వీరమల్లు భారాన్ని ఆయనపై వేశారా?
వీరమల్లు నుంచి ఇప్పటివరకు వచ్చిన పాటలేవీ ఆశించిన స్థాయిలో లేవు. దీంతో అందరూ తమ ఆశలన్నింటినీ కీరవాణి బీజీఎంపైనే పెట్టుకున్నారు.;
సినిమా స్థాయిని పెంచడానికి మ్యూజిక్ చాలా అవసరం. ఈ మాటను సినిమాను తెరకెక్కించిన దర్శకులే ఎన్నోసార్లు పలు సందర్భాల్లో చెప్పారు. యావరేజ్ గా ఉన్న సినిమాను మంచి మ్యూజిక్ హిట్, సూపర్ హిట్ గా నిలుపగలదు. అదే మ్యూజిక్ గొప్ప స్థాయిలో లేనప్పుడు హిట్ సినిమా కూడా యావరేజ్ గా మిగిలిన సందర్భాలెన్నో చూశాం.
ఇంకా చెప్పాలంటే కేవలం మ్యూజిక్ తో ఆడిన సినిమాలు కూడా టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ గురించి ఆయన రీరికార్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు మ్యూజిక్ ను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది. అలాంటి కీరవాణి మొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి హరి హర వీరమల్లు సినిమా చేశారు.
ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తుండగా ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 23వ తేదీ రాత్రి నుంచి పెయిడ్ ప్రీమియర్లు కూడా ప్లాన్ చేశారు. అయితే కెరీర్లోనే మొదటిసారి పవన్, కీరవాణి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో మ్యూజిక్ విషయంలో వీరమల్లుపై అందరికీ భారీ అంచనాలున్నాయి. కానీ ఆ అంచనాలను కీరవాణి మ్యూజిక్ అందుకోలేకపోయింది.
వీరమల్లు నుంచి ఇప్పటివరకు వచ్చిన పాటలేవీ ఆశించిన స్థాయిలో లేవు. దీంతో అందరూ తమ ఆశలన్నింటినీ కీరవాణి బీజీఎంపైనే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా జరిగిన వీరమల్లు ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ జ్యోతికృష్ణ నుంచి హీరో పవన్ కళ్యాణ్, నిర్మాత రత్నం వరకూ అందరూ కీరవాణిని, ఆయన వీరమల్లు కోసం చేసిన వర్క్ ను తెగ పొగిడారు. వీరమల్లును కీరవాణి తన భుజాలపై మోసారని ప్రశంసించారు.
సినిమాకు సంబంధించిన వారంతా కీరవాణిని ఆ రేంజ్ లో ఎలివేట్ చేయడంతో అందరికీ వీరమల్లు బీజీఎంపై అంచనాలు పెరిగాయి. పీరియాడిక్ సినిమాలను, హిస్టారికల్ సినిమాలను కీరవాణి తన బీజీఎంతో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లగలరు. డైరెక్టర్, పవన్ మాటల్ని బట్టి చూస్తుంటే వీరమల్లుకు కూడా కీరవాణి అలాంటి మ్యాజిక్కే చేసినట్టే కనిపిస్తున్నారు. పవన్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో వీరమల్లుపై చాలానే అంచనాలున్నాయి. ఆ అంచనాలను తట్టుకుని కీరవాణి సినిమాను నిలబెట్టాలంటే చాలా బరువే మోయాల్సి ఉంటుంది. మరి ఆ బరువును కీరవాణి మోస్తారా లేదా అనేది రెండ్రోజుల్లో తేలనుంది.