17 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్లు కలిశారు
ఒక ఫిలిం ఇండస్ట్రీలో నంబర్ వన్ స్థానం కోసం పోటీ పడే ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య స్నేహం ఉండడం.. సినిమాల పరంగానే కాక వ్యక్తిగతంగానూ ఇద్దరూ ఏమాత్రం ఇగో లేకుండా కలిసి మెలిసి సాగడం అరుదైన విషయం;
ఒక ఫిలిం ఇండస్ట్రీలో నంబర్ వన్ స్థానం కోసం పోటీ పడే ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య స్నేహం ఉండడం.. సినిమాల పరంగానే కాక వ్యక్తిగతంగానూ ఇద్దరూ ఏమాత్రం ఇగో లేకుండా కలిసి మెలిసి సాగడం అరుదైన విషయం. మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి మధ్య ఇలాంటి స్నేహమే ఉంది. ఈ ఇద్దరూ స్టార్ స్టేటస్ సంపాదించాక.. మలయాళంలో వాళ్లను మించిన స్టార్ మరొకరు రాలేదు. ఇద్దరూ ఎవరి స్థాయిలో వాళ్లు భారీ విజయాలు అందుకుంటూనే.. కలిసి సినిమాలు చేశారు. వ్యక్తిగతంగానూ ఎంతో సన్నిహితంగా మెలిగారు. ఇద్దరూ కలిసి దాదాపు 40 సినిమాలు చేయడం విశేషం. ఐతే చివరగా 2008లో ‘ట్వంటీ ట్వంటీ’ తర్వాత ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఐతే ఎట్టకేలకు మళ్లీ ఈ జోడీని స్క్రీన్ మీద చూడబోతున్నారు అభిమానులు. ఈ ఇద్దరి కలయికలో ‘పేట్రియాట్’ అనే సినిమా తెరకెక్కుతోంది. దీని టీజర్ తాజాగా లాంచ్ అయింది.
దేశం కోసం పోరాడే ఇద్దరు సైనిక అధికారుల పాత్రల్లో మోహన్ లాల్, మమ్ముట్టి కనిపించనున్నారు ‘పేట్రియాట్’ సినిమాలో. ఇందులో ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర చేస్తుండడం విశేషం. నయనతార, కుంచుకోబోబన్, రేవతి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేశభక్తితో ముడిపడ్డ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘వాళ్లిద్దరూ కలిస్తే ఏమవుతుందో తెలుసా.. బ్లాస్ట్’ అంటూ చివర్లో వచ్చే డైలాగ్ మోహన్ లాల్, మమ్ముట్టి కలయికకు హైప్ తీసుకొచ్చేదే. ఈ చిత్రాన్ని ఫాహద్‌తో ‘మాలిక్’ సినిమా తీసిన మహేష్ నారాయణన్ రూపొందించాడు. ఒకప్పుడు ఎడిటర్ అయిన మహేష్ నారాయణన్.. దర్శకుడిగానూ గొప్ప పేరు సంపాదించాడు. చాలా ఏళ్ల తర్వాత మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటిస్తుండడం.. ఇతర కాస్టింగ్ కూడా గొప్పగా ఉండడంతో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.