తెలంగాణనే కాదు.. ఏపీ కూడా అవార్డులు ఇవ్వాలి: సీనియర్ నటుడు

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. 2024కు గాను ఉత్తమ చిత్రం, హీరో, హీరోయిన్.. సహా అనేక క్యాటగిరీల్లో అవార్డులను గురువారం అనౌన్స్ చేయగా, శుక్రవారం 2013-2024 సంవత్సరాలకు గాను ప్రకటించింది.;

Update: 2025-05-30 11:00 GMT

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. 2024కు గాను ఉత్తమ చిత్రం, హీరో, హీరోయిన్.. సహా అనేక క్యాటగిరీల్లో అవార్డులను గురువారం అనౌన్స్ చేయగా, శుక్రవారం 2013-2024 సంవత్సరాలకు గాను ప్రకటించింది. ఈ మేరకు సినీ నటుడు మురళీ మోహన్ ప్రెస్ మీట్ లో ప్రకటించారు.

గద్దర్ అవార్డు జ్యూరీ చైర్మన్ అయిన మురళీమోహన్, అవార్డుల విజేతలను ప్రకటించాక మీడియాతో మాట్లాడారు. తెలుగు సినిమాకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవార్డులు ఇచ్చే విషయంలో ఒక అవగాహనకు రావాలని అభిప్రాయపడ్డారు. వివాదాలకు తావివ్వకుండా రెండు సర్కార్లు వ్యవహరించాలని హితవు పలికారు.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా సినిమా అవార్డులను ప్రకటించాలని మురళీ మోహన్ కోరారు. ఒకే తెలుగు సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అవార్డులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. అప్పుడు అనవసరమైన చర్చలకు, వివాదాలకు దారితీసే అవకాశం కచ్చితంగా ఉంటుందని అన్నారు.

అందుకే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక నిర్ణయానికి రావాలని కోరారు. ముఖ్యంగా.. ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే, ఆ తర్వాత ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేయాలని సూచించారు. ఆ పద్ధతి పాటించడం వల్ల ఎవరికీ ఎలాంటి సమస్యలు ఉండవని మురళీమోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలు కూడా కావాలని అన్నారు. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదని చెప్పారు. సినిమా విషయంలో తెలుగు ప్రేక్షకులంతా ఒకటేనని స్పష్టం చేశారు. ఇప్పుడు మన టాలీవుడ్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయని తెలిపారు. మనకంటే ముందు అమెరికా వాళ్ళే చూస్తున్నారన్నారు.

అందుకే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ, ప్రేక్షకుల ఐక్యతను దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని మురళీ మోహన్ కోరారు. దీంతో ఇప్పుడు ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనేక మంది నెటిజన్లు ఆయన సూచనలతో ఏకీభవిస్తున్నారు. కరెక్ట్ గా చెప్పారని అంటున్నారు. మరి మురళీ మోహన్ సూచనపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా రెస్పాండ్ అవుతాయో వేచి చూడాలి.

Tags:    

Similar News