సంక్రాంతికి సినిమాల ఖర్చు.. నాగవంశీ ఏమన్నారంటే?

ఎందుకంటే ఆ సినిమా పండుగ సీజన్‌ కు ఒక వారం ముందు విడుదల అవుతున్నందున, సంక్రాంతి సినిమాల ఖర్చుతో దానిని కలపడం సరైంది కాదని ఆయన తెలిపారు.;

Update: 2026-01-04 19:12 GMT

సంక్రాంతి పండుగ అంటే కుటుంబ సమేతంగా సినిమాలు చూడటం తెలుగు ప్రేక్షకులకు ఆనవాయితీ. అయితే ఇటీవల కాలంలో థియేటర్ టికెట్ ధరలు, ఫుడ్ ఖర్చు పెరగడంతో పండుగ సీజన్‌ లో సినిమాలపై అయ్యే వ్యయం గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

సంక్రాంతి సందర్భంగా ఒక కుటుంబం సినిమా చూడటానికి ఖర్చు చేసే మొత్తాన్ని తప్పుగా అంచనా వేయొద్దని నాగవంశీ అభిప్రాయపడ్డారు. సంక్రాంతికి ఒక కుటుంబం మూవీ కోసం రూ.2000 ఖర్చు చేయడం పూర్తిగా అఫర్డబుల్ అని అన్నారు. దీన్ని నాలుగు సినిమాలకు కలిపి రూ.8000గా చూడకూడదని, రోజుకు రూ.2000గా ఆలోచించాలని చెప్పారు.

పండుగ సెలవుల్లో అంతా ఫ్యామిలీ మెంబర్స్ తో బయటకు వెళ్లడం, సరదాగా గడపడం సహజమేనని, అందులో సినిమా ఖర్చు కూడా ఒక భాగమేనని ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. అంతేకాదు ఈ లెక్కలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాను పరిగణనలోకి తీసుకోవద్దని నాగవంశీ స్పష్టం చేశారు.

ఎందుకంటే ఆ సినిమా పండుగ సీజన్‌ కు ఒక వారం ముందు విడుదల అవుతున్నందున, సంక్రాంతి సినిమాల ఖర్చుతో దానిని కలపడం సరైంది కాదని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో పండుగ బాక్సాఫీస్ లెక్కలపై మరోసారి చర్చ మొదలైంది. నిజానికి.. సంక్రాంతి సీజన్‌ లో సాధారణంగా రోజుకు ఒక సినిమా చూసేలా కుటుంబాలు ప్లాన్ చేసుకుంటాయి.

ఇప్పుడు నాలుగు రోజుల సెలవుల్లో.. నాలుగు సినిమాలు చూడటం పెద్ద భారం కాదని నిర్మాత వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు ఎక్కువగా విడుదలయ్యే.. సంక్రాంతి సమయంలో థియేటర్లకు వెళ్లడం ప్రేక్షకులకు ఒక పండుగ అనుభూతిగా మారుతుందని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు నెటిజన్లు టికెట్ ధరలతో పాటు పార్కింగ్, ఫుడ్ ఖర్చు కలిపితే రూ.2000 దాటిపోతుందని చెబుతుండగా, మరికొందరు మాత్రం సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగకు అంత ఖర్చు సహజమేనని నాగవంశీ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నారు.

ఏదేమైనా ఈ ఏడాది సంక్రాంతికి భారీ అంచనాల మధ్య పలు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న చిత్రాలు ఎక్కువగా ఉండటంతో థియేటర్లలో పెద్ద ఎత్తున సందడి కనిపించే అవకాశం ఉందని అంచనా. ఇలాంటి సమయంలో టికెట్ ధరలు, ఖర్చుపై నాగవంశీ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి!

Tags:    

Similar News