గ్లామ‌ర్ ఒక భ్ర‌మ‌: అవార్డుల వేడుకల్లో మారాల్సిన నటుల వైఖరి

సంప‌ద‌లు పెరిగాక ఇండ‌స్ట్రీలో కొంద‌రు ఎలా మారుతారో ఇటీవ‌ల `పూరి మ్యూజింగ్స్`లో పూరి జ‌గ‌న్నాథ్ అద్భుతంగా వ‌ర్ణించారు.

Update: 2026-05-22 07:21 GMT

సంప‌ద‌లు పెరిగాక ఇండ‌స్ట్రీలో కొంద‌రు ఎలా మారుతారో ఇటీవ‌ల `పూరి మ్యూజింగ్స్`లో పూరి జ‌గ‌న్నాథ్ అద్భుతంగా వ‌ర్ణించారు. సినీ పరిశ్రమలో కీర్తి ప్రతిష్టలు, ప్రజాదరణ పెరిగే కొద్దీ కొందరు నటీనటుల ఆలోచనా విధానంలో విచిత్రమైన మార్పులు వస్తుంటాయి. వెండితెర చ‌క్ర‌వ‌ర్తులుగా ఫీల‌వుతూ ప్ర‌జ‌ల్లో భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తూ.. తాము సాధారణ మానవులం కాదనే భ్రమలో కొందరు మునిగిపోతుంటారు. ప్రజలు చూపే అమితమైన అభిమానాన్ని చూసి తామేదో `డెమీ-గాడ్స్` (దైవాంశ సంభూతులం) అని అనుకోవడం మొదలుపెడతారు. సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చలనచిత్ర రంగంలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత చాలామంది తాము సామాన్య ప్రజల కంటే భిన్నమైన వ్యక్తులమనే అహాన్ని పెంచుకుంటారని... జనం అభిమానిస్తేనే తాము గొప్పవాళ్లమనే వాస్తవాన్ని మర్చిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే(త్రోబ్యాక్) కార్య‌క్ర‌మంలో ముర‌ళీమోహ‌న్ మాట్లాడుతూ.. బాలీవుడ్ (బాంబే) సినీ సంస్కృతిని, మన దక్షిణాది (సౌత్) సినీ వాతావరణాన్ని పోలుస్తూ మ‌న‌వాళ్ల తీరును ఎండ‌గ‌ట్టారు. బాంబేలో ఫిలింఫేర్ లేదా జాతీయ, రాష్ట్ర స్థాయి చలనచిత్ర అవార్డుల వేడుకలు జరిగితే పరిశ్రమలోని ప్రతి స్టార్ ఎంతో గౌరవంతో ఆ ఈవెంట్‌కు హాజరవుతారు.. అని వ్యాఖ్యానించ‌గా, ఆర్కే దానికి స్పందిస్తూ.. బాంబేలో కేవలం అవార్డులు వచ్చిన వారు మాత్రమే వేదికపైకి రారు. పిలిచిన ప్రతి ఒక్కరూ తోటి కళాకారుల ప్రతిభను అభినందించడానికి వస్తారు. అమితాబ్ బచ్చన్ అంతటి మహానటుడైనా సరే.. వేరే ఏ చిన్న నటుడికి అవార్డు వచ్చినా ఆ వేడుకకు హాజరై వారిని ప్రోత్సహిస్తారని ఆ స్థాయి విన‌యం కనిపిస్తుందని గుర్తుచేశారు.

దురదృష్టవశాత్తూ మన దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో నంది అవార్డుల వంటి ప్రతిష్టాత్మక వేడుకలు జరిగినప్పుడు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కేవలం తమకు అవార్డు వస్తుందని ముందే తెలిసిన స్టార్లు, సాంకేతిక నిపుణులు మాత్రమే వేడుకకు వస్తారు. అవార్డులు రాని ఇత‌రులు ఆ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. కేవలం తమకు వ్యక్తిగత గుర్తింపు, సత్కారం ఉన్నప్పుడే వేదికలపై కనిపించాలనుకోవడం... తోటి వారి విజయాలను షేర్ చేయ‌డానికి రాకపోవడం అనేది కొందరి సంకుచిత మనస్తత్వానికి... ఇండస్ట్రీలో ఉండాల్సిన ఐక్యతా లోపానికి అద్దం పడుతుందని మురళీమోహన్ నిర్మొహమాటంగా చెప్పారు.

ఈ సందర్భంలో మురళీమోహన్ తన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేసారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఒకానొక దశలో తాను కూడా అలాంటి అహాన్ని లేదా భ్రమను ఎదుర్కొన్నానని.. అయితే చాలా త్వరగానే ఆ గ్లామర్ లోకం నుండి బయటపడి వాస్తవికతను గ్రహించానని వెల్లడించారు. ఇండస్ట్రీలో కాలంతో పాటు ఎందరో మారినా.. ఇప్పటికీ కొంతమంది స్టార్లలో తాము సామాన్యుల కంటే ఎంతో గొప్పవాళ్లమనే అహంకారపూరిత భావన అలాగే ఉండిపోవడం విచారకరమన్నారు. తెరపై కనిపించే కీర్తి ప్రతిష్టలు ఎప్పుడూ శాశ్వతం కావని.. సామాన్య ప్రజలతో .. తోటి కళాకారులతో అనుసంధానమై ఉన్నప్పుడే ఎవరికైనా నిజమైన గౌరవం దక్కుతుందని ఆయన హితవు పలికారు.

కళాకారులు నిజంగా ఎప్పుడు గొప్పవాళ్లవుతారు అంటే.. తమకు లభించిన పీఠాన్ని చూసి గర్వపడనప్పుడు.. తోటి కళాకారుల ప్రతిభను మనస్ఫూర్తిగా గౌరవించినప్పుడే. పరిశ్రమకు సంబంధించిన ఎలాంటి వేడుకలను అయినా విజయవంతం చేయడం.. ఒకరి విజయానికి మరొకరు మద్దతుగా నిలవడం సినీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. కేవలం అవార్డులు వచ్చినప్పుడే కాకుండా.. పరిశ్రమ గౌరవాన్ని పెంచే ప్రతి ప్రభుత్వ అధికారిక వేడుకకు స్టార్లు హాజరైనప్పుడే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. గ్లామర్ తెచ్చే భ్రమలను పక్కన పెట్టి.. వాస్తవంలో ఉంటేనే ఏ నటుడైనా ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకోగలడు.

Tags:    

Similar News