కింగ్ 100వ చిత్రంలో మిస్ ఇండియా?

ఇదే స‌మ‌యంలో నాగ్ త‌న 100వ సినిమాకి ఘ‌నంగా ప్లాన్ చేస్తున్నారన్న స‌మాచారం ఉంది. అయితే ఇంత‌లోనే కింగ్ తో మిస్ ఇండియా వ‌ర‌ల్డ్ 2023 విజేత నందిని గుప్తా ఒక‌ ఫోటో క్లిక్ లో క‌నిపించ‌డం ర‌క‌ర‌కాల ఊహాగానాలకు దారితీసింది.;

Update: 2025-05-15 23:30 GMT

కింగ్ అక్కినేని నాగార్జున త‌దుప‌రి లోకేష్ క‌న‌గ‌రాజ్ - ర‌జ‌నీకాంత్ ల కూలీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఈ సినిమా ఆగ‌స్టులో గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. లోకేష్ తెర‌కెక్కించిన విక్ర‌మ్ త‌ర‌హాలో `కూలీ` కూడా భారీ మ్యాజిక్ చేస్తుంద‌ని అంద‌రూ ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో నాగ్ త‌న 100వ సినిమాకి ఘ‌నంగా ప్లాన్ చేస్తున్నారన్న స‌మాచారం ఉంది. అయితే ఇంత‌లోనే కింగ్ తో మిస్ ఇండియా వ‌ర‌ల్డ్ 2023 విజేత నందిని గుప్తా ఒక‌ ఫోటో క్లిక్ లో క‌నిపించ‌డం ర‌క‌ర‌కాల ఊహాగానాలకు దారితీసింది.


రాజస్థాన్‌లోని కోటకు చెందిన 21 ఏళ్ల నందిని గుప్తాకు త‌దుప‌రి వెండితెర ఆఫ‌ర్ క్యూలో ఉంద‌ని అంద‌రూ ఊహాగానాలు సాగిస్తున్నారు. అది కూడా నాగార్జున లాంటి టాప్ హీరో స‌ర‌స‌న ఈ బ్యూటీ అవ‌కాశం అందుకుంద‌ని భావిస్తున్నారు. నాగ్ గ‌తంలో సుస్మితాసేన్, ఐశ్వ‌ర్యారాయ్ లాంటి అందాల భామ‌ల‌కు త‌న సినిమాల్లో అవ‌కాశాలు క‌ల్పించారు. ఇప్పుడు మరో మిస్సుకి అవ‌కాశం క‌ల్పించ‌డం ఖాయ‌మైంద‌ని అంతా ఊహాగానాలు సాగిస్తున్నారు. అయితే మిస్ నందిని జాక్ పాట్ అందుకుందా లేదా? అన్న‌ది ఇప్పుడే క‌న్ఫామ్ గా చెప్ప‌లేం. దీనిపై ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.

ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలలో గర్వంగా ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ ఇండియా నందిని గుప్తా భార‌త‌దేశానికి మిస్ వరల్డ్ కిరీటాన్ని తీసుకురావడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 2003లో జన్మించిన నందిని రాజస్థాన్‌లోని కోటాలో నిరాడంబరమైన వ్యవసాయ కుటుంబంలో జ‌న్మించిన బ్యూటీ. అంద‌మైన గ్రామీణ వాతావ‌ర‌ణంలో పెరిగిన నందిని ఆవాలు, చిరుధాన్యాల పొలాలలో ఆడుకుంటూ గడిపింది. కోటలోని సెయింట్ పాల్స్ సీనియర్ సెకండరీ స్కూల్ నుండి ముంబైలోని లాలా లజ్‌పత్ రాయ్ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ వరకు విద్యా ప్ర‌యాణం సాగింది. ప‌దేళ్ల వ‌య‌సుకే మిస్ ఇండియా కావాల‌నే పంతంతో నందిని ఉండేది. నందిని దృఢ సంకల్పం, కృషి 19 సంవత్సరాల వయసులో రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఫెమినా మిస్ ఇండియా 2023 టైటిల్‌ను గెలుచుకోవడానికి దారి తీసింది. ఈ విజయం అనంత‌రం ఇప్పుడు మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి మార్గం సుగమం చేసింది. మే 13న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకతో మిస్ వరల్డ్ 2025 పోటీ మొద‌లైంది. అవార్డు విన్నింగ్ డిజైనర్ గౌరంగ్ షా రూపొందించిన సాంప్రదాయ దుస్తుల‌లో నందిని ప్రేక్షకులను ఆకర్షించింది. నాగార్జున‌- రా కార్తీక్ కాంబినేష‌న్ లోని నాగ్ 100 చిత్రం గ్యాంగ్ స్ట‌ర్ డ్ర‌మా నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News