'కింగ్ 100' లో టాలీవుడ్ క్వీన్ స్వీటీ...?
నాగార్జున హీరోగా గత ఏడాది సంక్రాంతికి 'నా సామిరంగ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.;
నాగార్జున హీరోగా గత ఏడాది సంక్రాంతికి 'నా సామిరంగ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరచడంతో కథల ఎంపిక విషయంలో నాగ్ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఆయన చాలా గ్యాప్ తీసుకుని ఈ ఏడాది కుబేరా, కూలీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేరా సినిమాలో నాగార్జున ముఖ్య పాత్రలో నటించాడు. ఆ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే నాగార్జున పాత్ర విషయంలో ఫ్యాన్స్ సంతృప్తిగా లేరని చెప్పాలి. ఇక రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమాలో నాగార్జున నెగటివ్ రోల్‌లో కనిపించాడు. ఆ పాత్రకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కూలీ సినిమాలో ఏదో మిస్ అయింది అంటూ రివ్యూవర్స్ నెగటివ్ రివ్యూలు ఇచ్చారు.
కార్తీక్ దర్శకత్వంలో నాగార్జున 100 సినిమా
ఒకానొక సమయంలో ఏడాదిలో మూడు నాలుగు, అంతకు మించి సినిమాలతో వచ్చిన నాగార్జున ఇప్పుడు హీరోగా ఏడాదికి కనీసం ఒక్క సినిమాను సైతం విడుదల చేయక పోవడం అభిమానులకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఎట్టకేలకు నాగార్జున కొత్త సినిమా ప్రారంభం అయింది. తమిళ దర్శకుడు ఆర్ కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను నాగార్జున 100వ సినిమాగా ప్రచారం చేస్తున్నారు. ఈ మైల్ స్టోన్ మూవీని నాగ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అఖిల్, నాగ చైతన్య ముఖ్యమైన గెస్ట్ రోల్స్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గురించి మొదటి నుంచి పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా మరో ఆసక్తికర పుకారు ఒకటి హీరోయిన్ గురించి రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నాగార్జున హీరోగా టబు హీరోయిన్
నాగార్జున ఇప్పటికే ఈ 100వ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. అధికారికంగా ప్రకటన వచ్చేది ఎప్పుడు అని అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ లో ఇటీవలే టబు సైతం జాయిన్ అయిందని వార్తలు వస్తున్నాయి. నాగార్జున, టబు కలయిక అంటే ఫ్యాన్స్ కి పక్కా పైసా వసూల్ అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టబుతో కలిసి నాగార్జున నటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరో హీరోయిన్‌గా అనుష్క ఈ సినిమాలో నటించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదే నిజం అయితే రెండో హీరోయిన్‌గా అనుష్క నటించడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అనుష్క కి నాగార్జున అంటే ప్రత్యేకమైన గౌరవం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అనుష్క హీరోయిన్‌గా నాగార్జున సినిమా
ఆ గౌరవంతోనే నాగార్జున 100వ సినిమా కోసం అడిగిన వెంటనే ఓకే చెప్పి ఉంటుందని అంటున్నారు. టాలీవుడ్ క్వీన్‌గా గుర్తింపు దక్కించుకున్న స్వీటీ అనుష్క ఇటీవలే ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయినా కూడా నాగార్జున సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ చేస్తున్న అనుష్క ఇప్పుడు నాగార్జునకు జోడీగా నటించేందుకు ఓకే చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాగార్జున 100వ సినిమా అంటే చాలా స్పెషల్ మూవీగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో అనుష్క సైతం ఈ సినిమాలో ఉండటంతో అంచనాలు మరింతగా పెరిగాయి.