'మౌళికి కోటి ఇచ్చారా?'.. మైత్రీ నిర్మాతలు ఏమన్నారంటే..
అలాంటిది ఒక్క సినిమా హిట్‌తోనే అతని రెమ్యునరేషన్ పదింతలు పెరిగి, ఏకంగా కోటి రూపాయలకు చేరిందనే వార్త ట్రేడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.;
ఒక్క శుక్రవారం చాలు.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోవడానికి. టాలీవుడ్‌లో ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఈ ఏడాది అలాంటి అదృష్టం అందుకున్న యంగ్ హీరో మౌళి తనుజ్. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన 'లిటిల్ హార్ట్స్' ఊహించని బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో, హీరోగా మౌళి పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.
ఈ సినిమా విజయం తర్వాత, అతనిపై అగ్ర నిర్మాణ సంస్థల దృష్టి పడిందని, ముఖ్యంగా బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఏకంగా కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసిందంటూ వార్తలు షికార్లు చేశాయి. ఇది చూసి అందరూ రెండో సినిమాకే ఈ రేంజ్ రెమ్యునరేషనా అని ఆశ్చర్యపోయారు.
'లిటిల్ హార్ట్స్' చిత్రానికి మౌళి కేవలం రూ. 5 నుంచి 10 లక్షల మధ్య పారితోషికం తీసుకుని ఉంటాడని అంచనా.
అలాంటిది ఒక్క సినిమా హిట్‌తోనే అతని రెమ్యునరేషన్ పదింతలు పెరిగి, ఏకంగా కోటి రూపాయలకు చేరిందనే వార్త ట్రేడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. మైత్రీ లాంటి పెద్ద బ్యానర్‌లో అవకాశం దక్కించుకోవడం, దానికి తోడు ఇంత భారీ మొత్తం అడ్వాన్సుగా అందుకోవడం నిజంగా మౌళి దశ తిరిగిపోయినట్లేనని అందరూ భావించారు. సోషల్ మీడియాలోనూ ఈ వార్త గట్టిగానే వైరల్ అయింది. అయితే, ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ తేల్చి చెప్పారు.
తమ కొత్త చిత్రం 'డ్యూడ్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఈ రూమర్‌పై వారు స్పందించారు. "మేము 'లిటిల్ హార్ట్స్' సినిమా చూశాం. చాలా బాగుంది, చాలా బాగా తీశారు. అయితే, హీరో మౌళికి కోటి రూపాయలు ఇచ్చామనే వార్తలో ఏమాత్రం నిజం లేదు, అది ఫేక్ న్యూస్" అని వారు కుండబద్దలు కొట్టారు. దీంతో ఈ సంచలన వార్తకు అధికారికంగా తెరపడినట్లయింది.
అయితే, వారు మౌళిని పూర్తిగా పక్కన పెట్టలేదని కూడా స్పష్టం చేశారు. "మేము హీరో మౌళితో పాటు, దర్శకుడికి కూడా అడ్వాన్స్ ఇచ్చాం. కానీ కోటి రూపాయలు అనేది అవాస్తవం. ప్రస్తుతం ఆ దర్శకుడు వేరొకరితో సినిమా చేస్తున్నారు కదా. భవిష్యత్తులో అన్నీ కుదిరినప్పుడు, మంచి కథ కుదిరినప్పుడు కచ్చితంగా వారితో సినిమా చేస్తాం" అని తెలిపారు. దీన్నిబట్టి, మైత్రీ సంస్థకు మౌళిపై ఆసక్తి ఉన్న మాట వాస్తవమే అయినా, కోటి రూపాయల రెమ్యునరేషన్ వార్త మాత్రం కేవలం ఒక ప్రచారమేనని తేలిపోయింది.