విజయ్ తో సోలో మూవీ.. నాగీ అసలు ప్లాన్ అదేనా..
నిజానికి నాగ్ అశ్విన్, విజయ్ దేవరకొండ జర్నీ చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. దర్శకుడిగా నాగ్ అశ్విన్ తొలి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ కీలక పాత్ర పోషించారు.
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి జోడీల్లో దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకటి. ఇప్పటివరకు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ప్రతి ప్రాజెక్టులో ఏదో ఒక రూపంలో విజయ్ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఫ్యూచర్ లో సోలో సినిమా కోసం నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారేమో అనే చర్చ మొదలైంది.
తాజాగా సింగ్ గీతం ప్రమోషన్స్ సందర్భంగా నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండతో కచ్చితంగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా చేయాలని ఉందని ఆయన క్లారిటీ ఇచ్చారు. విజయ్‌ను విభిన్న పాత్రల్లో చూపించడం తనకు చాలా కంఫర్ట్ గా అనిపిస్తుందని, ఇప్పటివరకు తాను చేసిన నాలుగు సినిమాల్లోనూ విజయ్ ను కొత్త యాంగిల్ లోనే చూపించానని చెప్పారు. ఇప్పుడు సోల్ మూవీ చేసేందుకు మంచి సమయం కోసం ఇద్దరూ ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.
ఆ కామెంట్స్ తోనే అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. ఇప్పటివరకు కామియోలు మాత్రమే చేసిన విజయ్.. ఇక నాగీ దర్శకత్వంలో పూర్తి స్థాయి హీరోగా కనిపించేందుకు రెడీ అయ్యారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విభిన్న కథలను తెరకెక్కించడంలో నాగ్ అశ్విన్ కు ఉన్న టాలెంట్, ప్రయోగాత్మక పాత్రలను చేయడంలో విజయ్‌కు ఉన్న ఆసక్తి చూస్తే ఆ కాంబోపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
నిజానికి నాగ్ అశ్విన్, విజయ్ దేవరకొండ జర్నీ చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. దర్శకుడిగా నాగ్ అశ్విన్ తొలి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ కీలక పాత్ర పోషించారు. ఆ సినిమతో నటుడిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత మహానటిలో మరో భిన్నమైన పాత్రలో కనిపించారు. ఇక కల్కి 2898 ఏడీ’లో విజయ్ దేవరకొండ చేసిన ప్రత్యేక పాత్ర ప్రేక్షకులకు సర్ప్రైజ్ గా నిలిచింది.
రీసెంట్ గా సింగ్ గీతం మూవీలో కూడా కనిపించారు. దీంతో నాగ్ అశ్విన్ సినిమాల్లో విజయ్ కనిపించడం ఒక రకంగా అభిమానులకు అలవాటైపోయింది. ప్రతి సినిమాలో ఆయన కోసం ఏదో ఒక ప్రత్యేక పాత్ర సిద్ధంగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఏర్పడింది. అదే సమయంలో నాగ్ అశ్విన్ తన సినిమాల్లో పాత్రలను చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తారు. హీరో ఇమేజ్ కంటే పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తారు.
అలాంటి దర్శకుడి చేతుల్లో విజయ్ దేవరకొండ లాంటి నటుడు పడితే పూర్తిగా కొత్త తరహా పాత్ర ప్రేక్షకులకు కనిపించే అవకాశం ఉంది. మరోవైపు విజయ్ కూడా కెరీర్ లో కొత్త తరహా కథలు, విభిన్న పాత్రల కోసం ప్రయత్నిస్తున్న సమయం ఇది. దీంతో నాగ్ అశ్విన్ ఆలోచన, విజయ్ ఆసక్తి ఒకే దారిలో ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం ఆ ప్రాజెక్టుపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, నాగ్ అశ్విన్ తాజా కామంట్స్ మాత్రం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించాయి. ఇప్పటివరకు చిన్న చిన్న పాత్రలతో సాగిన ఆ ఫ్రెండ్ షిప్.. త్వరలోనే సోలో సినిమాగా మారుతుందా? విజయ్ కోసం నాగ్ అశ్విన్ ప్రత్యేక కథ సిద్ధం చేస్తున్నారా? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.