"ఆస్తులు అమ్మితే అక్కడికెలా వెళ్తాను?": నాగవంశీ లాజిక్
మాస్ జాతర ప్రమోషన్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావనకు రాగా, నాగవంశీ నవ్వుతూనే ఆ రూమర్లకు చెక్ పెట్టారు.;
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఎంత గ్లామర్‌గా ఉంటుందో, ఫెయిల్యూర్ అంతకంటే ఎక్కువ కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా, ఒక పెద్ద సినిమా అంచనాలను అందుకోలేకపోతే, ఆ వేడి నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా తగులుతుంది. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన 'వార్ 2' విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ఇప్పుడు ఆ సినిమా ఫలితంపై వస్తున్న గాసిప్స్‌కు తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు.
'వార్ 2' చిత్రం తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడలేదన్నది నిజం. దీంతో, నాగవంశీ భారీ నష్టాలను చవిచూశారని, ఆ నష్టాల కారణంగా ఆయన తన ఆస్తులన్నీ అమ్ముకుని దుబాయ్ వెళ్లిపోయారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ రూమర్లు కొన్ని వెబ్ సైట్లలో కూడా రావడంతో, ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ గాసిప్స్ ఆయన చెవిన పడటంతో, నాగవంశీ లేటెస్ట్ గా దీనిపై స్పందించారు.
మాస్ జాతర ప్రమోషన్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావనకు రాగా, నాగవంశీ నవ్వుతూనే ఆ రూమర్లకు చెక్ పెట్టారు. "తప్పులు అందరూ చేస్తారు కదా! తప్పు జరిగింది. నేనైనా, ఎన్టీఆర్ గారైనా ఆదిత్య చోప్రా అనే పెద్ద మనిషిని నమ్మాం. వాళ్ల సైడ్ తప్పు జరిగింది, మనం దొరికాం. దానికి నన్ను ఏసుకున్నారు" అని మొదట ఆ ఫెయిల్యూర్ బాధ్యత తమది కాదని పరోక్షంగా చెప్పారు.
ఇక దుబాయ్ రూమర్‌పై స్పందిస్తూ, అందులోని లాజిక్‌ను ప్రశ్నించారు. "నాకు అర్థం కాలేదు, ఆస్తులు అమ్ముకునేంత బ్యాడ్ పొజిషన్‌లో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తారు? దుబాయ్ ఏమైనా పల్లెటూరా?" అంటూ ఆ రూమర్‌ను కొట్టిపారేశారు. అసలు లాజిక్ లేని ఇలాంటి వార్తలను ఎలా పుట్టిస్తారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కొంతమంది మీడియా వాళ్లు ఫేమస్ అయిన వాళ్లతో ఇలా ఆడుకోవడం కామనే అని, అలా ఆడుకున్నారని మరోవైపు రవితేజ అన్నారు. నిజానికి ఇలాంటి వార్తల వల్ల తన ఫాలోయింగ్, వ్యూయర్‌షిప్ పెరుగుతుందని కూడా మాస్ రాజా సరదాగా వ్యాఖ్యానించారు.
ఇక ఈ రూమర్ల వల్ల బాధపడటం లేదని చెప్పిన మరో కౌంటర్ వేశారు. దుబాయ్ అనే పదాన్ని వాడినందుకు "రిచ్‌గా బాధపడతాను" అంటూ తనపై తానే సెటైర్ వేసుకున్నారు. మొత్తం మీద, నాగవంశీ 'వార్ 2' నష్టాల విషయంలో తనపై వచ్చిన రూమర్లను చాలా లైట్‌గా తీసుకుంటూ, లాజిక్‌తో కొట్టిపారేశారు. బిజినెస్‌లో లాభనష్టాలు సహజమని, కానీ వ్యక్తిగత జీవితంపై ఇలాంటి నిరాధారమైన ప్రచారాలు చేయడం సరికాదని ఆయన చెప్పకనే చెప్పారు.