రియా కపూర్‌కు ఊహించని షాక్.. కోట్ల విలువైన ఇయర్‌రింగ్స్ మాయం!

బాలీవుడ్ ఫ్యాషన్ ప్రపంచంలో ప్రముఖ స్టైలిస్ట్, నిర్మాత అయిన రియా క‌పూర్‌కు సంబంధించిన ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.

Update: 2026-06-21 03:43 GMT

బాలీవుడ్ ఫ్యాషన్ ప్రపంచంలో ప్రముఖ స్టైలిస్ట్, నిర్మాత అయిన రియా క‌పూర్‌కు సంబంధించిన ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫ్యాషన్ ఈవెంట్ అయిన మెట్ గాలా కోసం అద్దెకు తీసుకున్న రూ.1.35 కోట్ల విలువైన డైమండ్ చెవి పోగులు అదృశ్యమవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం, రియా కపూర్‌కు గత ఏడు సంవత్సరాలుగా మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న స‌వ్లీన్ సింగ్ ఈ ఖరీదైన ఆభరణాలను తన హ్యాండ్‌బ్యాగ్‌లో తీసుకెళ్తున్నారు. న్యూయార్క్‌లో జరగనున్న మెట్ గాలా కార్యక్రమంలో వినియోగించేందుకు ముంబైకి చెందిన రెండు ప్రముఖ జ్యువెల్లరీ సంస్థల నుంచి ఈ చెవి పోగులను రియా అద్దెకు తీసుకున్నారు.

ఏప్రిల్ 27 రాత్రి ముంబై నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్ లో బయలుదేరిన రియా కపూర్ టీమ్ ముందుగా దుబాయ్ చేరుకుని, అక్కడి నుంచి న్యూయార్క్‌కు ప్రయాణించింది. ఏప్రిల్ 28 సాయంత్రం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నడీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్న త‌ర్వాత టీమ్ ది పియర్ హోటల్‌లో బస చేసింది.హోటల్‌కు చేరుకున్న తర్వాత మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ ఆభరణాల బాక్సులను తెరిచి వాటిని టీమ్ సభ్యురాలు షిరీన్‌కు అందించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే రెండు బాక్సులు పూర్తిగా ఖాళీగా ఉండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. దీంతో వెంటనే టీమ్ లో ఆందోళన నెలకొంది.

మిస్ అయిన ఆభరణాల్లో ఒక జత పచ్చరాళ్లతో కూడిన డైమండ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉండగా, వాటి విలువ సుమారు రూ.66 లక్షలు. మరో జత జాంబియన్ ఎమరాల్డ్ స్టోన్స్‌తో రూపొందించిన గోల్డ్ బోర్డర్ చెవి పోగుల విలువ రూ.69 లక్షలుగా గుర్తించారు. మొత్తం కలిపి ఆభరణాల విలువ రూ.1.35 కోట్లకు చేరుకుంది. భారత్‌కు తిరిగి వచ్చిన అనంతరం సవ్లీన్ సింగ్ ముంబైలోని సహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 303(2) కింద గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన ప్రతి దశను పరిశీలిస్తున్నారు. ముంబై ఎయిర్‌పోర్ట్ లోనా, దుబాయ్ ట్రాన్సిట్ సమయంలోనా, విమాన ప్రయాణంలోనా, లేక న్యూయార్క్ చేరుకున్న తర్వాతనా ఆభరణాలు మాయమయ్యాయన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఎయిర్‌పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్, ప్రయాణ రికార్డులు, హోటల్ వివరాలను సేకరిస్తున్న అధికారులు ఈ హై ప్రొఫైల్ జ్యువెలరీ మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ వర్గాల్లో ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News