కారణం లేకుండా విజయ్ ను టార్గెట్ చేస్తున్నారు
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే.;
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కేవలం తన సినిమాలతోనే కాకుండా రియల్ లైఫ్ యాటిట్యూడ్ తో కూడా మంచి పాపులారిటీని తెచ్చుకున్న విజయ్ కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో, ఆయనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ విమర్శలు చేసే వాళ్లు కూడా అంతే మంది ఉన్నారు. విజయ్ ఏం మాట్లాడినా దాన్ని విమర్శలు చేసే బ్యాచ్ కూడా ఒకటుందనే ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండపై ఎక్కువ నెగిటివిటీ వస్తూ ఉంటుంది. తాజాగా టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న కింగ్‌డమ్ సినిమాకు నిర్మాత నాగ వంశీ. కింగ్‌డమ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్న నాగ వంశీ విజయ్ ను అసలెందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియడం లేదని అన్నారు.
అసలే విజయ్ రీసెంట్ సినిమాలు హిట్టవక కాస్త డౌన్ లో ఉంటే, కనీసం జాలి లేకుండా అతనిపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసి ఇంకాస్త ఎక్కువ చేస్తున్నారన్నారు. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతనేదో చెప్పబోతే అది వేరేలా మారి వివాదంగా నిలిచిందని, ఓ ఇంటర్వ్యూలో ఆయనేదో అంటే దాన్ని మరో రకంగా స్ప్రెడ్ చేసి హంగామా చేశారని, అసలు విజయ్ ను టార్గెట్ ఎందుకు చేస్తున్నారో, ఏం అవసరమొచ్చిందో తెలియడం లేదన్నారు వంశీ.
ఇదంతా చూస్తుంటే విజయ్ ను ఉద్దేశపూర్వకంగనే టార్గెట్ చేస్తున్నారనిపిస్తుందని, రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ పై ఎదురైన వ్యతిరేకతకు విజయ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉందని, అందరూ ట్రోల్ చేస్తున్నట్టు విజయ్ అలాంటి వాడు కాదని వంశీ చెప్పారు. చిన్న వయసులో విజయ్ బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేవాడనే విషయాన్ని తాను కూడా ఒప్పుకుంటానని, కానీ ఇప్పుడు విజయ్ చాలా కాన్ఫిడెంట్ గా మారాడని, ఎవరైనా విజయ్ తో పర్సనల్ గా మాట్లాడితే అతని గురించి తెలుస్తుందని నాగ వంశీ అన్నారు.
విజయ్ ఏం మాట్లాడినా భూతద్ధంలో పెట్టి చూసి మరీ కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నారని, ఇప్పుడు వాటన్నింటినీ దాటుకుని మరీ కింగ్‌డమ్ ఆడాలని, దానికి తామెంతో ఎఫర్ట్స్ పెట్టాలని నాగవంశీ అనగా, ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కింగ్‌డమ్ విషయానికొస్తే విజయ్ హీరోగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుండగా, అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.