రెస్ట్ తీసుకోవ‌డం అస‌లు న‌చ్చ‌దు

రీసెంట్ గా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని కెరీర్ గురించి, వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి ముచ్చ‌టించారు.;

Update: 2025-04-27 05:45 GMT

ఆరు ప‌దుల వయ‌సులో కూడా మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్‌లాల్ యంగ్ హీరోల‌కు పోటీగా సినిమాలు చేస్తూ మ‌ల‌యాళ ఆడియ‌న్స్ తో పాటూ తెలుగు ప్రేక్ష‌కుల్ని కూడా మెప్పిస్తూ అల‌రిస్తున్నారు. రీసెంట్ గా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని కెరీర్ గురించి, వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి ముచ్చ‌టించారు. త‌న కెరీర్లో సినిమాను ప్రేమించినంత దేన్నీ ప్రేమించ‌లేద‌ని, ఓ మూవీ పూర్తి కాకముందే నాలుగైదు సినిమాల‌ను లైన్ లో పెట్టుకుంటాన‌ని, అదంతా చూసి ఇంట్లో వాళ్లు అంత రిస్క్ అవ‌స‌ర‌మా అంటుంటార‌ని, కానీ త‌న‌కు ఖాళీగా ఉంటూ రెస్ట్ తీసుకోవ‌డం అస‌లు న‌చ్చ‌ద‌ని ఆయ‌న చెప్పారు.

మ‌మ్ముట్టి త‌న బెస్ట్ ఫ్రెండ్ అని, ఇప్ప‌టికే తామిద్దరం క‌లిసి 50 సినిమాల్లో న‌టించామ‌ని, ఇంకా ఎక్కువ సినిమాల్లో క‌లిసి వ‌ర్క్ చేయాల‌ని ఉంద‌ని, త‌న‌తో రోజులో క‌నీసం ఒక్కసారైనా మాట్లాడుతుంటా అని లేక‌పోతే ఏమీ పాలుపోద‌ని తెలిపారు మోహ‌న్‌లాల్. తాను అయ్య‌ప్ప స్వామి భ‌క్తుడిన‌ని చెప్తున్న ఆయ‌న‌, అప్పుడ‌ప్పుడూ మాల వేసుకుని కాలి న‌డ‌క‌న స్వామి ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఇరుముడి స‌మ‌ర్పించి వ‌స్తుంటాన‌ని, పూజ‌ల వ‌ల్ల మ‌న‌కు పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంద‌ని న‌మ్ముతాన‌ని మోహ‌న్ లాల్ అన్నారు.

చిన్న‌త‌నం నుంచే ఆర్మీ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పిన తాను ఆర్మీకి వెళ్ల‌క‌పోయినా ఆ నేప‌థ్యంలో కురు క్షేత్ర‌, కీర్తి చ‌క్ర సినిమాలు తీసి యూత్ ను ఇన్‌స్పైర్ చేసినందుకు ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ త‌న‌కు టెరిటోరియ‌ల్ ఆర్మీలో లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ హోదాను ప్ర‌క‌టించి గుర్తించింద‌ని, ఆ టైమ్ లో ఎంతో గ‌ర్వంగా అనిపించింద‌ని, దాని వ‌ల్లే విప‌త్తుల వేళ సైనికుల‌తో క‌లిసి స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన‌గ‌లుగుతున్నాన‌న్నారు.

షూటింగ్ లేకుండా ఇంట్లోనే ఉంటే ర‌క‌ర‌కాల వెరైటీలు తింటాన‌ని, తెలుగు రాష్ట్రాల‌కు వచ్చిన‌ప్పుడు నెల్లూరు చేప‌ల పులుసు తింటాన‌ని చెప్పిన ఆయ‌న‌, తిన‌డంతో పాటూ వంట కూడా బాగా చేస్తాన‌ని, కోకోన‌ట్ చికెన్ రోస్ట్, పండుగ‌ప్ప ఫ్రై చాలా బాగా చేస్తాన‌ని చెప్పారు. మార్కెట్ లోకి వ‌చ్చే ఖ‌రీదైన కార్లు కొని వాటిని న‌డ‌ప‌డానికి ఎంతో ఇష్ట‌ప‌డుతుంటాన‌ని చెప్తున్న మోహ‌న్‌లాల్ షూటింగ్ త్వ‌ర‌గా అయిపోయి ఇంటికి వెళ్తే గ్యారేజీలోనే ఉంటాన‌ని చెప్పారు.

త‌న కుటుంబం గురించి చెప్తూ త‌న‌కొక కూతుర‌ని, ఈ మ‌ధ్యే విస్మ‌యి రాసిన బుక్ మార్కెట్ లోకి రిలీజైంద‌ని, ప‌లువురు ప్ర‌ముఖులు ఆ బుక్ గురించి విస్మ‌యిని పొగుడుతుంటే ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. త‌న కొడుకు ప్ర‌ణ‌వ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి త‌ర్వాత హీరో అయ్యాడ‌ని, అయితే ప్ర‌ణ‌వ్ ఎప్పుడూ ఒకేప‌ని చేయ‌డ‌ని, వ‌ర్క్ అవే అంటూ ఎప్పుడూ ప్ర‌పంచాన్ని చుట్టే ప‌నిలో ఉంటాడ‌ని, ప్ర‌స్తుతం స్పెయిన్ లోని ఓ ఫామ్ లో గొర్రెలూ, గుర్రాలూ కాస్తున్నాడ‌ని, ప్ర‌ణ‌వ్ లైఫ్ ను కొత్త‌గా ఎంజాయ్ చేస్తుంటే ఎంతో ముచ్చ‌టేస్తుంద‌న్నారు.

ఇక తెలుగు హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ, వాళ్లంటే త‌న‌కెంతో అభిమాన‌మ‌ని, ఎన్టీఆర్ అంటే న‌టుడిగానే కాకుండా సీఎంగా కూడా ఎంతో గౌర‌వమ‌ని, ఏఎన్నార్ తో క‌లిసి గాండీవంలో న‌టించ‌డాన్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేన‌ని అన్నారు. కొన్నాళ్ల కింద‌ట ఓ సినిమా షూటింగ్ కోసం గుజ‌రాత్ వెళ్తే అక్క‌డ పొలాల్లో ప‌ని చేసే వాళ్లు త‌న‌ను గుర్తుపట్టి వ‌చ్చి, త‌న దృశ్యం సినిమా అంటే ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పార‌ని, ఇంత మారుమూల ప్రాంతంలో కూడా నా సినిమాలు చూసేవాళ్లున్నారా అని ఆశ్చ‌ర్య‌పోయాన‌ని మోహ‌న్ లాల్ తెలిపారు.

Tags:    

Similar News