బడా సినిమా అంటే భారీ కథేనా?

ఒకప్పుడు సినిమా పెద్దదా.. చిన్నదా అనేది బడ్జెట్‌ ను బట్టి అంచనా వేసేవారు. స్టార్ హీరో, భారీ సెట్స్, వందల కోట్ల ఖర్చు, గ్రాండ్ విజువల్స్ ఉంటే అది బిగ్ మూవీ అనుకునేవారు.

Update: 2026-09-08 12:30 GMT

ఒకప్పుడు సినిమా పెద్దదా.. చిన్నదా అనేది బడ్జెట్‌ ను బట్టి అంచనా వేసేవారు. స్టార్ హీరో, భారీ సెట్స్, వందల కోట్ల ఖర్చు, గ్రాండ్ విజువల్స్ ఉంటే అది బిగ్ మూవీ అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. బడ్జెట్ ఎంత పెట్టారన్నదే కాదు.. ఆ సినిమాకు ఎంత స్ట్రాంగ్ బ్రాండ్ ఉందనేదే అసలు ప్రశ్నగా మారుతోంది. సినీ ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్టులు పెరుగుతున్న కొద్దీ ప్రేక్షకుల అంచనాలు కూడా అదే రేంజ్ లో పెరుగుతున్నాయి.

హై బడ్జెట్‌ తో సినిమా తీస్తే.. దానికి తగ్గ కంటెంట్ ఉండాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. కేవలం ఖర్చు పెట్టిన విధానం, భారీ యాక్షన్ సీన్లు, గ్రాండ్ సెట్స్‌ తో ప్రేక్షకులను ఎక్కువ రోజులు థియేటర్లలో నిలబెట్టడం ఇప్పుడు అంత ఈజీ కాదు. స్టార్ హీరో ఒక సినిమాకు భారీ ఓపెనింగ్స్ తీసుకురాగలడు. కానీ సినిమా ఎక్కువ కాలం ఆడాలంటే హీరో ఇమేజ్ ఒక్కటే సరిపోదు.

స్టోరీ, రోల్స్, డైరెక్టర్ టేకింగ్, మ్యూజిక్, విజువల్స్.. ఇలా ప్రతీ ఎలిమెంట్ కలిసి సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలి. అందుకే ఇప్పుడు హీరోతో పాటు దర్శకుడి బ్రాండ్ కూడా కీలకంగా మారుతోంది. ఒక దర్శకుడు గతంలో విభిన్నమైన సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంటే.. అతడి నెక్స్ట్ సినిమాపై కూడా రిలీజ్ కు ముందే హైప్ క్రియేట్ అవుతుంది.

ఇక మరో మెయిన్ ఛేంజ్ ఫ్రాంచైజీల విషయంలో కనిపిస్తోంది. ఒక సినిమా సక్సెస్ సాధించిన తర్వాత దాని స్టోరీ వరల్డ్ ను కంటిన్యూ చేస్తూ మరిన్ని సినిమాలు తీసే ట్రెండ్ పెరుగుతోంది. ఇక్కడ సినిమా బ్రాండ్ హీరోను మించి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ప్రేక్షకుల్లో ఆ స్టోరీ వరల్డ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడితే.. తర్వాత వచ్చే సినిమాపై కూడా అంచనాలు పెరుగుతాయి. దీంతో నిర్మాతలకు కూడా కొత్త బిజినెస్ ఛాన్సులు వస్తాయి.

అయితే భారీ బడ్జెట్ పెట్టడం అంటే భారీ రిస్క్ తీసుకోవడమే. ఇన్వెస్ట్మెంట్ పెరిగిన కొద్దీ సినిమా విజయానికి అవసరమైన వసూళ్లు కూడా పెరుగుతాయి. అందుకే నిర్మాతలు ఇప్పుడు సినిమాకు ఎంత ఖర్చు చేయాలి? ఆ పెట్టుబడికి తగ్గ మార్కెట్ ఉందా? అనే లెక్కలు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో తక్కువ బడ్జెట్‌ లో స్ట్రాంగ్ స్టోరీతో వచ్చే సినిమాలు కూడా భారీ విజయాలు సాధిస్తున్నాయి. దీనివల్ల బడ్జెట్ ఎక్కువైతేనే సినిమా పెద్దదనే పాత లెక్కకు సవాలు ఎదురవుతోంది.

సినిమా ఎంత ఖర్చుతో తెరకెక్కిందో ప్రేక్షకుడు కొంతకాలానికే మర్చిపోవచ్చు. కానీ మూవీలోని రోల్, స్టోరీ, సీన్స్ మాత్రం గుర్తుండిపోతాయి. అందుకే ఫ్యూచర్ లో సినిమాల విషయంలో బడ్జెట్ కంటే గుర్తింపు, స్టార్‌ డమ్ కంటే బ్రాండ్ వాల్యూ మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. చివరగా పెద్ద చిత్రం అంటే వందల కోట్లు ఖర్చు చేసిన సినిమా మాత్రమే కాదు. ప్రేక్షకుడి మనసులో మంచి స్థానం సంపాదించిన మూవీనే అసలైన బిగ్ మూవీ!

Tags:    

Similar News