మేం అడిగింది ఇస్తారు.. అందుకే అర్థం చేసుకోవాలి: ఓటీటీలపై నాగవంశీ
థియేటర్స్ లో తెలుగు సినిమాలు రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతాయన్న సంగతి తెలిసిందే.;
థియేటర్స్ లో తెలుగు సినిమాలు రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతాయన్న సంగతి తెలిసిందే. కానీ బాలీవుడ్ లో మాత్రం ఎనిమిది వారాల తర్వాత అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు ఆ విషయంపై యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.
"సినిమా నిర్మాణానికి గాను మాకు అయ్యే ఖర్చుకు డిజిటల్ స్పేస్ నుంచి కొంత మొత్తంలో డబ్బులు రావాలి. అలా జరగాలంటే వాళ్లేమో నాలుగు వారాల్లో స్ట్రీమింగ్ చేయాలని అంటున్నారు. టైమ్ లేట్ అయిన కొద్ది పైరసీ పెరిగిపోతుందంటున్నారు. త్వరగా కంటెంట్ ఇవ్వాలని వారు అంటున్నారు" అని నాగవంశీ తెలిపారు.
"మేం అడిగిన డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ ను కూడా మేం అర్థం చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో నాలుగు వారాలు ఎర్లీ ఏం కాదు. అది సరిపోతుంది. ఇది ఇండస్ట్రీకి ప్రమాదం కాదు. బాగున్న సినిమా కోసం ఆడియన్స్ అసలు వెయిట్ చేయరు. వెంటనే థియేటర్స్ కు వచ్చేస్తారు. వెయిట్ చేసినా డిజిటల్ లో చూస్తారు" అని చెప్పారు.
"అలా జరిగితే డిజిటల్ లో ఫలానా బ్యానర్ తీసిన సినిమాకు ఎక్కువ వ్యూస్ వస్తే.. నెక్స్ట్ మూవీ విషయంలో నాకు ఎక్కువ డబ్బులు ఓటీటీ వాళ్ళు ఇస్తారు. అది కూడా నాకు ప్లస్సే. అలా ఆడియన్స్ ఎలా చూసినా మంచే చేస్తారు. సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎప్పుడూ నిర్ణయం నిర్మాతదే. ఎప్పుడూ ఆయనే డిసైడ్ చేస్తారు" అని అన్నారు.
"ఓటీటీ ఫిక్స్ అవ్వకుండా రిలీజ్ డేట్ ప్రకటించడం రిస్క్. సినిమా నిర్మాణంలో ఓటీటీలు ఇచ్చిన డబ్బులు ఎక్కువ భాగమవుతున్నాయి. కాబట్టి డిస్ట్రిబ్యూటర్లతో విడుదల తేదీ కోసం డిస్కస్ ఎలా చేస్తామో వాళ్లను కూడా అడుగుతాం. అప్పుడు కొన్ని అభిప్రాయాలు చెబుతారు. కానీ వాళ్లేం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయరు" అని స్పష్టం చేశారు.
"ఓటీటీ వాళ్లు తమ బిజినెస్ చూసుకోవాలి. మనం సినిమా కొనమంటాం. వాళ్లు ఇప్పుడైతే అవ్వదు.. అప్పుడైతే అవుతుంది అంటారు. మనం ఆగాలనుకుంటే ఆగుతాం.. లేకుంటే లేదు.. వాళ్లేం డేట్ వేయనివ్వకుండా చేయడం లేదు. డిజిటల్ ప్లాట్ ఫామ్ కు సినిమాల లిమిట్ ఉంటుంది.. బడ్జెట్ కూడా ఉంటుంది" అని తెలిపారు.
"వాళ్ల బడ్జెట్ అయిపోతే మనం ఎక్కువ సినిమాలు చేసినా లాభం లేదు. అప్పుడు మనం తీయాలనుకుంటే.. కంటెంట్ పై నమ్మకం ఉంటే తీయొచ్చు. సినిమా రిలీజ్ చేస్తే.. ఓటీటీ కొంటాయని ఊహిస్తూ రిలీజ్ చేయవచ్చు" అని అన్నారు. రిలీజ్ కు ముందు అమ్మేస్తే ధైర్యంగా మూవీ చేయొచ్చని, లేకుంటే కంటెంట్ పై ఉన్న నమ్మకంతో తీయొచ్చని నాగవంశీ అభిప్రాయపడ్డారు.