మెహర్ రమేష్ ఇంట మొదలైన పెళ్లి సందడి.. పవన్ కళ్యాణ్ తో స్పెషల్ బాండింగ్!
ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతుంటే.. అటు సెలబ్రిటీల వారసులు కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు
ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతుంటే.. అటు సెలబ్రిటీల వారసులు కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూతురు వివాహానికి సిద్ధమవుతుండగా.. మరొకవైపు టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కూతురు కూడా వివాహానికి సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ఈ అమ్మాయి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు మెహర్ రమేష్ ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. అందులో భాగంగానే మెహర్ రమేష్ సినీ ఇండస్ట్రీ పెద్దలకు, ప్రముఖులకు, రాజకీయ నాయకులకు వివాహ పత్రికను ఇస్తూ స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ను స్వయంగా ఆహ్వానించడానికి మెహర్ రమేష్ వెళ్లారు.ఈ మేరకు ఒక స్పెషల్ పోస్టును పంచుకుంటూ పవన్ కళ్యాణ్ తో ఉన్న స్పెషల్ బాండింగ్ ను అభిమానులతో షేర్ చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మెహర్ రమేష్ తెలుగు వారే అయినప్పటికీ కన్నడ ఇండస్ట్రీ ద్వారా దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆంధ్రావాలా సినిమాను రీమేక్ చేస్తూ వీర కన్నడిగా అనే సినిమాతో కన్నడ సినీ పరిశ్రమ ద్వారా దర్శకుడిగా పరిచయమైన ఈయన.. ఆ తర్వాత మరోసారి ఒక్కడు సినిమాను అజయ్ పేరిట మళ్లీ కన్నడలో రీమేక్ చేశారు. ఇక 2008లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన కంత్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈయన.. బిల్లా, శక్తి, షాడో, భోళాశంకర్ ఇలా పలు చిత్రాలు చేశారు. కానీ సక్సెస్ మాత్రం లభించలేదు.
ఇకపోతే మెహర్ రమేష్ కి చిరంజీవి కుటుంబంతో బంధుత్వం ఉన్న విషయం తెలిసిందే. ఆ సాన్నిహిత్యంతోనే ఎక్కువగా మెగా కుటుంబంతో కలిసి కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన కూతురి పెళ్లి జరగబోతున్న క్రమంలో స్వయంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సోదర సమానుడైన పవన్ కళ్యాణ్ ను కలిసి తన కూతురి వివాహానికి సతీ సమేతంగా కుటుంబంతో రావాలి అని ఆహ్వానించారు. ఇక అనంతరం పవన్ కళ్యాణ్ ను తన కూతురు పెళ్లికి ఆహ్వానిస్తున్న ఫోటోని .. మరొకవైపు తన పెళ్లి నాటి ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు మెహర్ రమేష్.
ఫోటోలను పంచుకుంటూనే ఒక నోట్ షేర్ చేశారు. "కొన్నేళ్ల క్రితం మా పెళ్లిని చూసి మా జంటను ఆశీర్వదించడానికి అన్న గారు పవన్ కళ్యాణ్ చాలా దూరం నుండి విజయవాడకు వచ్చారు. ఇక ఈరోజు మళ్లీ నా కూతురు పెళ్లికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా గౌరవప్రదమైన హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ను పిలవడం అదృష్టంగా భావిస్తున్నాను. అప్పుడు ఆయనే నా పెళ్లి కోసం అని విజయవాడకు వచ్చారు. ఇప్పుడు నా కూతురు పెళ్లికి విజయవాడలోనే ఉన్నారు. కాలం మారుతోంది. తరాలు పెరుగుతున్నాయి. కానీ సోదర బంధం శాశ్వతంగా నిలిచే ఉంటుంది" అంటూ క్యాప్షన్ జోడించారు. మొత్తానికైతే మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో అప్పటి పవన్ కళ్యాణ్ కి ఇప్పటి పవన్ కళ్యాణ్ కి మధ్య చాలా తేడాలు ఉన్నాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ యంగ్ లుక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు