నాగశౌర్యకు నిర్మాత క్షమాపణలు.. ఏమన్నారంటే..

నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇది తమ బ్యానర్ నుంచి వస్తున్న మొదటి సినిమా అని గుర్తుచేశారు.;

Update: 2026-04-07 04:08 GMT

​యువ హీరో నాగశౌర్య తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ మళ్ళీ మరో బిగ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అతను, ఈసారి పూర్తిస్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రామ్ దేసిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే ఓ వర్గం ఆడియెన్స్ ఫోకస్ పడింది. నాగశౌర్య ఈ సినిమాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. సినిమా ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది.

​హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా వేడుకల్లో హీరోలను పొగడటం, సినిమా గొప్పతనాన్ని వివరించడం చూస్తుంటాం. కానీ ఈ వేదికపై నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి మైక్ అందుకుని హీరో నాగశౌర్యకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇది అక్కడికి వచ్చిన వారందరినీ కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.

​నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇది తమ బ్యానర్ నుంచి వస్తున్న మొదటి సినిమా అని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే తనకు అనుభవం లేకపోవడం వల్ల లేదా టీమ్ లోని ఇతరుల వల్ల తెలియకుండా కొన్ని తప్పులు జరిగాయని ఆయన ఒప్పుకున్నారు. షూటింగ్ సమయంలో నాగశౌర్యకు కొంత ఇబ్బంది కలిగి ఉండవచ్చని, అందుకే ఆ పొరపాట్లకు గాను సారీ చెబుతున్నానని తెలిపారు. ఒక హీరోగా శౌర్య పడ్డ కష్టానికి, ఆయన ఇచ్చిన సపోర్ట్‌కు నిర్మాత ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

​నిర్మాణ సంస్థ పరంగా ఎదురైన ఇబ్బందులను పట్టించుకోకుండా శౌర్య సినిమా పూర్తి చేయడం పట్ల నిర్మాత సంతోషం వ్యక్తం చేశారు. “తెలిసీ తెలియక మా వాళ్ళు కొన్ని తప్పులు చేశారు, దానికి నేను క్షమాపణ కోరుతున్నాను” అని ఆయన లైవ్ ఈవెంట్ లో చెప్పడం విశేషం. ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవని, భవిష్యత్తులో నాగశౌర్యతో కలిసి మళ్ళీ పని చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఒక కొత్త నిర్మాణ సంస్థకు హీరో ఎంతటి వెన్నుముకగా నిలిచాడో ఈ మాటల ద్వారా అర్థమవుతోంది.

​సినిమా ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘చలో’ తర్వాత నాగశౌర్య కెరీర్‌లో ఇది ఒక భారీ హిట్ గా నిలుస్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్ సన్నివేశాల్లో శౌర్య పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఈ సినిమాలో ఆయన కెపాసిటీ ఏంటో అందరికీ తెలుస్తుందని చెప్పారు. నిర్మాతగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను దాటుకుని, అవుట్ పుట్ పట్ల సంతృప్తిగా ఉన్నట్లు వివరించారు. ఈ సినిమా నాగశౌర్యను కొత్త కోణంలో ఆవిష్కరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఒక క్రేజీ అప్‌డేట్ ఇవ్వాల్సిన వేదికపై నిర్మాత ఇలా ఎమోషనల్ కావడం అందరిని కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా హీరోలు, నిర్మాతల మధ్య ఉండే గ్యాప్ గురించి వార్తలు వస్తుంటాయి. కానీ ఇలా బహిరంగంగా తప్పును ఒప్పుకుని క్షమాపణ అడగడం ద్వారా నిర్మాత తన నిజాయితీని చాటుకున్నారు. ఏప్రిల్ 17న థియేటర్లలోకి రాబోతున్న ఈ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నాగశౌర్యకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News