కంటెంట్ నచ్చితే చాలు జనం హీరోల ముఖాలు చూడనే చూడరు.. ఇదే ప్రూఫ్!
అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యంత ప్రజాదరణ పొందిన హిందీ వెబ్ సిరీస్ `మీర్జాపూర్` ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యంత ప్రజాదరణ పొందిన హిందీ వెబ్ సిరీస్ `మీర్జాపూర్` ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది. `మీర్జాపూర్: ది మూవీ` అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల కానుంది. వెబ్ సిరీస్‌గా మెప్పించి థియేట్రికల్ గా విడుదలవుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో- సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఓటీటీ సిరీస్‌గా వచ్చిన ఒక సిరీస్ థియేటర్లలోకి సినిమాగా వస్తుండటంతో దీని మొదటి రోజు కలెక్షన్లపై రకరకాల అంచనాలు ఉన్నాయి. విశ్లేషకుల ప్రకారం ఈ సినిమా మొదటి రోజు రూ. 14 కోట్ల నుండి రూ. 20 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా హిందీ అగ్ర కథానాయకుల సినిమాలకు కూడా సరైన హైప్ లేకపోతే ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం కష్టం. అలాంటిది ఒక సిరీస్ మూవీకి రూ. 15 కోట్లకు పైగా ఓపెనింగ్ అంచనా వేయడం నిజంగానే పెద్ద సాహసంతో కూడుకున్న విషయం.
పాశ్చాత్య దేశాలలో విపరీతమైన క్రేజ్ ఉన్న టీవీ-ఓటీటీ సిరీస్‌లను సినిమాలా మార్చి థియేటర్లలో విడుదల చేయడం కొత్తేమీ కాదు. కానీ భారతీయ చిత్ర పరిశ్రమలో `ఖిచ్డీ` వంటి కొన్ని కామెడీ షోలను మినహాయిస్తే.. ఇంతటి ఊరమాస్ - యాక్షన్ సిరీస్‌ను థియేటర్లకు తీసుకురావడం ఇదే మొదటిసారి. `మీర్జాపూర్` చివరి సీజన్‌పై విమర్శకుల నుండి భిన్నాభిప్రాయాలు వచ్చినా.., ఓటీటీలో దానికి వచ్చిన వ్యూయర్‌షిప్ రికార్డులు మాత్రం చెక్కుచెదరలేదు. యువతలో ఈ సిరీస్ పాత్రలకు, డైలాగ్స్‌కు ఉన్న క్రేజ్ వల్ల థియేటర్లలో కూడా దీని విజయం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు.
నిజానికి రెండో రిలీజ్ గా వచ్చిన కొన్ని సినిమాలు ఇటీవల అద్భుతంగా ఆడాయి. మంచి కలెక్షన్లను రాబట్టాయి. హర్షవర్ధన్ రాణే నటించిన `సనమ్ తేరి కసమ్` రెండో రిలీజ్ గా వచ్చి సంచలన విజయం సాధించిన తర్వాత అసలు సెకండ్ రిలీజ్ మార్కెట్ ఎలా ఉంటుందో అందరికీ అర్థమైంది. ఆ తర్వాత వరుస పెట్టి పలు కల్ట్ క్లాసిక్ సినిమాలను రెండో రిలీజ్ చేసి బంపర్ హిట్లు కొట్టారు. అలాగే ఫ్లాప్ సినిమా ఆవారాపన్ సీక్వెల్ ఆవారాపన్ 2 ఇటీవలే విడుదలై మొదటిరోజే 22 కోట్ల వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది. సన్నీడియోల్ లాంటి పెద్ద స్టార్ నటించిన సినిమా పోటీలో ఉన్నా ఇమ్రాన్ హష్మి నటించిన ఈ చిత్రం రికార్డులు తిరగరాయడం చర్చగా మారింది. ఇప్పుడు మీర్జాపూర్ ఓపెనింగ్ డే వసూళ్లు కూడా అందరికీ షాక్ ఇవ్వబోతున్నాయన్న చర్చ వేడెక్కించేస్తోంది. ఇదంతా చూస్తుంటే మారిన ఆడియెన్ అభిరుచిని ట్రేడ్ అంచనా వేయాల్సిన పరిస్థితి ఉంది. హీరోల ముఖాలతో పని లేకుండా స్టార్ డమ్ ని చూడకుండా మంచి కథ, కంటెంట్ ఉంటే జనం ఆదరిస్తున్నారని కూడా ఈ సన్నివేశం నిరూపిస్తోంది.