లాల్ సార్ రూటు మారుతోందా?
మోహన్‌లాల్ ఒకేసారి ఏడుగురు దర్శకులతో సినిమాలు ప్రకటించాడు. ప్రియదర్శన్, జీతూ జోసెఫ్, సత్యన్ అంతికాడ్, దిలీష్ పోతన్, జూడ్ ఆంథనీ జోసెఫ్, విష్ణు మోహన్, అనూప్ సత్యన్ పేర్లు ఆ లిస్టులో ఉన్నాయి.
మోహన్‌లాల్ ఒకేసారి ఏడుగురు దర్శకులతో సినిమాలు ప్రకటించాడు. ప్రియదర్శన్, జీతూ జోసెఫ్, సత్యన్ అంతికాడ్, దిలీష్ పోతన్, జూడ్ ఆంథనీ జోసెఫ్, విష్ణు మోహన్, అనూప్ సత్యన్ పేర్లు ఆ లిస్టులో ఉన్నాయి. ఏడు సినిమాలు అనేది పెద్ద నంబరే. కానీ ఆ దర్శకుల పేర్లు చూస్తే మోహన్‌లాల్ నెక్స్ట్ ఫేజ్ మొత్తం భారీ యాక్షన్, పాన్ ఇండియా సినిమాలతోనే ఉండబోవడం లేదని తెలుస్తోంది.
ఈ మధ్య మోహన్‌లాల్ కూడా పెద్ద స్కేల్ సినిమాలు బాగానే చేశాడు. ‘ఎంపురాన్’ లాంటి సినిమా కోసం మలయాళ మార్కెట్‌కు మించి వెళ్లారు. భారీ బడ్జెట్, పెద్ద క్యాస్టింగ్, ఇతర భాషల్లో రిలీజ్.. అన్నీ ఉన్నాయి. అదే టైమ్‌లో ‘తుడరుమ్’లో మాత్రం మళ్లీ నార్మల్ పాత్రలో కనిపించాడు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది. మోహన్‌లాల్‌కు రెండు రూట్లు ఇంకా వర్కవుట్ అవుతున్నాయనడానికి ఇదే మంచి ఉదాహరణ.
కొత్త లైనప్‌లో ప్రియదర్శన్, సత్యన్ అంతికాడ్ పేర్లు ఉండటం ఆశ్చర్యం కాదు. ఇద్దరితో మోహన్‌లాల్ ఎన్నో సినిమాలు చేశాడు. జీతూ జోసెఫ్‌తో ‘దృశ్యం’ తర్వాత ఆ కాంబినేషన్‌కే ఒక ప్రత్యేకమైన క్రేజ్ వచ్చింది. అంటే తనకు బాగా తెలిసిన దర్శకులతో సినిమాలు కొనసాగిస్తూనే మరోవైపు కొత్త కాంబినేషన్స్ కూడా రెడీ చేసుకున్నాడు.
అందులో దిలీష్ పోతన్ పేరు మాత్రం హైలెట్ అవుతోంది. ఆయన సినిమాల్లో హీరో ఎలివేషన్స్ కంటే పాత్రలు, వాటి మధ్య జరిగే చిన్న చిన్న విషయాలే ఎక్కువగా కనిపిస్తాయి. జూడ్ ఆంథనీ కూడా ఎమోషన్ ఉన్న కథలతో పేరు తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరి సినిమాల్లో మోహన్‌లాల్ ఎలా కనిపిస్తాడన్న ఆసక్తి సహజంగానే ఉంటుంది. విష్ణు మోహన్, అనూప్ సత్యన్‌తో కూడా ఆయనకు ఇవే మొదటి సినిమాలు.
మోహన్‌లాల్ ఇప్పుడు ప్రతి సినిమాను ‘ఎంపురాన్’ కంటే పెద్దగా చేయాల్సిన అవసరం కూడా లేదు. ‘తుడరుమ్’ లాంటి సినిమా వర్కవుట్ అయ్యాక ఆ విషయం మరింత క్లియర్ అయింది. స్టార్‌ను ఎంత గ్రాండ్‌గా చూపించామన్నదే కాకుండా, సరైన పాత్ర దొరికితే సింపుల్ సినిమాతో కూడా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురాగలడు. అందుకే ఈ ఏడు సినిమాల లిస్టులో నంబర్ కంటే వెరైటీ బాగుంది. వీటిలో ఏది భారీ సినిమా అవుతుంది, ఏది పూర్తిగా పాత్ర మీద నడుస్తుంది అనేది ఇంకా తెలియదు. కానీ మోహన్‌లాల్ మాత్రం ఒకే రూట్ పట్టకుండా రెండింటినీ కలిపేలా లైనప్ పెట్టుకున్నాడు.