జెట్ లీ.. అక్కడ రిలీజ్ ఆగిపోవడం వెనుక అసలు గొడవ ఇదే!
సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య గొడవలు రావడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి వివాదం కాస్త ముదిరినట్లు కనిపిస్తోంది.;
సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య గొడవలు రావడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి వివాదం కాస్త ముదిరినట్లు కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బడా నిర్మాణ సంస్థ ఇప్పుడు థియేటర్ యాజమాన్యాల తీరుపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తోంది. పర్సంటేజ్ సిస్టమ్ గురించి జరుగుతున్న చర్చల మధ్య, మైత్రీ రిలీజ్ చేసిన లేటెస్ట్ మూవీ ‘జెట్ లీ’ ప్రదర్శన ఆగిపోవడం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీసింది. అసలు మల్టీప్లెక్స్ లలో కూడా సినిమాను అడ్డుకోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలు విషయం ఏంటంటే, తెలంగాణలోని కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు, మైత్రీ డిస్ట్రిబ్యూటర్లకు మధ్య వీక్లీ రెంటల్స్ విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అయితే ఈ గొడవను సాకుగా చూపి, అసలు సంబంధం లేని మల్టీప్లెక్స్ ప్రాపర్టీలలో కూడా ‘జెట్ లీ’ సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నారని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రతినిధి శశిధర్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. సింగిల్ స్క్రీన్ లలో గొడవ ఉంటే అక్కడ తేల్చుకోవాలి కానీ, మల్టీప్లెక్స్ స్క్రీన్లను అడ్డుపెట్టుకుని ఒత్తిడి తీసుకురావడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఈ మొత్తం వ్యవహారం వెనుక ఒక రకమైన ఒత్తిడి కనిపిస్తోందని మైత్రీ సంస్థ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మల్టీప్లెక్స్ అగ్రిమెంట్లకు, సింగిల్ స్క్రీన్ చర్చలకు ఎలాంటి సంబంధం లేకపోయినా, కావాలనే తమ సినిమాను ఆపేయడం వ్యాపార పరంగా సరైన పద్ధతి కాదని వారు వాదిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి ధోరణి కొనసాగితే అది తప్పుడు సంప్రదాయాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఫెయిర్ అండ్ ట్రాన్స్‌పరెంట్ పద్ధతిలో చర్చలు జరపడానికి తాము ఎప్పుడూ సిద్ధమని, కానీ ఇలా బ్లాక్ మెయిల్ చేసేలా ప్రవర్తించడం సరికాదని స్పష్టం చేశారు.
ఇప్పటికే మైత్రీ డిస్ట్రిబ్యూషన్ లో వచ్చిన ‘జెట్ లీ’ సినిమా ప్రదర్శన నిలిచిపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ కలెక్షన్ల మీద పడే అవకాశం ఉందని మేకర్స్ చెబుతున్నారు. మల్టీప్లెక్స్ యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, సినిమాను వెంటనే స్క్రీనింగ్ చేయడానికి అనుమతించాలని మైత్రీ కోరుతోంది. సింగిల్ స్క్రీన్ సమస్యల గురించి విడిగా చర్చించవచ్చని, కానీ ఆ ప్రభావం ఇతర బిజినెస్ అరేంజ్ మెంట్స్ మీద పడకూడదని వారు గట్టిగా చెబుతున్నారు. ఈ గొడవ ఇలాగే కొనసాగితే రాబోయే పెద్ద సినిమాలపై కూడా దీని ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది.
పర్సంటేజ్ వర్సెస్ రెంటల్ గొడవ ఇప్పుడు మల్టీప్లెక్స్ స్క్రీన్ల వరకు చేరింది. ఓ వైపు ఎగ్జిబిటర్ల పట్టుదల, మరోవైపు మైత్రీ సంస్థ వాదనల మధ్య ఈ వివాదం ఎటువైపు వెళ్తుందో చూడాలి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న చిన్న సినిమాలకు ఇలాంటి అడ్డంకులు ఎదురైతే అవి మరింత కుదేలయ్యే ప్రమాదం ఉంది. మరి ఛాంబర్ ప్రతినిధులు జోక్యం చేసుకుని ఈ ఇష్యూను ఎంత త్వరగా క్లియర్ చేస్తారో చూడాలి. మైత్రీ వేసిన ఈ ప్రశ్నలకు ఎగ్జిబిటర్ల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.