మీరు విలన్ అయితే ఫస్ట్ సీన్ లోనే చంపేస్తా
ఈ సినిమా కోసం విష్ణు ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డానని, ఈ కథపై చాలా కాలంగా తాను వర్క్ చేస్తున్నానని ఇప్పటికే పలుమార్లు చెప్పాడు.;
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన సినిమా కన్నప్ప. ఈ సినిమా కోసం విష్ణు ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డానని, ఈ కథపై చాలా కాలంగా తాను వర్క్ చేస్తున్నానని ఇప్పటికే పలుమార్లు చెప్పాడు. విష్ణు కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్ బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటంతో పాటూ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అంతేకాదు, కన్నప్పలో పలు పాన్ ఇండియన్ స్టార్లు నటిస్తున్నారు. అందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ కూడా ఉన్నారు. ఇంతటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న కన్నప్ప మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగానే కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కేరళలోని కొచ్చిలో గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు విష్ణుతో పాటూ మోహన్ బాబు, మిగిలిన చిత్ర యూనిట్ కూడా హాజరైంది. ఈ కార్యక్రమానికి మలయాళ స్టార్ మోహన్ లాల్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈవెంట్ లో భాగంగా మోహన్ లాల్ మాట్లాడుతూ మోహన్ బాబును తెగ పొగిడేశారు. ఇప్పటివరకు తాను చూసిన స్వీటెస్ట్ పర్సన్స్ లో మోహన్ బాబు సర్ కూడా ఒకరని, సుమారు 600 సినిమాలు చేశారని మోహన్ లాల్ అన్నారు.
ఆ తర్వాత మీరు నటించే సినిమాలో విలన్ గా చేయాలని ఉందని మోహన్ బాబు, మోహన్ లాల్ తో అనగా, మీరు హీరో, నేను విలన్ గా చేస్తా, ఆ ఛాన్స్ నాకు ఇవ్వండి అని మోహన్ లాల్ రిక్వెస్ట్ చేశారు. దానికి మీరు అలా అనొద్దు. మీ సినిమాలో విలన్ గానే చేయాలనుకుంటున్నా, దయచేసి ఛాన్స్ ఇవ్వమని మోహన్ బాబు అనగానే విలన్ గానే ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఆంటోనీ ఇది సాధ్యమవుతుందా అని మోహన్ లాల్ కింద ఉన్న డైరెక్టర్ ను అడగ్గానే ఆయన ఓకే అన్నారు.
ఆంటోనీ అలా అన్న వెంటనే మోహన్ లాల్, మీరు విలన్ గా చేస్తే ఫస్ట్ సీన్ లోనే మిమ్మల్ని కాల్చి చంపేస్తా అని మోహన్ బాబు తో చెప్పారు. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూశాయి. అయితే ఈ కామెంట్స్ ను మోహన్‌లాల్ మలయాళంలో చేయడం వల్ల మోహన్ బాబు కు అర్థం కాకపోవడంతో తర్వాత విష్ణు దాన్ని తెలుగులోకి మార్చి మోహన్ బాబు కు చెప్పగా, వద్దు వద్దు అలా చేయొద్దని మోహన్ బాబు అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతుంది.