ఆ కసి, కోపమే మృణాల్‌ని 10 ఏళ్లు నడిపించిందట..!

ఇక బాలీవుడ్‌లో ఈమె మూడు నాలుగు సినిమాలు చేస్తోంది. ఆ సినిమాలు వివిధ దశల్లో ఉన్నట్లు ఆమె సన్నిహితులు, మీడియా వర్గాల నుంచి సమాచారం అందుతోంది.;

Update: 2025-11-21 11:30 GMT

మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె భారీ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ముందు వరుసలో ఉంది. హిందీలో ఇంకా సరైన బ్రేక్ దక్కనప్పటికీ ఆమెకు వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇక టాలీవుడ్‌లో మృణాల్‌ ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. ఆమె వద్దకు వారానికి ఒక నిర్మాత వెళ్తూనే ఉన్నాడట. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న మృణాల్‌ ఠాకూర్‌ త్వరలోనే డెకాయిట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే కాకుండా అల్లు అర్జున్‌-అట్లీ కాంబోలో రూపొందుతున్న సినిమాలోనూ మృణాల్‌ ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. ఇక బాలీవుడ్‌లో ఈమె మూడు నాలుగు సినిమాలు చేస్తోంది. ఆ సినిమాలు వివిధ దశల్లో ఉన్నట్లు ఆమె సన్నిహితులు, మీడియా వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా...

ఇప్పుడు బిజీగా ఉన్న మృణాల్‌ ఠాకూర్ కెరీర్‌ ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తీవ్రమైన ఒడిదొడుల మధ్య కెరీర్‌ సాగించింది. 2012లో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చిన మృణాల్‌ ఆ సమయంలో అరకొర పారితోషికంతో చాలా ఇబ్బంది పడింది. అయినా నిరుత్సాహం చెందకుండా మంచి ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే వచ్చిందట. బుల్లి తెరపై వచ్చిన గుర్తింపుతో సినిమా ఇండస్ట్రీలో 2014లో ఎంట్రీ ఇచ్చింది. హలో నందన్‌ అనే చిన్న మరాఠి సినిమాలో నటించడం ద్వారా మృణాల్‌ ఠాకూర్ వెండి తెరకు పరిచయం అయింది. 2014లో మూడు సినిమాలతో వచ్చినా ఏ ఒక్కటి మృణాల్‌కి కమర్షియల్‌ బ్రేక్‌ తెచ్చి పెట్టలేదు. అయినా కూడా హీరోయిన్‌గా తన ప్రయత్నాలు చేయడం మాత్రం మానలేదు. మొత్తానికి మృణాల్‌ ఠాకూర్‌ ఎక్కడ తగ్గకుండా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.

టాలీవుడ్‌, బాలీవుడ్‌లో బిజీ బిజీగా...

సాధారణంగా ఒక హీరోయిన్‌ లేదా మరెవ్వరైనా ఒకటి రెండు ప్రయత్నాలు చేసి, కొన్ని సంవత్సరాల వరకు ప్రయత్నించి వెనక్కి తిరిగి వెళ్లి పోతారు. కానీ మృణాల్‌ ఠాకూర్ మాత్రం వరుస ఫెయిల్యూర్స్ వచ్చినా వెనక్కి తగ్గలేదు. అందుకు చాలా పెద్ద కారణం ఉందని ఇటీవల మృణాల్‌ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో పట్టు వదలని విక్రమార్కుడిగా ప్రయత్నాలు చేయడానికి కారణం కసి, కోపం అంటూ తన అమ్మకు జరిగిన ఒక అవమానంను గుర్తు చేసుకుంది. బంధువుల్లో కొందరు మా ఫ్యామిలీని చాలా చిన్న చూపు చూసేవారు. ముఖ్యంగా ఒక సారి అమ్మ బంధువులు కారు ఎక్కేందుకు ప్రయత్నించిన సమయంలో తిరస్కరణకు గురి అయింది. అప్పుడే నాకు చాలా బాధ అనిపించింది. ఆ సమయంలోనే నేను అమ్మకు సముచిత గౌరవం దక్కే విధంగా చేయాలని నిర్ణయించుకున్నాను, అందుకే ఇండస్ట్రీలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కష్టపడి నిలిచాను అంది.

సీతారామం సినిమాతో మృణాల్‌ స్టార్‌డం..

ఇప్పుడు తన ఫ్యామిలీ మొత్తంలో అత్యంత ఖరీదైన కారు ఉన్నది తనకే అని, అమ్మ ఇప్పుడు ఆ ఖరీదైన కారులో తిరుగుతూ ఉంటే చాలా గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్న ఫీల్‌ కలుగుతుంది అన్నట్లుగా మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్‌ అవుతోంది. మృణాల్‌ తన అమ్మపై ఉన్న ప్రేమతో, ఆమెను ఫ్యామిలీలో గర్వించే విధంగా చేయడం కోసం తాను చాలా కష్టపడింది. దాదాపు పదేళ్ల పాటు హిట్‌ లేకున్నా, ఆఫర్ల కోసం వెతుక్కుని మరీ మృణాల్‌ ఠాకూర్‌ సినిమాలు చేస్తూ వచ్చింది. తెలుగులో ఈమె సీతారామం చేసే వరకు హిందీలో చాలా సినిమాలు చేసినా కనీసం ఇండస్ట్రీ వర్గాల వారు ఈమెను గుర్తించే స్థాయిలో హిట్‌ పడలేదు. దాంతో మృణాల్‌కి కచ్చితంగా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా సీతారామం అంటారు. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ముందు ముందు ఆమెకు మరింత భారీ విజయాలను అందిస్తాయనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News