మెగాస్టార్ సినిమాకు తప్పని పైరసీ తిప్పలు.. మండిపడుతున్న ఫ్యాన్స్
సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. మూవీ థియేటర్లలోకి రిలీజైన గంటల టైమ్ లోనే దానికి ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ లో పైరసీ కాపీలు వచ్చేస్తున్నాయి.;
సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. మూవీ థియేటర్లలోకి రిలీజైన గంటల టైమ్ లోనే దానికి ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ లో పైరసీ కాపీలు వచ్చేస్తున్నాయి. దీంతో ఆడియన్స్ రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫోన్ లోనే HD ప్రింట్ సినిమాలు చూసేస్తున్నారు. అలా చూసే వారికి అది చాలా మామూలు విషయం కానీ సినీ ఇండస్ట్రీలో ఉండేవారికి మాత్రమే అదెంత నష్టాన్ని కలిగిస్తుందో అవగాహన ఉంటుంది.
కలెక్షన్లకు అడ్డుకట్ట వేస్తున్న పైరసీ
స్టార్ సినిమాలకు నిర్మాతలు భారీగా బడ్జెట్ ఖర్చు పెట్టి తీస్తుంటారు. పెట్టిన డబ్బును తిరిగి రికవరీ చేసుకునేందుకు నిర్మాతలు నానా పాట్లు పడుతుంటే ఈ పైరసీ భూతం వారి ఆశలకు అడ్డుగా నిలుస్తుంది. కొత్త సినిమాలను త్వరగా చూడాలనుకునే ప్రజల డిమాండ్ ను ఆసరాగా చేసుకుని ఏర్పడిన పైరసీ, ఫోన్ లేదా మైక్రో కెమెరా ద్వారా సినిమా మొత్తాన్ని థియేటర్లలో షూట్ చేసి దాన్ని వివిధ మార్గాల ద్వారా వెబ్‌సైట్ హ్యాండర్లకు పంపించి పైరసీని వ్యాప్తి చేస్తారు.
ఈ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవరూ పైరసీని ఆపలేకపోతున్నారు. దీంతో పైరసీని అరికట్టడం కలగానే మిగిలిపోతుంది. ఫ్లాపు సినిమాల నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాల వరకు ప్రతీ సినిమానూ పైరసీ చేసి ఆన్‌లైన్ లో పెట్టి క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడా పైరసీ భూతం బెడద మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు కూడా వచ్చింది.
పైరసీ పై మెగా ఫ్యాన్స్ ఫైర్
చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా, సినిమా రిలీజైన 24 గంటల్లోపే పైరసీ కాపీ అందుబాటులోకి రావడం ఆందోళనకు గురి చేస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందనే ఆనందంలో ఉన్న మెగా ఫ్యాన్స్ ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ వల్ల సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందని, దీనిపై పోలీసులు త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.