల భారీ గ్రాస్ టార్గెట్‌తో బరిలోకి దిగుతోంది. భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న విజువల్ వండర్ 2027 సంవత్సరం ఏప్రిల్ 7న వైభవంగా 120 దేశాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతోన్న `రాకా` దాదాపు 600 కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 700 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అల్లు అర్జున్ మాస్ అప్పీల్, అట్లీ కమర్షియల్ విజన్ కలగలిస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక బాక్సాఫీస్ వద్ద ప్రతిసారీ సరికొత్త సంచలనాలు సృష్టించే రెబల్ స్టార్ ప్రభాస్ - టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో రాబోతున్న `ఫౌజీ` చిత్రం కూడా భారీ రేసులో ముందు వరుసలో ఉంది. ఈ సినిమా దాదాపు 500 కోట్ల వరల్డ్ వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ వైపు అడుగులు వేస్తోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కూడా మార్కెట్‌లో విపరీతమైన క్రైజ్ ఉంది.
ఈ మూడు భారీ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసేలా కనిపిస్తున్నాయి. ప్రాంతీయ చిత్రాల హద్దులను చెరిపేస్తూ గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న చిత్రాల జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది.