రూ.25,000 ధరకు సోలార్ కారు: ఒక గ్రామస్థుడి అద్భుత ఆవిష్కరణ
నైపుణ్యం ఉండాలే కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని గుజరాత్‌కు చెందిన సాధుల్‌భాయ్ చావడా నిరూపించారు.;
నైపుణ్యం ఉండాలే కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని గుజరాత్‌కు చెందిన సాధుల్‌భాయ్ చావడా నిరూపించారు. గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ కారణంగా దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యుడు సతమతమవుతున్న వేళ కేవలం రూ.25,000 నుండి 30,000 ఖర్చుతో అతడు ఒక సోలార్ కారును తయారు చేశారు. వినూత్న ఆలోచనలకు రూపం ఇస్తే అవి సామాన్యుడి జీవితాన్ని ఎలా మారుస్తాయో చెప్పడానికి ఈ కారు ఒక నిలువెత్తు నిదర్శనం. గుజరాత్ వీధుల్లో ఎటువంటి శబ్దం లేకుండా ప్రయాణిస్తున్న ఈ కారు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధులభాయ్ ఈ కారును రూపొందించడానికి ఎటువంటి ఖరీదైన విడిభాగాలను వాడలేదు. పాత ఎలక్ట్రిక్ బైక్ విడిభాగాలు.. ఐరన్ స్క్రాప్ (ఇనుప తుక్కు).. పాత స్కూటీ టైర్లను సేకరించి ఈ వాహనాన్ని సిద్ధం చేశారు. తన ఇంట్లోనే స్వయంగా వెల్డింగ్ పనులు చేసుకుంటూ.. ప్రతి భాగాన్ని ఎంతో జాగ్రత్తగా అమర్చారు. ఇతరులు పనికిరాదని పారేసిన వస్తువులనే ముడిసరుకుగా మార్చుకుని.. పర్యావరణానికి మేలు చేసే ఒక అద్భుతమైన రవాణా సాధనాన్ని ఈ ఔత్సాహిక విలేజర్ సృష్టించారు.
ఈ కారు పనితీరు విషయానికి వస్తే.. దీనిపై రెండు 100 వాట్ల సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. ఇవి పగటిపూట కారు నడుస్తున్నప్పుడే బ్యాటరీలను ఛార్జ్ అవుతుంటాయి. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ అయితే ఈ వాహనం 50 నుండి 60 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. దీని కోసం ఒక్క రూపాయి కూడా ఇంధనంపై ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సూర్యరశ్మి లేని రాత్రి సమయాల్లో కూడా నిల్వ ఉన్న బ్యాటరీ శక్తితో ఈ కారు సాఫీగా సాగుతుంది.
గ్రామీణ ప్రాంత రోడ్లకు అనుగుణంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈ కారు ప్రయాణిస్తుంది. ఇందులో ముగ్గురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ప్రయాణీకుల కోసం చిన్న ఫ్యాన్.. సంగీతం వినడానికి మ్యూజిక్ సిస్టమ్‌ను కూడా ఆయన ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే బ్యాటరీ మార్చాల్సి వచ్చిందని.. నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువని సాధుల్‌భాయ్ గర్వంగా చెబుతున్నారు.
ఈ ఆవిష్కరణ కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయం మాత్రమే కాదు. ఇది `మేక్ ఇన్ ఇండియా` స్ఫూర్తికి అసలైన అర్థం. పరిశోధనకు ఖరీదైన ల్యాబ్‌లు.. భారీ పెట్టుబడులు లేకపోయినా.. పట్టుదల ఉంటే స్థానిక వనరులతోనే ప్రపంచ స్థాయి సమస్యలకు పరిష్కారాలు కనుగొనవచ్చని ఇది నిరూపిస్తోంది. భవిష్యత్తు ఆవిష్కరణలు కేవలం పెద్ద పెద్ద పరిశ్రమల నుండే కాకుండా.. ఇలాంటి సామాన్యుల మేధస్సు నుండి కూడా పుడతాయని సాధుల్‌భాయ్ చావడా చాటిచెప్పారు.
సోలార్ పవర్ కారు కాకుండా నీటితో నడిచే కార్లను తయారు చేస్తున్న వ్యక్తుల గురించి కూడా వింటూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి నీటితో నడిచే కార్ ని కనుగొనడం .. దానిపై పరిశోధనలను కొనసాగించడం ఆసక్తిని రేకెత్తించింది. ఇంకా తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయగలిగే లేదా నడపగలిగే కార్లను కనుగొన్న వారున్నారు.
నీటితో నడిచే కార్లు వస్తాయా?
నీటితో నడిచే కార్ల గురించి వినిపించే వార్తలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు యువకులు, మెకానిక్‌లు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని పోలిన పద్ధతిలో నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టి ఆ గ్యాస్‌ను ఇంధనంగా వాడుతూ కార్లు-బైక్‌లను నడిపించే ప్రయత్నాలు చేశారు. అయితే ఇవి పూర్తిస్థాయిలో వాణిజ్యపరంగా అందుబాటులోకి రాకపోయినా.. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనే సామాన్యుడి తపనకు ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇలాంటి ప్రయోగాలు చేసే వారు ఎక్కువగా పాత ఇంజన్లను మార్పు చేసి.. తక్కువ బడ్జెట్‌లో వినూత్న రవాణా సాధనాలను సృష్టిస్తున్నారు.
మరోవైపు తక్కువ ఖర్చుతో నడిచే వాహనాల విభాగంలో కర్ణాటకకు చెందిన నితిన్ గద్కరీ మెచ్చిన `చిన్న ఎలక్ట్రిక్ కార్లు`.. దేశవ్యాప్తంగా పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన `పెడల్-అసిస్టెడ్ సోలార్ సైకిళ్లు` ప్రాచుర్యం పొందాయి. అలాగే, తుప్పు పట్టిన ఇనుము -పాత బైక్ ఇంజన్లతో కేవలం 50 వేల రూపాయల లోపే మినీ జీపులను, ట్రాక్టర్లను తయారు చేసిన గ్రామీణ ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు. ఈ ఆవిష్కరణలు భారీ కార్పొరేట్ సంస్థల కార్ల కంటే తక్కువ వేగాన్ని కలిగి ఉన్నా.. స్థానిక అవసరాలకు, పొలం పనులకు.. తక్కువ దూర ప్రయాణాలకు అత్యంత పొదుపైన మార్గాలుగా కనిపిస్తున్నాయి.