నాగ్ చెప్పింది రైటే.. కానీ ఫాలో అయ్యేదెవరు?
టాలీవుడ్ లో సినిమా రిలీజ్ డేట్ అనేది ఇప్పుడు ఒక అంచనా మాత్రమేనా? ఒకసారి ప్రకటించిన తేదీకి సినిమా రావడం కంటే వాయిదా పడటమే ఎక్కువగా కనిపిస్తోందా? తాజాగా అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ ఇదే ప్రశ్నను మరోసారి తీసుకొచ్చాయి.
టాలీవుడ్ లో సినిమా రిలీజ్ డేట్ అనేది ఇప్పుడు ఒక అంచనా మాత్రమేనా? ఒకసారి ప్రకటించిన తేదీకి సినిమా రావడం కంటే వాయిదా పడటమే ఎక్కువగా కనిపిస్తోందా? తాజాగా అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ ఇదే ప్రశ్నను మరోసారి తీసుకొచ్చాయి. అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీ సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడిన నాగార్జున.. సినిమా విడుదల తేదీల విషయంలో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఒక సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం మాత్రమే కాదు.. అదే తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కూడా అంతే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు చాలా ప్రాజెక్టులు ప్రకటించిన తేదీలను మార్చుకోవడం సాధారణంగా మారిపోయింది. షూటింగ్ పూర్తయినా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్, ఫైనల్ కాపీ సిద్ధం కావడం వంటి కారణాలతో విడుదలలు వాయిదా పడుతున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో గందరగోళం ఏర్పడటంతో పాటు బిజినెస్ పరంగా కూడా ప్రభావం కనిపిస్తోంది.
నాగార్జున కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. హాలీవుడ్ లో పెద్ద సినిమాలకు ఏడాది ముందే విడుదల తేదీ ప్రకటించి, అదే రోజున విడుదల చేసే విధానాన్ని ఉదాహరణగా చెప్పారు. మన దగ్గర మాత్రం తేదీ ప్రకటించిన తర్వాత కూడా పనులు పూర్తికాక మార్పులు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. లెనిన్ సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని వెల్లడించారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న మాత్రం మరోటి.
రిలీజ్ డేట్లు మారడం వెనుక కేవలం టెక్నికల్ రీజన్సేనా? లేక పోటీ, మార్కెట్ లెక్కలు, ఇతర సినిమాల విడుదలలు కూడా కారణమా? అనేది. అయితే ఇప్పుడు సినిమా నిర్మాణ ప్రక్రియ చివరి నిమిషం వరకు మార్పులతోనే సాగుతోంది. దర్శకులు కొత్త ఆలోచనలు యాడ్ చేయడం, టెక్నికల్ క్వాలిటీ పెంచే ప్రయత్నాలు చేయడం వల్ల సమయం ఎక్కువ పడుతోంది. అయితే నాగార్జున చెప్పిన విషయాల్లో చాలామందికి నిజం కనిపిస్తోంది.
గతంలో సినిమాలు విడుదలకు కొన్ని వారాల ముందే ఫైనల్ కాపీ సిద్ధమయ్యేది. దీంతో ప్రమోషన్స్, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు కూడా ఈజీగా జరిగేవి. ఇప్పుడు మాత్రం రిలీజ్ కు కొన్ని రోజుల ముందు వరకు పనులు కొనసాగుతున్న ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. ప్రేక్షకుల పరంగా చూసినా రిలీజ్ డేట్ మార్పులు పెద్ద సమస్యగానే మారుతున్నాయి. ఒకసారి ప్రకటించిన తర్వాత వాయిదా పడితే ఆ ఎఫెక్ట్ అనేక స్థాయిల్లో కనిపిస్తుంది.
అందుకే నాగార్జున చేసిన సూచన కేవలం లెనిన్ సినిమాకు సంబంధించినది కాదు. మొత్తం ఇండస్ట్రీ వర్కింగ్ స్టైల్ పై వచ్చిన ఒక ప్రశ్నగా చూడొచ్చు. నాగ్ చెప్పిన మాటల్లో లాజిక్ ఉందని చాలా మంది అంగీకరిస్తున్నారు. కానీ అసలు సవాల్ మాత్రం అక్కడే ఉంది. విడుదల తేదీల విషయంలో డిసిప్లైన్ అవసరమని అందరికీ తెలుసు. అయితే ఆ ఆలోచనను ఫాలో చేసేది ఎవరు? టాలీవుడ్ లో ఆ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు రిలీజ్ డేట్ మార్పుల చర్చ మాత్రం కొనసాగుతూనే ఉండొచ్చు.