సింగీతం విజ‌న్‌ని ప్ర‌శ్నించ‌డానికి మేమెవ‌రం? 'టాస్' వేసి ముందుకెళ్లాం!

ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ తన ఫ్లాష్‌బ్యాక్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఏడేళ్ల క్రితం సింగీతం సార్‌ను కేవలం ఒక్కసారి కలిసి ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అనుకున్నాను.

Update: 2026-06-15 07:17 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. రీసెంట్‌గా జరిగిన `సింగ్ గీతం` సినిమా థాంక్యూ (సక్సెస్) మీట్‌లో ఆయన మాట్లాడిన మాటలు.. అలాగే టీమ్ మెంబర్స్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఎవరైనా ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు `స్పీచ్ లెస్` (మాటలు రావడం లేదు) అంటారు.. కానీ ఈ వేదికపై నాగ్ అశ్విన్ ప్రసంగిస్తున్నప్పుడు ఆయన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ నిజంగానే భావోద్వేగంతో కాసేపు మాట రాని పరిస్థితి ఏర్పడింది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారితో కలిసి పనిచేయడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ తన ఫ్లాష్‌బ్యాక్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఏడేళ్ల క్రితం సింగీతం సార్‌ను కేవలం ఒక్కసారి కలిసి ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అనుకున్నాను. ఎందుకంటే ఆయన మహానటి సావిత్రి గారిని మొదటిసారి సినిమా కోసం అడగడానికి వెళ్లినప్పటి నుంచి.. `మాయాబజార్` సెట్స్‌లో కేవీ రెడ్డి గారు ఆయనను తిట్టడం వరకు... అలాగే `ఆదిత్య 369` వంటి ఎన్నో అద్భుతాలను కళ్లారా చూసిన ఒక గొప్ప వ్యక్తి. చిన్నప్పుడు మా ఇంట్లో ఒక టీవీని పట్టుకుని ఇదే `ఆదిత్య 369`లోని టైమ్ మెషీన్ అనుకుంటూ ఇల్లు అంతా అటూ ఇటూ తిరిగిన జ్ఞాపకాలు నాకు ఉన్నాయి! అంటూ సింగీతం గారిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.

ఇక ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ గురించి మాట్లాడుతూ.. గతేడాది అక్టోబర్‌లో మేము ఈ స్క్రిప్ట్ పనిని ప్రారంభించాము. సింగీతం సార్ లాంటి మహానుభావుడు కథను ఎలా తీసినా, ఆయన విజన్‌ను ప్రశ్నించడానికి మనమెవరం? ఆయన ఏం చేయాలనుకుంటే అది చేద్దాం అని ఫిక్స్ అయ్యాం. అయితే ఈ స్క్రిప్టు రాసే సమయంలో ఒకానొక దశలో మాకు ఏం చేయాలో పాలుపోలేదు... ఒక రకంగా బొమ్మా బొరుసు (టాస్) వేసినట్లుగా ముందుకు సాగాము. సినిమా అంతా మ్యూజికల్ కావడంతో.. మేం పాడుతూ... రాస్తూ ఉన్నాం... అది అలా సాగుతూనే ఉంది. చివరకు ఒక పాయింట్ దగ్గర కథను ఆపగలిగాం! అని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇదే వేదికపై నాగ్ అశ్విన్ కూల్ నేచర్ గురించి ఆయన టీమ్‌లోని ఒక యంగ్ బోయ్ చేసిన కామెంట్స్ అందరినీ పొట్టచేక్కలయ్యేలా నవ్వించాయి. ``ఆఫీస్‌లో లేదా షూటింగ్ సెట్స్‌లో ఎలాంటి తుఫాన్ లాంటి పరిస్థితి వచ్చినా నాగి సార్ చాలా కూల్‌గా ఉంటారు. సింపుల్‌గా చెప్పాలంటే... సార్ మార్చురీలో డెడ్‌బాడీ కంటే కూల్ పర్సన్.. అంటూ ఊహించని రేంజ్‌లో పోలిక తీసుకువచ్చాడు. దీంతో స్టేజ్ మీదున్న నాగ్ అశ్విన్‌తో పాటు అక్కడున్న చిత్ర బృందం, ప్రేక్షకులంతా పడిపడి నవ్వారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ``ఈ పోలికేంటి బాసూ.. నాగి సార్ కూల్‌నెస్‌కు ఇదో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్`` అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

`మహానటి` చిత్రం తర్వాత ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయి... థియేటర్లలో తమ సొంత సినిమాగా ఓన్ చేసుకుంటున్న చిత్రం `సింగ్ గీతం` అని నాగ్ అశ్విన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో సింగీతం దశాబ్దాల అనుభవంతో పాటు... 24 ఏళ్ల యువకుడు సంకల్ప్ ఆలోచనలు తోడవడమే సినిమా ఇంత సమకాలీనంగా.. అందరికీ నచ్చేలా రావడానికి కారణమని చెప్పారు. సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పడిన కష్టం, నటీనటులందరి చేత నిజంగానే పాటలు పాడించడం వంటి మ్యాజిక్ వల్లే ఈ రోజు సినిమా ఘన విజయం సాధించిందని చిత్ర బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News