మరో 'మనం'తో సెంచరీ కొట్టే ప్రయత్నం!!

టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీ ప్రాభవం గతంతో పోల్చితే కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది. ఒకప్పుడు నాగేశ్వరరావు, నాగార్జునల సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది.;

Update: 2025-05-24 14:30 GMT

టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీ ప్రాభవం గతంతో పోల్చితే కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది. ఒకప్పుడు నాగేశ్వరరావు, నాగార్జునల సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. నాగార్జున హీరోగా సోలో హిట్‌ కొట్టి చాలా కాలం అయింది. నాగ చైతన్య చాలా కాలం తర్వాత తండేల్‌ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో జాయిన్‌ అయ్యాడు. అఖిల్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దకాలం అవుతున్నా కమర్షియల్‌ బ్రేక్ దక్కించుకోలేక పోయాడు. వీళ్లు కాకుండా అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరోలు అప్పుడప్పుడు గెస్ట్‌లుగా వస్తున్నారు. ఇటీవల సుమంత్‌ 'అనగనగా' సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ దక్కించుకున్నాడు. అయితే థియేట్రికల్‌ రిలీజ్ మిస్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్‌ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

అక్కినేని ఫ్యాన్స్‌ గత కొంత కాలంగా నిరుత్సాహంతో ఉన్నారు. వారు అంతా కూడా నాగార్జున మైలు రాయి సినిమా అయిన వందవ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగార్జున గెస్ట్‌ రోల్స్ చేసిన సినిమాలు కూడా కలిపితే ఇప్పటికే వంద సినిమాల నెంబర్‌ టచ్ అయింది. కానీ నాగార్జున ఆ లెక్కను పట్టించుకోవడం లేదు. సోలో హీరోగా నటించిన సినిమాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నాడు. దాంతో ఇప్పటి వరకు నాగ్‌ సెంచరి కొట్టలేదు. త్వరలోనే నాగ్‌ వంద సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం కూలీతో పాటు కుబేర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు గాను రెడీ అవుతున్నారు. ఈ ఏడాదిలోనే ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి.

ధనుష్‌తో కలిసి కుబేరా సినిమాలో, రజనీకాంత్‌తో కలిసి కూలీ సినిమాలో నటించిన నాగార్జున త్వరలోనే సోలో హీరోగా సినిమాను మొదలు పెట్టబోతున్నారట. అందుకోసం దర్శకుడు ఎంపిక అయ్యారని, స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. మనం తరహాలో ఫ్యామిలీ మూవీగా నాగార్జున 100వ సినిమా ఉంటుందని తెలుస్తోంది. నాగ చైతన్య, అఖిల్‌తో పాటు సుమంత్‌, సుశాంత్‌లు సైతం గెస్ట్ రోల్‌లో నాగార్జున 100వ సినిమాలో నటించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. అదే జరిగితే అక్కినేని ఫ్యాన్స్‌కి మరో మనం తరహా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ దక్కడం ఖాయం అనే అభిప్రాయంను సినీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్‌ వారు వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జున సోలో హీరోగా చివరగా నా సామి రంగ సినిమాతో గత ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ను దక్కించుకోలేదు. దాంతో సినిమాల ఎంపిక విషయంలో స్పీడ్‌గా నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు. గతంలో ఓకే చెప్పిన రెండు మూడు స్క్రిప్ట్‌లకు కూడా నాగ్‌ నో చెప్పినట్లు తెలుస్తోంది. ఒక తమిళ దర్శకుడితో సినిమా మొదలు కావాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నాగార్జున సెంచరీ సినిమా కోసం చాలా గ్యాప్‌ తీసుకున్నాడు, అందుకు తగ్గట్లుగా మంచి ఫలితం ఉంటుందేమో చూడాలి.

Tags:    

Similar News