నాగబంధం కోసం రూ.100 కోట్లా?

విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామాకు 'నాగబంధం: ద సీక్రెట్ ట్రెజర్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు.;

Update: 2026-01-28 12:30 GMT

టాలీవుడ్‌లో ప్రస్తుతం మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. పురాణాలు, దైవశక్తి, పురాతన ఆలయాల చుట్టూ అల్లిన కథలను చూడటానికి ఆడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. 'కార్తికేయ 2', 'హనుమాన్' లాంటి సినిమాల సక్సెస్ తర్వాత ఇప్పుడు అదే జోనర్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ విజువల్ వండర్ పక్కా నిగూఢ రహస్యాల నేపథ్యంలో సాగబోతోంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ భారీ కాన్వాస్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ఇది వరకే క్లారిటీ ఇచ్చారు.

విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామాకు 'నాగబంధం: ద సీక్రెట్ ట్రెజర్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేసింది. కేవలం పోస్టర్లతోనే కాకుండా, ఇందులో ఉండే మిస్టరీ ఎలిమెంట్స్ నేటి జనరేషన్ ఆడియన్స్ కు ఒక కొత్త థ్రిల్ ఇచ్చేలా ఉంటాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

ఇక ఈ సినిమాను ఏకంగా 100 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారట. తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నిగూఢ నిక్షేపాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆ నిధి వెనుక ఉన్న రహస్యాలు ఏంటి? నాగబంధం అనే పేరుకు కథకు ఉన్న లింక్ ఏంటి? అనే అంశాలను చాలా ఇంటెన్సిటీతో చూపించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఒక ఎపిసోడ్ కోసం ఏకంగా 10 కోట్లు ఖర్చు చేసినట్లు కూడా ఇదివరకే హింట్ ఇచ్చారు.

క్లైమాక్స్ కోసం వేసిన భారీ సెట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కానున్నాయట. పురాతన విష్ణు దేవాలయాల చరిత్రను, ఆధునిక యాక్షన్ కు జోడించి మేకర్స్ ఈ సినిమాను ప్లాన్ చేశారు. జగపతి బాబు, మురళీ శర్మ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మేకింగ్ వాల్యూస్ లో ఎక్కడా తగ్గకుండా అభిషేక్ పిక్చర్స్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఇక ఈ చిత్రాన్ని 2026 వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకునేలా ఈ భారీ బడ్జెట్ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే.. అడ్వెంచరస్ థ్రిల్లర్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక క్యూరియసిటీని క్రియేట్ చేస్తోంది . నిధి వేట చుట్టూ సాగే సినిమాలకు ఎప్పుడూ ఉండే క్రేజ్ ఈ సినిమాకు కూడా ప్లస్ అయ్యేలా ఉంది. 'నాగబంధం' బాక్సాఫీస్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ కు తగ్గట్టుగా కంటెంట్ లో కూడా దమ్ము ఉంటే మరో సెన్సేషనల్ హిట్ టాలీవుడ్ ఖాతాలో చేరడం ఖాయం. ఆ పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలు వెండితెరపై ఎలా హైలెట్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News