సింపతీ కార్డ్ వాడినా నాకు వర్కౌట్ అవ్వట్లేదు: నాగవంశీ
లేటెస్ట్ గా 'ఎపిక్' సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.;
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగ అంటే సంక్రాంతి. పెద్ద హీరోల సినిమాలు క్యూ కట్టడం, ఫ్యాన్స్ హడావిడి, బాక్సాఫీస్ క్లాషెస్.. ఇవన్నీ సంక్రాంతి సీజన్ కు ఉండే కిక్. అయితే 2026 సంక్రాంతికి మాత్రం కాంపిటీషన్ పీక్స్ లో ఉండబోతోంది. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు ప్రభాస్, ఇంకోవైపు రవితేజ.. ఇలా స్టార్లందరూ బరిలోకి దిగుతున్నారు. ఈ పోటీ మధ్యలో ఒక యంగ్ ప్రొడ్యూసర్ మాత్రం చాలా తెలివిగా 'సింపతీ కార్డ్' బయటకు తీశారు. ఆయన మరెవరో కాదు, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ.
లేటెస్ట్ గా 'ఎపిక్' సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీడియా ప్రతినిధులు సంక్రాంతి పోటీ గురించి అడగ్గా.. "అందరికంటే నాదే చిన్న సినిమా. చిరంజీవి గారు, ప్రభాస్ గారు, రవితేజ గారి సినిమాలతో పోలిస్తే మాది చాలా చిన్నది. జనాలు నా మీద జాలి పడి సినిమా చూస్తారని కోరుకుంటున్నాను" అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
నిజానికి సితార ఎంటర్టైన్మెంట్స్ అంటేనే మంచి సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ఈ మధ్య కాలంలో ఆ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్ లో వచ్చిన 'వార్ 2' తెలుగు రిలీజ్ ప్లానింగ్ మిస్ ఫైర్ అవ్వడం, అలాగే విజయ్ దేవరకొండ 'కింగ్డమ్', రీసెంట్ గా వచ్చిన 'మాస్ జాతర' సినిమాలు డిజాస్టర్లుగా మిగలడం ఆయన్ని కాస్త వెనక్కి తగ్గించాయనే చెప్పాలి. 'వార్ 2' ఈవెంట్ లో ఆయన చేసిన ఛాలెంజ్ పై వచ్చిన ట్రోలింగ్ కూడా గట్టిగానే తగిలింది.
అందుకే ఈసారి సంక్రాంతికి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు', మారుతి ప్రభాస్ 'రాజాసాబ్', రవితేజ కిషోర్ తిరుమల 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వంటి భారీ సినిమాలతో పోటీ పడుతుండటంతో నాగవంశీ జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఈసారి ఆయన నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమాతో సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు.
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై నాగవంశీకి నమ్మకం ఉన్నా, బయటకు మాత్రం సరదాగా 'సింపతీ' స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. గతంలో చేసిన ఛాలెంజ్ లు బెడిసికొట్టడంతో, ఈసారి సైలెంట్ గా హిట్ కొట్టాలనే ప్లాన్ లో ఉన్నట్లున్నారు. "సింపతీ కార్డ్ వాడినా నాకు వర్కౌట్ అవ్వట్లేదు, రౌడీయిజం రివర్స్ అవుతోంది" అంటూ ఆయనే స్వయంగా జోక్ చేసుకోవడం అక్కడున్న అందరినీ నవ్వించింది.
ఇక స్టార్ హీరోల మధ్య నవీన్ పోలిశెట్టి లాంటి టాలెంటెడ్ హీరో సినిమాను నిలబెట్టడానికి నాగవంశీ తనదైన స్టైల్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఆడియెన్స్ సింపతీ చూపిస్తారో లేక కంటెంట్ ను నమ్మి థియేటర్లకు వెళ్తారో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.