మృణాల్ ఠాకూర్ కూడా తప్పు చేస్తోందా?
టాలీవుడ్‌లో ఒక హీరోయిన్‌కు క్రేజ్ రావడం ఎంత కష్టమో? దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం.
టాలీవుడ్‌లో ఒక హీరోయిన్‌కు క్రేజ్ రావడం ఎంత కష్టమో? దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. `సీతారామం` సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతగా చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత `హాయ్ నాన్న` వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో స్టార్ హోదా వైపు అడుగులు వేసిన బ్యూటీ ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తెలుగులో వరుసగా వస్తోన్న క్రేజీ ఆఫర్లను మృణాల్ కాదనుకుంటోందనే వార్తలు ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చాలామంది మహానటి కీర్తి సురేష్ కెరీర్ గ్రాఫ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. కీర్తి సురేష్ కూడా ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ పొజిషన్‌లో ఉండి ఆ తర్వాత ఇతర భాషలపై దృష్టి పెట్టడం .. సరైన పాత్రలు ఎంచుకోకపోవడం వల్ల వెనుకబడ్డారన్నది కాదనలేని నిజం. తాజాగా మృణాల్ ఠాకూర్ కూడా అదే తప్పు చేస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేతికి వచ్చిన మంచి ప్రాజెక్టులను వదులుకుంటూ బాలీవుడ్ వైపు.. ఇతర ప్రాజెక్టుల వైపో మొగ్గు చూపడం వల్ల టాలీవుడ్ మేకర్స్ ప్రత్యామ్నాయాల వైపు చూసే అవకాశం లేకపోలేదు అన్నది అంతే వాస్తవం.
మృణాల్ ఠాకూర్ మూలాలు బాలీవుడ్‌లో ఉండటం వల్ల ఆమెకు హిందీ చిత్ర పరిశ్రమపై మక్కువ ఉండటం సహజమే. అయితే అక్కడ సక్సెస్ రేట్ కంటే తెలుగులో ఆమెకున్న సక్సెస్ రేట్ - క్రేజ్ చాలా ఎక్కువ. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఇక్కడ లభిస్తున్నా? ఆమె కొన్ని భారీ చిత్రాల ఆఫర్లను తిరస్కరిస్తుంది. బాలీవుడ్‌లో బిజీ అవ్వాలనే ప్రయత్నంలో ఇక్కడి స్టార్ హీరోల ప్రాజెక్టులను వదులుకోవడం లాంగ్ రన్‌లో ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత లేదు. ప్రతి ఏటా కొత్త ముఖాలు ఇండస్ట్రీలోకి వస్తూనే ఉన్నాయి. శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే వంటి క్రేజీ భామలతో పాటు మరికొందరు ఉత్తరాది సుందరీలు టాలీవుడ్‌పై జెండా పాతేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక వైపు సీనియర్ స్టార్ హీరోలు.. మరోవైపు యంగ్ హీరోలు కొత్త ఆప్షన్ల వైపు మొగ్గు చూపు తున్నారు. ఇలాంటి పోటీ ఉన్న సమయంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే ఆ స్థానాన్ని వేరొకరు భర్తీ చేయడానికి ఎంతో సమయం పట్టదు.
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ మార్కెట్ ప్రతిష్టాత్మకమైనది. ఇక్కడి సినిమాలు పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో టాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం అంటే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే. మృణాల్‌కు ఇక్కడ లభించిన గౌరవం, క్రేజ్ మరే ఇతర భాషలోనూ ఇంత త్వరగా రాలేదనేది వాస్తవం. ఈనేపథ్యంలో ఇక్కడి మార్కెట్‌ను - అభిమానాన్ని లైట్ తీసుకోవడం కెరీర్ పరంగా సరైన వ్యూహం కాకపోవచ్చు.
నటిగా మృణాల్ ఠాకూర్ ప్రతిభపై ఎలాంటి సందేహాలు లేవు. అమ్మడి స్క్రీన్ ప్రెజెన్స్, నటన ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కానీ పరిశ్రమలో ప్రతిభ మాత్రమే సరిపోదు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం అంతే ముఖ్యం. టాలీవుడ్ ఇచ్చిన బ్రేక్‌ను వాడుకుంటూనే ఇక్కడి పెద్ద ప్రాజెక్టులకు సైన్ చేయడం ద్వారా మాత్రమే అమ్మడు స్టార్ స్టేటస్‌ను కాపాడుకోగలదు. మరి ఈ వేడిలో మృణాల్ తన వ్యూహాన్ని మార్చుకుని తెలుగులో బిజీ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.