హిట్ మెషీన్‌లో ఉన్న గుడ్ క్వాలిటీ అదే!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక దశలో కథల చౌర్యం జరిగిందని ఎక్కువగా వినిపిస్తూ ఉండేది. ఒకరి కథని కాపీ చేసి దాన్ని అటు ఇటుగా మార్చేసి సినిమా తీసేసి క్రెడిట్ కొట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.;
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక దశలో కథల చౌర్యం జరిగిందని ఎక్కువగా వినిపిస్తూ ఉండేది. ఒకరి కథని కాపీ చేసి దాన్ని అటు ఇటుగా మార్చేసి సినిమా తీసేసి క్రెడిట్ కొట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒరిజినల్ స్టోరీ రైటర్స్ విషయం తెలుసుకుని రైటర్స్ యూనియన్‌కు వెళ్లడం, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్ తలుపు తట్టడం..అక్కడా న్యాయం జరక్కపోతే కోర్టులని ఆశ్రయించడం చూశాం. ఇక కొంత మంది డైరెక్టర్లైతే రాసిన వారికి డబ్బులిస్తున్నాం కదా!..మళ్లీ క్రెడిట్ ఇవ్వడం ఎందుకు అని స్టోరీ రైటర్‌గా కూడా తమ పేరే వేసుకునే వారు.
నందమూరి బాలకృష్ణ నటించిన `సింహా` స్టోరీ క్రెడిట్ విషయంలో ఇదే జరిగింది. స్టోరీ రాసింది కొరటాల శివ. అయితే తను అడిగినంత ఇచ్చేశాం కదా..తనకు క్రెడిట్ ఎందుకు ఇవ్వాలని దర్శకుడు బోయపాటి శ్రీను స్టోరీ రైటర్‌గా తన పేరే వేసుకోవడం అప్పట్లో వివాదానికి తెర తీసింది. స్టోరీ రాసింది నేనయితే తన పేరు వేసుకున్నాడని కొరటాల స్టేట్‌మెంట్ ఇవ్వడం..దీనిపై పెద్ద రచ్చ జరగడం తెలిసిందే. ఇప్పుడు కూడా ఒకటి అరా అలాంటి సంఘటనలు జరుగుతున్నా రైటర్స్ మనకు డబ్బులు ముఖ్యం అని సైలెంట్‌గా పనిచేసుకుపోతున్నారు.
ఈ మధ్య చాలా మంది డైరెక్టర్లు వారే కథ, మాటలు రాసుకుంటున్నారు. వేరే వాళ్లు రాసినా క్రెడిట్ మాత్రం డైరెక్టర్లే తీసుకుంటున్నారు. స్టోరీ విషయంలో వేరే రైటర్స్ ఇన్ పుట్స్ ఇచ్చినా.. డైలాగ్స్ విషయంలోనూ కీ రోల్ పోషించినా కొంత మందికి దక్కాల్సిన క్రెడిట్ దక్కడం లేదు. అయితే వరుస విజయాలతో హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మాత్రం తాను రైటర్ల నుంచి వచ్చాను కాబట్టి రైటర్లకు క్రెడిట్ ఇస్తానని చెబుతున్నాడు. తన వద్ద ఎస్.కృష్ణ, సాయి, ఆదినారాయణ..ఇలా ముగ్గురు రైటర్స్ ఉన్నారు.
`సంక్రాంతికి వస్తున్నాం` సినిమా విజయంలో వీరి పాత్ర చాలా ఉంది. పాత్రల సృష్టి నుంచి ఫన్ జనరేట్ చేసే డైలాగ్ష్ వరకు ఈ ముగ్గరు రైటర్స్ తమ తమ పాత్రలని విజయవంతంగా పోషించారు. అయితే వారి క్రెడిట్‌ని అనిల్ రావిపూడి తీసుకోకుండా వారికే ఇచ్చాడు. కారణం తను కూడా రైటర్ స్టేజ్ నుంచే వచ్చాడు కాబట్టి. రైటర్స్ శ్రమ ఏంటో తెలుసు కాబట్టి. కొంత వరకు డైలాగ్స్‌లో తన ప్రమేయం ఉన్నా కానీ రైటర్స్‌కు మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ ఇస్తానని చెబుతున్నాడు. ఈ క్వాలిటీనే అనిల్ రావిపూడిని అపజయమెరుగని డైరెక్టర్‌గా నిలబెడుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
రీసెంట్‌గా `మన శంకరవరప్రసాద్ గారు`తో ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి త్వరలో తన తదుపరి మూవీని ప్రారంభించబోతున్నాడు. దీన్ని వెంకీ మామతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్ మొదలు పెట్టిన అనిల్ కీ రోల్స్ కోసం ఆర్టిస్ట్‌లని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ఇందులో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ కీ రోల్‌లో నటించనుండగా, వెంకీ మామకు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్.