సీనియర్ స్టార్ పాన్ ఇండియా ప్రయత్నం ప్రతీసారి ఫెయిల్!
`బాహుబలి` విజయం పాన్ ఇండియా సినిమాలకు దిశానిర్దేశం చేసింది. `బాహుబలి` స్పూర్తితో ఎన్నో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కాయి.;
`బాహుబలి` విజయం పాన్ ఇండియా సినిమాలకు దిశానిర్దేశం చేసింది. `బాహుబలి` స్పూర్తితో ఎన్నో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కాయి. తెలుగు సినిమాకు భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు దక్కిందంటే కారణం `బాహుబలే`. ఆ సినిమా అనంతరమే చాలా మంది స్టార్ హీరోల్లో పాన్ ఇండియా సినిమాలు చేయాలన్న ఆసక్తి మొదలైంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, నిఖిల్, తేజ సజ్జా, రిషబ్ శెట్టి, లాంటి వారు పాన్ ఇండియా లో సక్సస్ అయ్యారంటే? పరోక్ష కారణంగా బాహుబలి నిలిచింది. సరిగ్గా ఇదే కసితో మాలీవుడ్ నుంచి కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ కూడా పాన్ ఇండియా బరిలోకి దిగారు.
100 కోట్ల బడ్జెట్ తో `మరాక్కర్: లయన్ ఆఫ్ ది ఆరేబియన్ సీ` అనే హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో నటించారు. మాలీవుడ్ దర్శక సంచలనం ప్రియదర్శన్ తెరకెక్కించిన చిత్రమిది. నాలుగేళ్ల క్రితం పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఈ సినిమా మాత్రం అంచనాలు అందుకోలేదు. మళ్లీ మూడేళ్ల తర్వాత మోహన్ లాల్ `మలైకోటి వాలిబన్` అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటించారు. 65 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ కాన్వాస్ పై తెరకెక్కిన ఈ సినిమా కూడా పాన్ ఇండియాలో అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.
అయినా మోహన్ లాల్ వెనక్కి తగ్గలేదు. ఈసారి ఎలాంటి గ్యాప్ తీసుకోకుండానే `బరోజ్` అనే ఫ్యాంటసీ చిత్రాన్ని ఏకంగా 3డీలోనే రిలీజ్ చేసారు. ఈ సినిమా బడ్జెట్ పై రెండు చిత్రాలను మించి ఖర్చు చేసారు. దాదాపు 170 కోట్ల వరకూ ఖర్చు చేసారు. డైరెక్టర్ గా తానే కెప్టెన్ కుర్చీ ఎక్కి చేసిన చిత్రమిది. కానీ ఈ చిత్రం కూడా అంచనాలు అందుకోలేకపోయింది. అయినా లాల్ మాత్రం పట్టు విడవలేదు. ఇటీవలే ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా నటించిన `వృషభ` రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని మాలయాళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కించారు.
70 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కానీ రిలీజ్ అనంతరం ఈ సినిమా కూడా ప్రేక్షకులకు రుచించలేదు. మోహన్ లాల్ కెరీర్ లోనే దారుణమైన డిజాస్టర్ గా నమోదైంది. అలా మోహన్ లాల్ పాన్ ఇండియా ప్రయత్నాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి. మరి ఈ నాలుగు వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని లాల్ వెనక్కి తగ్గుతారా? అదే దూకుడు కొనసాగిస్తారా? అన్నది చూడాలి. ప్రస్తుతం `దృశ్యం3` లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రమిది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే `పేట్రియేట్` అనే మరో చిత్రలోనూ నటిస్తున్నారు. ఇది షూటింగ్ దశలో ఉంది. మరో చిత్రం `రామ్` మాత్రం షూటింగ్ డిలే అవుతోంది.