మృణాల్ గెలుస్తుంటే.. జాన్వీ ఎందుకు ట్రోల్ అవుతోంది?

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్‌లను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది.

Update: 2026-06-11 02:30 GMT

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్‌లను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ నటీమణులు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కెరీర్‌లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

ఒకవైపు మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల నుంచి నటిగా ప్రశంసలు అందుకుంటూ కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ముందుకు వెళ్తుంటే, బాలీవుడ్‌లో మాత్రం కమర్షియల్, గ్లామర్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీతారామం, హాయ్ నాన్న, డెకాయిట్ వంటి సినిమాల్లో ఆమెకు యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలు దక్కగా, హిందీలో ఇటీవల చేసిన కొన్ని సినిమాలు మాత్రం మాస్ కమర్షియల్ ఫార్మాట్‌కే పరిమితమయ్యాయని అంటున్నారు.

మరోవైపు జాన్వీ కపూర్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. బాలీవుడ్‌లో గుంజన్ సక్సేనా, మిలీ, మిస్టర్ అండ్ మిసెస్ మహి వంటి సినిమాల‌తో నటిగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న జాన్వీ, తెలుగు సినిమాల్లో మాత్రం ఇప్పటివరకు గ్లామర్ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌కే పరిమితమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవర తర్వాత పెద్దిలో కూడా ఆమె పాత్రలో న‌ట‌న‌ కంటే గ్లామర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల పెద్ది రిలీజ్ తర్వాత ఆమె పాత్రపై వచ్చిన డిస్క‌ష‌న్స్, మహిళా పాత్రల ప్రదర్శనపై తలెత్తిన వివాదాలు ఈ అంశాన్ని మరింత హైలైట్ చేశాయి. పలువురు సినీ అభిమానులు జాన్వీకి కేవలం స్టార్ ఇమేజ్ ఆధారంగా కాకుండా ఎమోష‌న్స్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మృణాల్‌కు టాలీవుడ్‌లో పెర్ఫార్మెన్స్ రోల్స్, బాలీవుడ్‌లో గ్లామర్ రోల్స్ వస్తున్నాయి, జాన్వీకి మాత్రం బాలీవుడ్‌లో బెటర్ రోల్స్, టాలీవుడ్‌లో గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయ‌నే కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న ఈ టైమ్ లో కేవలం అందం, పాటలు, గ్లామర్ మాత్రమే సరిపోవని, బలమైన పాత్రలే హీరోయిన్ల కెరీర్‌ను నిలబెడతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మృణాల్, జాన్వీ ఇద్దరిలోనూ నటనకు కావాల్సిన సామర్థ్యం ఉందని, అయితే ఆయా ఇండస్ట్రీలు వారిని ఎలా వినియోగిస్తున్నాయన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. భవిష్యత్తులో ఈ ఇద్దరు హీరోయిన్లు తమకు వచ్చిన ఇమేజ్‌ను దాటి మరింత బలమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News