మిరాయ్ అరుదైన రికార్డు.. మరే సినిమాకు సాధ్యం కాదేమో?

కొన్నిసార్లు అంతే. అసాధ్యమన్నది కూడా సాధ్యమవుతుంటుంది. కలలో కూడా ఊహించని కొన్ని రికార్డుల్ని కొందరు బ్రేక్ చేస్తుంటారు.;

Update: 2025-09-14 03:45 GMT

కొన్నిసార్లు అంతే. అసాధ్యమన్నది కూడా సాధ్యమవుతుంటుంది. కలలో కూడా ఊహించని కొన్ని రికార్డుల్ని కొందరు బ్రేక్ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి రికార్డునే క్రియేట్ చేస్తోంది మిరాయ్ మూవీ. విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకొని.. పక్కా హిట్ మూవీగా బజ్ తెచ్చుకోవటమే కాదు.. విడుదల తర్వాత అంతకు మించి అన్నట్లుగా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. బాక్సాఫీసు వద్ద అదిరే వసూళ్లను రాబడుతోంది. ఇలాంటి వేళ.. ఒక అగ్నిపరీక్ష మిరాయ్ కు ఎదురైంది భారత్ - పాక్ మ్యాచ్ రూపంలో.

సాధారణంగా దాయాదితో క్రికెట్ మ్యాచ్ అంటేనే.. ఆ రోజున ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా పక్కన పెట్టేసి.. టీవీలకు అతుక్కుపోవటం.. రోడ్లు మొత్తం ఖాళీగా మారటం మామూలే. అందునా.. ఆదివారం అంటే.. ఇక సదరు మ్యాచ్ కు ఉండే ఆదరణే వేరుగా ఉంటుంది. ఇలాంటి వేళ.. మిరాయ్ దూకుడుకు కాస్త బ్రేకులు పడతాయని భావించారు. అనూహ్యంగా అందుకు భిన్నమైన సన్నివేశం ఇప్పుడు ఆవిష్క్రతమవుతోంది.

ఆసియా కప్ టోర్నీలో భాగంగా దుబాయ్ లో ఆదివారం జరగనున్న భారత్ - పాక్ మధ్య హైఓల్టేజ్ క్రికెట్ మ్యాచ్ కారణంగా మిరాయ్ వసూళ్లకు ఆటంకం కలుగుతుందని భావించారు. అయితే.. అనూహ్య పరిణామాలతో ఆదివారం సినిమా టికెట్లు మొత్తం దాదాపుగా బుక్ అయిపోవటం.. 5 శాతం టికెట్లు మాత్రమే ఖాళీగా ఉండటం కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక స్క్రీన్లు ఉండే హైదరాబాద్ మహానగరంలో మిరాయ్ మూవీకి ఆదివారం టికెట్లను ఆన్ లైన్ లో చూడగా.. ఆ థియేటర్.. ఈ థియేటర్ అన్న తేడా లేకుండా అన్ని థియేటర్లలోనూ, అన్ని షోలలోనూ శనివారం అర్థరాత్రి వేళకు 5 నుంచి 10 శాతం టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అంటే.. ఆదివారం ఉదయం నాటికి ఆ టికెట్లు బుక్ అయిపోతాయి.

ఎంతటి క్రేజీ మూవీ అయినా.. భారత్ - పాక్ మధ్య మ్యాచ్ అంటే.. సదరు సినిమాను పక్కన పెట్టేసి మ్యాచ్ లో లీనమైపోవటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా తాజా పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఏమిటి? అన్నది చూస్తే.. ఒకటి ఆసియా కప్ లో భాగంగా పాక్ తో భారత్ మ్యాచ్ ఆడటాన్నిమెజార్టీ అభిమానులు ఇష్టపడటం లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న ఈ మ్యాచ్ కు దూరంగా ఉండాలని అభిమానులు మాత్రమే కాదు దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇదే సమయంలో మిరాయ్ లాంటి క్రేజీ మూవీ అందుబాటులోకి ఉండటంతో మ్యాచ్ మీద తమకున్న ఆగ్రహాన్ని.. మూవీకి షిఫ్ట్ కావటం ద్వారా తమ నిరసనను తెలియజేస్తున్నట్లుగా చెప్పాలి.

కారణం ఏమైనా.. భారత్ - పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న వేళలో.. ఒక మూవీ టికెట్లు ఫుల్ గా బుక్ అయిపోయిన అరుదైన రికార్డు మిరాయ్ కు మాత్రమే దక్కిందని చెప్పాలి. ఈ తరహా మేజిక్.. సమీప భవిష్యత్తులో మరే మూవీకి సాధ్యం కాదని మాత్రం చెప్పక తప్పదు. మిరాయా.. మజాకానా!

Tags:    

Similar News